ప్రపంచంలో తలెత్తే ప్రతి మహమ్మారిని కచ్చితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి పరిశీలించాల్సిందే. ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన మౌలిక సేవలను నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం ధ్వంసం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలింది. అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రజలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఇల్లు, విద్య, ప్రభుత్వ రవాణా వంటి వాటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు వదిలి పెట్టాయి. సమాజం ఎదుర్కొనే ఏ సంక్షోభమైనా-అది ఆర్థికమైనా లేక సామాజికమైనా-ప్రభుత్వ విధానాల ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఫైనాన్స్ పెట్టుబడి- కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు, కోటీశ్వరుల-ప్రయోజనాలను పరిరక్షించేదిగానే వుంటుందే తప్ప కార్మికుల ప్రయోజనాలపై వుండదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ప్రభుత్వాల నుండి, పాలక వర్గాల నుండి అనేక విధాన ప్రకటనలు వెలువడ్డాయి. ఈ విధాన ప్రకటనల్లో తీవ్ర ప్రయాసలకు లోనవుతున్న నయా ఉదారవాద వ్యవస్థ లోని వైరుధ్యాలు, ప్రజల సంక్షేమం కన్నా ముందు తమ లాభాలే ముఖ్యమనుకునే పెట్టుబడిదారీవాదం సహజ ప్రతిస్పందనలు వున్నాయి.అమెరికా సామ్రాజ్యవాదం ఇంతకు ముందు ఎలా వ్యవహరించిందో ఇప్పుడూ అలానే వ్యవహరిస్తోంది. తన ఆదేశాలను ఆమోదించని దేశాలకు వ్యతిరేకంగా బెదిరింపులు, బల ప్రయోగాలకు దిగుతూనే వుంది. కరోనా వైరస్ తాకిడితో తీవ్రంగా దెబ్బతిని ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌పై ఆంక్షలను తొలగించడానికి ఈ సమయంలో కూడా తిరస్కరించింది. ఈ అక్రమ ఆంక్షల వల్ల ఇరాన్‌కు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు వున్న తృతీయ ప్రపంచ దేశాలకు చెందిన కంపెనీలపై ఆంక్షలు, వాణిజ్యం, రవాణా నిషేధం వుండడం వల్ల ఇరాన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక వెనిజులా విషయానికొస్తే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ఆంక్షలే కాకుండా, కరోనా సంక్షోభం నేపథ్యంలోనే అధ్యక్షుడు మదురోపై, ఆయన మంత్రివర్గ సహచరులపై నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నారని వారిపై బురద చల్లుతోంది. ఒక సార్వభౌమాధికార దేశాధినేతను హత్య చేయడానికి బహిరంగంగానే ఆహ్వానిస్తూ మదురో అరెస్టుకు దారి తీసే సమాచారం అందించిన వారికి 15 మిలియన్ల (కోటిన్నర) డాలర్ల బహుమతిని ఇస్తానని ప్రకటించింది. అంతటితో ఆగకుండా, కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తమకు అత్యవసర నిధులను అందచేయాలంటూ వెనిజులా చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తిరస్కరించడం వెనుక అమెరికా, దాని మిత్రపక్షాల హస్తం వుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని నిందిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ప్రచారం ప్రారంభించారు. దీన్ని 'చైనీస్ వైరస్' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ముప్పు గురించి సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేదంటూ చైనాపై ఆరోపణలు గుప్పించారు. చైనాతో జరిగే తమ ఆర్థిక, వాణిజ్య యుద్ధాల్లో తన బేరసారాల పరిస్థితిని పటిష్టపరచుకునేందుకు గానూ, చైనాను ఏకాకిని చేసేందుకు ఈ కరోనా వైరస్‌ను నిస్సిగ్గుగా ట్రంప్ ఉపయోగించుకున్నారు. దేశీయంగా కరోనా విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో కూడా నెలన్నర పాటు చైనా నుండి వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవడానికి ట్రంప్ సర్కార్ అనుమతించడం మరొక అంశం. మార్చి 29న మాస్కులు, గౌన్లు, పరీక్షా కిట్లతో కూడిన మొదటి విమానం న్యూయార్క్‌లో దిగింది. మరో 21 విమానాలు వివిధ అమెరికా నగరాలకు వెళ్ళాల్సి వున్నాయి.