పేదల కోసం పోరాడుతున్న సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. భూ పోరాటంలో అరెస్టయిన సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, నాయకులు అప్పలరాజు విడుదలైన సందర్భంగా సుజాతనగర్‌లో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ల్యాండ్ పూలింగ్‌ను తమతో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఎక్కడో పద్మనాభపురం, ముదపాక శివారు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిస్తే ఏలా ఉంటారని ప్రశ్నించారు. నివాసమున్నచోటే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ఏ విధంగా ఇళ్ల స్థలాలిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పాలన్నారు. సిపిఎం నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటం మాత్రం ఆగదని స్పష్టంచేశారు.