కాంతిరేఖ క్యూబా

అంధకారంలో చిక్కుకున్న ప్రపంచానికి క్యూబా ఓ కాంతిరేఖ. భయోత్పాతంలో ఉన్న మానవాళికి ఓ ధైర్యం. ఆపదలో ఉన్న దేశాలకు కొండంత అండ! ప్రపంచ పటంలో కష్టపడి వెతికితేకాని కనిపించని ఓ చిన్న దేశం క్లిష్ట సమయంలో నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా, అమెరికా వంటి అగ్రదేశం కాడి పడేసి, కరోనా (కోవిడ్‌-19) కాటుకు దిక్కుతోచక విలవిలలాడుతున్న వేళ ఆ రక్కసితో ధైర్యంగా పోరాడటమే కాకుండా అనేక దేశాలకు వైద్య బృందాలను పంపడం, ఔషధాలను సరఫరా చేయడం క్యూబాను వర్తమాన ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించడంతో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్న ఇటలీతో పాటు అనేక దేశాలకు క్యూబా సాయం చేస్తోంది. వెనిజులా, నికరాగువా, జమైకా లాటిన్‌ అమెరికా, కరేబియన్‌, ఆఫ్రికా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. క్యూబా వైద్యులు, సహాయ సిబ్బంది వందల సంఖ్యలో ఆ దేశాలలో ఇప్పటికే సేవల్లో నిమగమయ్యారు. దాదాపుగా 14 దేశాల్లో క్యూబా వైద్య సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో సేవలందిస్తుండగా, మరో 15 దేశాలు ఔషధాలు సరఫరా చేయాలని కోరాయి. అమెరికాతో పాటు, ప్రపంచంలో ఏ దేశం కోరినా తమ శక్తిమేరకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ఆ దేశ ఔదార్యానికి నిదర్శనం. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఐదుగురు రోగులున్న బ్రిటన్‌కు చెందిన ఒక నౌకను తమ దేశంలోకి అనుమతించడం కూడా ఇటువంటి చర్యే! 600 మందికి పైగా ప్రయాణీకులున్న ఆ నౌకలో అప్పటికే పదుల సంఖ్యలో ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. అనేక దేశాలు తిరస్కరించిన ఆ నౌకను అనుమతించడమే కాకుండా, రోగగ్రస్తులైన వారికి వైద్య సహాయం కూడా అందించి పంపడంతో బ్రిటన్‌ ప్రజల మనసులను క్యూబా గెలుచుకుంది. 

తనను తాను, ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ధోరణి దీనికి భిన్నం. అహంభావం, నిర్లక్ష్యం కారణంగా సొంత ప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిన ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌, క్యూబా చేస్తున్న సాయంలోనూ లొసుగులు వెతకడం, దానిని తిరస్కరించాలని ఇతర దేశాలకు సూచించడం దురదృష్టకరం. అయితే, క్యూబా వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి మృత్యువుతో చేస్తున్న పోరాటం అన్ని దేశాలకూ తెలుసు. అందుకే ట్రంప్‌ సూచనకు స్పందన శూన్యం! పైగా ఒక దేశం తరువాత మరో దేశం క్యూబా సహాయాన్ని అర్థిస్తున్నాయి. క్యూబా సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. ఇది అగ్రరాజ్యపు అభిజాత్యానికి చెంపపెట్టు లాంటిది. భవిష్యత్‌ పరిణామాలకూ సంకేతాలన్న విశ్లేషణలు వస్తున్నాయి. క్యూబా సాయానికి వంకలు వెతికిన అమెరికా తాను స్వయంగా బాధిత దేశాలకు చేసిందేమీ లేదు. పైగా కష్టకాలంలోనూ ఇరాన్‌ వంటి దేశాలపై ఆంక్షలు కొనసాగిస్తోంది. జర్మనీలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారవుతోందన్న విషయం తెలియగానే, దానిని ఇతర దేశాలకు అందుబాటులోకి రాకుండా చేయడానికి ప్రయత్నించింది. అణువణువునా వ్యాపార ప్రయోజనాలు, లాభాల లెక్కలు తప్ప మరేమీ పట్టని వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికాకు ఈ తరహా కుట్రలు కొత్తేమీ కాదు!

అదే సమయంలో, అడుగడుగునా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న క్యూబా, బాధిత దేశాలకు అండగా నిలవడం ఇదే మొదటి సారి కాదు. 1960లో క్యూబా అధ్యక్షుడిగా కాస్ట్రో బాధ్యతలు చేపట్టిన ఏడాదికే చిలీ భూకంప బాధితుల కోసం వైద్యుల బృందాన్ని పంపిన చరిత్ర ఆ దేశానిది. అప్పటి నుండి లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించడానికి క్యూబా ముందే ఉంటుంది. 1980వ దశకంలో డెంగూ వంటి జ్వరాలు విరుచుకు పడ్డప్పుడు వ్యాక్సిన్‌ తయారు చేసి, ప్రపంచానికి అందించడానికి క్యూబన్‌ శాస్త్రవేత్తలు నిర్విరామ కృషి చేశారు. పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం 2005 నుండి 2017 వరకు ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లోని 35 లక్షల మంది ప్రజలకు క్యూబా వైద్య బృందాలు సహాయం చేశాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఎబోలా వైరస్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా క్యూబా వైద్య బృందాలు పదేపదే మృత్యువుకు ఎదురు నిలుస్తున్నాయంటే దానికి కారణం తాము దృఢంగా నమ్మి, ఆచరిస్తున్న మార్గమే! అది ఫైడల్‌ కాస్ట్రో, చే గువేరాలు బాటలు వేసిన మార్గం! కష్టాలు, కన్నీళ్లను ఎదుర్కొని సమైక్యంగా ముందుకు నడిపించే ఆ సామ్యవాద మార్గంతోనే మానవాళి మనుగడకు భవిష్యత్తులోనూ భరోసా!