కరోనాకు సంబంధించి ట్రంప్ చైనాను బెదిరించలేరు. అమెరికా వెలుపల వున్న ప్రజల సంక్షేమం గురించి కూడా ట్రంప్ ప్రభుత్వానికి పట్టదు. వైరస్‌పై పోరులో భాగంగా క్యూబా వైద్య బృందాలను అనుమతించే దేశాలను అడ్డగించేందుకు ట్రంప్ చేస్తున్న యత్నాలతో ఈ విషయం స్పష్టమవుతోంది. క్యూబా వైద్య బృందాల పర్యటనలు, సాయం వల్ల ఆయా దేశాల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుం దంటూ కరేబియన్, లాటిన్ అమెరికా దేశాలను అమెరికా హెచ్చరిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదానికి గుత్తాధిపత్యం చాలా ముఖ్యమైనది, అదే అంతిమ లక్ష్యం కూడా. అంతేకానీ ప్రజల సంక్షేమం, వారి ఆరోగ్యం గురించి పట్టదు. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నపుడు, అమెరికా పాలక వర్గాలు, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ప్రాధాన్యత ఒక్కటే. కార్పొరేట్ సంస్థలను, బ్యాంకులను, ఆర్థిక పెట్టుబడుల కంపెనీలను ఈ సంక్షోభం నుండి బయట పడవేయడమే. ఇక్కడ వర్గ ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా వున్నాయి. కార్మిక వర్గం ముఖ్యంగా ప్రమాదపుటంచున వున్న వారి ప్రయోజనాలకు వారి జాబితాలో స్థానం లేదు. ఉదాహరణకు 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ కింద వందల కోట్ల డాలర్లను అమెరికా లోని కార్పొరేట్లకు అందచేశారు. అదే సమయంలో ఉద్యోగాలు కోల్పోయి, ఎలాంటి సామాజిక భద్రత లేకుండా వున్న వారికి ఒక్కో వ్యక్తికి కేవలం 1200 డాలర్లు చొప్పున నగదు బదిలీ చేశారు. ప్యాకేజీల కింద ఇంత మొత్తాల్లో అందుకున్నా అప్పటికే పెద్ద ఎత్తున ప్రారంభమైన లే ఆఫ్‌లు(కంపెనీ మూసివేతలు) ఏ మాత్రమూ ఆగలేదు. గత వారం రికార్డు స్థాయిలో 33 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. లే ఆఫ్‌ల నుండి కార్మికులకు, వారి వేతనాలకు రక్షణ కల్పించినా, స్కాండినేవియా దేశాలు, సామాజిక, ప్రజాతంత్ర సంప్రదాయాలు వున్న యూరప్ లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది చోటు చేసుకుంది. డెన్మార్క్‌లో, 75 శాతం వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. మరో 25 శాతం వేతనాలు కంపెనీలు చెల్లిస్తాయి. బ్రిటన్ లోని కన్జర్వేటివ్ ప్రభుత్వం ఇందుకు మినహాయింపు. ఇక్కడ కంపెనీల ఉద్యోగులకు 80 శాతం వేతనాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రమాదకరమైన వృత్తుల్లో వున్న కార్మికులకు అటువంటిదేమీ లేదు.
ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక కార్యకలాపాలు దెబ్బ తినకుండా చూడడం మితవాద ప్రభుత్వాల ప్రప్రథమ కర్తవ్యంగా వుంది. ఆ ప్రభుత్వాలు తక్షణమే 'హెర్డ్ ఇమ్యూనిటీ' అనే ఆలోచన అమలు చేశాయి. ఇన్ఫెక్షన్ వ్యాప్తి కాకుండా నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా ఇన్ఫెక్షన్ బారిన పడేలా ప్రజలను అనుమతించాయి. గణనీయమైన సంఖ్యలో అంటే దాదాపు జనాభాలో 80 శాతం మంది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వారు కోలుకుని రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. ఆ రకంగా సమాజం ఆ వైరస్ నుండి రోగనిరోధకతను పెంచుకుంటుంది. ఈ విధానానికి లాక్‌డౌన్‌లు అవసరం లేదు. పెద్ద సంఖ్యలో నిర్బంధాలు లేదా భౌతిక దూరాలు పాటించనవసరం లేదు. సాధారణ కార్యకలాపాలు సాగుతూనే వుంటాయి. బ్రిటన్ లోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం, నెదర్లాండ్స్ లోని మితవాద ప్రధాని, ఇటలీ నాయకత్వం, అధ్యక్షుడు ట్రంప్ వీరందరూ కూడా తమదైన రీతిలో ఈ ఆలోచనకు కట్టుబడ్డవారే. అయితే, ఈ ఇన్ఫెక్షన్ల స్థాయి పెరిగి మొత్తంగా తమ దేశాలను చుట్టుముట్టడం ప్రారంభించినపుడు వారు బలవంతంగా ఈ ఆలోచనను విడనాడాల్సి వస్తుంది. గత వారం వరకు ట్రంప్ ఈ వైరస్‌పై పోరాటం కన్నా ఆర్థిక వ్యవస్థ నిర్వహణే అధిక ప్రాధాన్యమంటూ చెబుతూ వచ్చారు. కానీ ప్రపంచం లోని మరే ఇతర దేశంలో లేని విధంగా అమెరికాలో ఒక్కసారిగా వైరస్ తాకిడి పెరగడంతో, చైనా గణాంకాలను కూడా అధిగమించడంతో, ప్రజల ప్రాణాలను కాపాడడం ముందు ముఖ్యం. తర్వాతే ఆర్థిక వ్యవస్థ అని గుర్తించారు. ప్రజల కన్నా లాభాలే ముఖ్యమనుకునే ఆ ఆలోచనే అమెరికా విపత్తును ఇంత కర్కశంగా ప్రపంచం కళ్ళ ముందు నిలబెట్టింది. బ్రెజిల్‌లో మరో ట్రంప్ వున్నారు. ఆయనే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో. వైరస్ ముప్పు తీవ్రతను అంగీకరించడానికి ఆయన నిరాకరిస్తూనే వున్నారు. పని చేయాలని, ఆర్థిక కార్యకలాపాలు సాగించాలని ప్రజలకు ఉద్బోధ చేస్తూనే వున్నారు. ఒకపక్క ఆయన ఈ పిలుపిస్తుంటే, మరోపక్క సుప్రీం కోర్టు, కాంగ్రెస్ (పార్లమెంట్)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అధ్యక్షుని నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రతి రోజూ ప్రభుత్వానికి నిరసనగా ప్రజలు తమ ఇళ్ళల్లో పాత్రలను మోగిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇటువంటి బోల్సనారోని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మన ప్రధాని మోడీ ఆహ్వానించారు. అయితే, కరోనా వైరస్‌పై తన అభిప్రాయాలను వారు పంచుకోలేదు. కానీ, ఈ రెండు నిరంకుశ ధోరణుల మధ్య కొంత సారూప్యత వుంది. ఇక్కడ భారత్‌లో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 130 కోట్ల మంది ప్రజలను, వారి రోజువారీ కార్యకలాపాలను మొత్తంగా లాక్‌డౌన్ చేశారు. అటువంటి వ్యవహార శైలి కేవలం నియంతృత్వ ధోరణి నుండే వస్తుంది. అదీకాక, ఇది కఠినమైన వర్గ దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. కార్మిక వర్గంపై యుద్ధాన్ని ప్రకటించింది. 'వలస కార్మికుడు' అనే పదం పాక్షికంగా తప్పుదారి పట్టిస్తోంది. వీరిలో చాలామంది ఉత్పత్తి, నిర్మాణం, పంపిణీ, సేవల రంగాల్లో వున్నారు. వారి ఉద్యోగాలకు ఎలాంటి రక్షణ వుండదు. నిరుద్యోగ భృతి వుండదు. ఆహార భద్రత లేదు, కనీసం వారి కుటుంబాలకు ఆశ్రయం లేదు. పైగా మోడీ తను ప్రసంగాలు చేసినప్పుడల్లా కార్మికులను తొలగించవద్దని, వారి వేతనాల్లో కోతలు విధించవద్దని పిలుపిస్తూనే వున్నారు. ఇక కార్మికులు, వారి కుటుంబాలు తమ స్వస్థలాలకు కాలినడకన బయల్దేరడంతో అసలు సమస్య ప్రారంభమైంది. అణచివేత చర్యలు మొదలయ్యాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో వారిని మందలు మందలుగా కుక్కారు లేదా దయనీయమైన పరిస్థితుల్లో క్వారంటైన్ చేశారు. ఎదురు తిరిగిన వారిని తాత్కాలిక జైళ్ళకు పంపించారు. దాదాపు మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల తర్వాత మనం అత్యంత బలహీనమైన ప్రజా పంపిణీ వ్యవస్థ (కేరళ ఇందుకు మినహాయింపు) కలిగి వున్నామన్నది కఠోరమైన వాస్తవం. సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థ లేదు. మౌలిక సేవలను అందించడానికి తిరస్కరించే ప్రభుత్వం వుంది. కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో మనకు పనిలో కోత వుంటుంది. ప్రమాదకరమైన నయా ఉదారవాదం, హిందూత్వ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలు వుండాల్సిన అవసరం వుంది. ఈ ప్రత్యామ్నాయ పంథా కోసం పోరాడేందుకు వామపక్షాలు ముందుండాల్సి వుంది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)