పేదల ఆశలు, ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్న ప్రభుత్వం

నేను కరోనా వైరస్‌ వల్ల చనిపోను. దానికన్నా ముందు ఖచ్చితంగా ఆకలితో చనిపోతాను' ఈ మాటలు పాత ఢిల్లీలో ఒక చిన్నపాటి సంఘీభావ కార్యక్రమంలో వినబడ్డాయి. కొద్దిమంది మిత్రులతో కలిసి ఒక వెయ్యి మంది అనాథలకు భోజనాలు ఏర్పాటుచేసే ప్రయత్నంలో అనేకమంది ప్రజలు వెలిబుచ్చిన ఈ ద్ణుఖపూరిత మాటలను నేను పన్నెండుసార్లకు పైగా విన్నాను. 'పెద్దనోట్ల రద్దు వలన పడిన బాధలు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధతో పోలిస్తే పెద్ద లెక్కలోని విషయమే కాద'ని ఇంకొక వ్యక్తి అన్నాడు.ఒక గంట తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహాయక చర్యల ప్రకటనను నేను ఆందోళనగా చదివి, నిరాశ చెందాను. కరోనా వైరస్‌ సోకకుండా ఉండడానికి చేపట్టిన 'లాక్‌డౌన్‌' ఫలితంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావం నుంచి ప్రజలను రక్షించడమే తమ లక్ష్యం అని ఆమె పేర్కొంది. 'ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడరు' అని ఆమె వాగ్ధానం చేశారు.ఒక్కొక్క కుటుంబానికి అదనంగా ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు రూ.1000, జన్‌ధన్‌ ఖాతాలు ఉన్న మహిళలకు మూడు నెలలకు రూ.1500, ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్లు, ప్రస్తుతం కొనసాగుతున్న పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2000 బదిలీల లాంటి చర్యలు ప్రజల ఇబ్బందులను గట్టెక్కిస్తాయని ఆమె నిజంగా విశ్వసించారా?ఆమె గానీ... ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని ఏ విధంగా ఎదుర్కోవాలో జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన మూడు ప్రసంగాలలో గానీ...ఈ విపత్తు ఫలితంగా భారతదేశం లోని కోట్ల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, నిరాశ్రయులైన పేదలపై ఏర్పడే ప్రభావాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో సహాయ చర్యలకు గుర్తుగా ఒక్క పూటకు కొంచెం భోజనం, ప్రతి కుటుంబ ఖాతాలో కొద్ది డబ్బును బదిలీ చేస్తే ఇప్పుడు పేదలు ఎదుర్కొంటున్న సునామీ నుంచి రక్షణ పొందుతారని సీతారామన్‌ నమ్ముతున్నట్టు అనిపించింది. ఈ సహాయక చర్యల్లో వాటి అమలుకు సంబంధించిన అవరోధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు తమ ఖాతాలో ఉన్న డబ్బును ఏ విధంగా బదిలీ చేసుకుంటారు? అదేవిధంగా వీధి పిల్లలు, నిరాశ్రయులు, వికలాంగులు, దూరప్రాంతాలలో నివసించే సంచార జాతులు, ఆకలిదప్పులతో అలమటించే నిస్సహాయ ప్రజలకు ఖాతాలూ, కార్డులూ రెండూ ఉండవు.ముఖ్యంగా, విచారంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల పైన, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఫలితంగా నాశనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. లాక్‌డౌన్‌ ఫలితంగా మొదటి రెండు రోజులలో జరిగిన నష్టం పెద్ద నోట్ల రద్దు వలన ఏర్పడిన మొత్తం ప్రభావం కన్నా చాలా ఎక్కువ అని...ఇప్పటికే తీవ్రమైన పతనం దిశగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అగాథం లోకి జారిపోయే ప్రమాదంలో ఉందని...ఒక ఛానల్‌ ప్రసారం చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త జయతీఘోష్‌ అంచనా వేశారు. ఈ భయంకరమైన పరిస్థితిని సూచించే వాస్తవ దృష్టితో ఆమె చేసిన ఈ అంచనాను గుర్తించడానికి ఆర్థిక శిక్షణ కూడా అవసరం లేదు.

పంట పండించే వారెవరు? దానిని అమ్మే వారెవరు? చిన్న, మధ్య తరహా సంస్థలన్నీ మూతపడ్డాయి. అసంఘటిత కార్మికులు పని చేసే నిర్మాణ రంగం, హోటళ్లు, టైలరింగ్‌ షాపులను కూడా మూసివేశారు. 'నేను వీధుల్లో పెరిగాను. నాకు నా కుటుంబం అంటూ ఏదీ లేదు. నేను తందూరీ రొట్టెలు చేసి రోజుకు ఐదు వందలు సంపాదిస్తాను. ఈ రోజు రెండు రొట్టెల కోసం మీ ముందు నా చేతులు చాపుతున్నాను' అని ఒక నిరాశ్రయుడు నాతో చెప్పాడు. అప్పుడు నేను సిగ్గుతో నేల చూపులు చూశాను.మేము భోజనాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో క్యూలైన్లలో ఎదురు చూస్తూ వేల సంఖ్యలో నిరాశ్రయులైన పేదలు నిలబడి ఉన్నారు. భోజనాలు తీసుకొచ్చే వ్యక్తి కోసం తాము ఆరు గంటలుగా కూర్చున్నామని, దయతో అందజేసినప్పటికీ భోజనం చాలా కొద్దిగా పెట్టారని, అది తమ కడుపులు నింపలేదని అనేక మంది అన్నారు.ఎవరో దయగల మహానుభావుడు ఒక ప్రాంతంలో అన్నదానం చేస్తున్నాడనే పుకారు లేస్తే, ఆ దగ్గరలో తొక్కిసలాటలు జరుగుతాయి. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ వెనుకబడి పోతారు. తీసుకొచ్చే ఆహారం చాలీచాలకుండా ఉంటుంది. ఈ సందర్భంగా చాలా మంది తమ విలువను, గౌరవాన్ని పోగొట్టుకుంటారు. వారికి పని కావాలి, జాలి కాదు. ఒకవేళ ప్రభుత్వం వారి పనిని వారి నుంచి లాక్కొని వెళ్తే, వారి మనుగడ ప్రయివేట్‌ ఛారిటీ సంస్థల బాధ్యత కాకుండా, ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. ఆకలి భయంకరంగా పెరిగిపోతుంటే, కనీసం ఇంకొక మూడు వారాల పాటు ఇటువంటి బాధలు భరించాల్సి ఉంటుంది.నగరాలలో భోజనం, పని లేకపోవడంతో వారి మనుగడ కోసం వారి గ్రామాలకు తిరిగి వెళ్ళడమే వారి ముందున్న అవకాశం. కానీ కొద్ది సమయం లోనే ప్రధాని లాక్‌డౌన్‌ ప్రకటన చేయడం వల్ల రైళ్లు, బస్సులు అర్థాంతరంగా రద్దయ్యాయి. భారత ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైద్య సిబ్బందిని సమకూర్చి ప్రత్యేక విమానాలలో తరలింపునకు ఏర్పాట్లు చేసింది. కానీ దేశంలో ప్రతి ప్రాంతంలో పనులు, తిండిలేక ఒంటరైన మిలియన్ల కొద్దీ వలస కూలీల గురించి ఏ విధమైన బాధ్యత తీసుకోలేదు. ఒకవేళ వారు తమ సొంత గ్రామాలకు నడిచివెళ్ళే ప్రయత్నం చేస్తే, రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్న పట్టుదలతో ఉన్నవారు లేదా రహస్యంగా వెళ్ళాలనుకున్న వారిని...బలవంతంగా సైకిళ్ల పైన లేదా కాలినడకన తమ గ్రామాలకు వెళ్ళాలనీ.. కొన్ని సందర్భాల్లో వేల కిలోమీటర్లు, ఆకలినీ, దారి పొడవునా పోలీసులను తప్పించుకొని వెళ్ళే విధంగా ఒత్తిడి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లను హైవేల మీద పట్టుకొని వారికి నరకం చూపిస్తున్నారు.కొన్ని ఆరోగ్య సేవలను మెరుగు పరచడానికి మాత్రమే కొద్ది మొత్తంలో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తప్ప, పేదవారు ఈ కరోనా వైరస్‌కు గురైనప్పుడు వైద్యం చేయించుకోవడానికి అవసరమైన నిధుల హామీ ఏదీ ఇవ్వలేదు. వారు ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? డబ్బు చెల్లించాల్సి ఉంటుందా? వారి కోసం ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లు ఎక్కడ ఉంటాయి? మనం స్పెయిన్‌, న్యూజిలాండ్‌ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం, ప్రయివేటు ఆరోగ్య సేవా సంస్థలను కనీసం ఈ మహమ్మారి ఉనికి ఉన్నంతకాలం జాతీయం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే పేద ప్రజలు కేవలం ఆకలి తోనే కాక, ఈ వైరస్‌ వల్ల కూడా మరణిస్తారు.గతంలో లేని ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు నాయకత్వం వహిస్తున్న ప్రధాన మంత్రికి ద్వైపాక్షిక మద్దతు కోసం పిలుపులొస్తున్నాయి. ఈ యుద్ధంలో ప్రధాని తన కమాండర్‌ అని పి.చిదంబరం ప్రకటించారు. చాలా మంది ముఖ్యమంత్రులు దీనిని అంగీకరించారు. కానీ, తీవ్ర విఘాతం కలిగించే ఈ ప్రజా వ్యతిరేక లాక్‌డౌన్‌కు నేను మద్దతు ఇవ్వలేక పోతున్నందుకు విచారిస్తున్నాను. జాతీయ లాక్‌డౌన్‌లు లేకుండానే ఈ కరోనా వైరస్‌ మహమ్మారితో పోరాడిన దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాల నుంచి భారతదేశం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.ధనికులు, పేదలు అందరినీ సమానంగా చూడాలన్న కోరిక, ప్రజల పట్ల ప్రదర్శించాల్సిన జాలి, దయ, సామర్థ్యాలకు ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వం ఎంచుకున్న చర్యలు నిన్ను, నన్ను రక్షించవచ్చు. కానీ పేదల విషయంలో, ఆ చర్యలు వారి గౌరవప్రదమైన, ఆశాజనకమైన మనుగడకు ఉపకరించే అవకాశాలను నాశనం చేస్తాయి.