అలసత్వం, అల్పత్వం, ఆత్మ సంతృప్తి .. అనర్థం

కేవలం పదిహేను రోజుల వ్యవధిలో దేశంలో కరోనా తప్ప మరో మాట వినిపించకుండా పోయిన స్థితి. చూస్తుండగానే దాదాపు రెండు మాసాల కాలం పోగొట్టుకున్నాం. ఇది ఇంకా తీవ్రమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి దేశమే అతలాకుతలమై పోతున్నది. విస్త్రుతంగా పరీక్షల పని పెట్టుకోకుండా మన పరిస్థితి మెరుగని చెప్పుకున్న దశ మారింది. ఇప్పుడు ఐసిఎంఆర్‌ పరీక్షలు పెంచే దిశలో ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు గాని దానికి అవసరమైన సదుపాయాలు లేవు. కోటి మందికి ఒక్క లాబొరేటరీ వుండగా వాటిలోనూ మూడో వంతు సమర్థతనే వాడుకుంటున్నాము. మాస్కులు, కిట్లు, కవర్‌ ఆల్‌లు, వెంటిలేటర్లు అన్నిటికీ తీవ్రమైన కొరత వెన్నాడుతూనే వుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రకటనలు వీడియో మీడియా కాన్ఫరెన్సులు సాగుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగవుతున్నది లేదు. ప్రకృతి సిద్ధమైన కారణాల వల్ల గాని, గతంలో మలేరియా వ్యాక్సిన్‌ చేసిన ఫలితం వంటి కారణాల వల్లగాని మన దేశానికి కొంత అనుకూలత వుందని చెప్పినా అది కూడా నిలిచేట్టులేదు. తగిన నిధులు, సమగ్ర విధానం లేకపోగా ప్రచార విన్యాసాలతో సరిపెట్టడం ఎక్కువగా వుంది. ఈ రోజు సాయంత్రం తొమ్మిది గంటల తొమ్మిది నిముషాలకు లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలన్న ప్రధాని మోడీ పిలుపు ఇందులో తాజా ప్రహసనం. కరోనా నివారణకు దీనికి సంబంధం ఏమిటో తెలియక ప్రజలు బుర్రలు బద్దలుగొట్టుకుంటుంటే మోడీ భక్తులు, వందిమాగధులు ఇదే ఘన కార్యమైనట్టు ఊదరగొడుతున్నారు. దీపాలు పెట్టుకోవడం ఎవరి ఇష్టం వారిది అనుకున్నా చేయాల్సినవి చేయకపోవడమే ఆందోళన కలిగిస్తుంది. అపోహలు వ్యాప్తి చేయడం, అల్పత్వంతో కూడిన రాజకీయాల కోసం కరోనా భూతాన్ని వాడుకోవడం మరింత ప్రమాదకరం అవుతున్నది. నిజాముద్దీన్‌ లోని మర్కజ్‌ ఘటన ఆధారంగా ఒక మత కోణంలో ఈ చర్చ మళ్లించేందుకు జరిగిన ప్రయత్నం ఇందుకు పెద్ద ఉదాహరణ. ఆ కార్యక్రమం బాధ్యతా రహితం కాగా దాన్ని సకాలంలో కనిపెట్టి నివారణ చర్యలు తీసుకోలేకపోయిన వైఫల్యం ఎవరిది? మర్కజ్‌ పక్కనే నిజాముద్దీన్‌ పోలీస్‌ స్టేషన్‌ వున్నా ఢిల్లీ శాంతి భద్రతలు కేంద్ర హోం శాఖ పరిధి లోనే వున్నా ఎందుకు అరికట్టలేదు? కరీంనగర్‌లో మార్చి 15నే మలేషియా, ఇండోనేషియాలకు చెందిన వారున్నారనే దుమారం రేగింది. పదిమందిని పట్టుకున్నారు కూడా. అయినా ఎందుకు లోతుల్లోకి వెళ్లలేదు? నిర్వాహకులు చేశామంటున్న విజ్ఞప్తుల నిజాలేమిటి?

ప్రపంచంలో కరోనా కేసులు పది లక్షలు దాటి యాబై వేల మందికి పైగా ఆహుతైన నేపథ్యంలో మన కేంద్ర రాష్ట్ర పాలకుల తీరు మాత్రం ఆత్మసంతృప్తికి ప్రతిరూపంగా వుంది. 'జనస్వాస్థ అభియాన్‌' వంటివి ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ విధానాలు సూచిస్తున్నా స్పందించడం లేదు. ముఖ్యమంత్రులతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌ తీసుకుంటే కాస్తయినా ఆత్మ విమర్శ గానీ, సమీక్షా పూర్వక సవరణలు గాని లేని మొక్కుబడి వ్యవహారంగా ముగిసింది. మామూలు మర్యాదలు మించి ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ వంటి వారు కేంద్రం చేసిన సహాయాన్ని, నిర్దేశకత్వాన్ని ఎందుకంతగా పొగడాల్సి వచ్చిందో అర్థం కాదు. ప్రధాని వైద్య పరికరాలు ఎక్కడ వున్నా తెప్పిస్తామని చెప్పడమే గాని నిర్దిష్టంగా ఆర్థిక సహాయం ప్రకటించింది లేదు. మరుసటి రోజు విడుదలైనాయి. ముఖ్యమంత్రులతో దీపాల ముచ్చట పంచుకోకపోవడం గమనించదగ్గది. ప్రచారక్‌ ప్రధాని ఏదో చమత్కారం చేస్తారని అంతా అనుకున్నారు. కాని ఆయన దీప సందేశం ఇచ్చి సరిపెట్టారు. ఇది ఊకదంపుడులా వుందని 'హిందూస్తాన్‌ టైమ్స్‌' వంటి పత్రికే శీర్షిక నిచ్చింది. ఇదేదో రియాల్టీ షో లో టాస్క్‌లా వుందని కూడా వ్యాఖ్యలు వచ్చాయి. డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది కోసం చప్పట్లు కొట్టడంలో ఒక కృతజ్ఞతా ప్రకటన అనిపించింది. కాని దీనికి ఆ విధమైన ప్రాధాన్యత లేకపోయింది. అప్పుడు 5 గంటలకు చప్పట్లు అన్నవారు ఇప్పుడు 9.9 ఎందుకనేది ప్రశ్న. దేశమంతా ఒక తాటి మీద వుందని చెప్పడానికి ప్రధాని మోడీ ప్రతిభావంతమైన విధానం ఎంచుకున్నారని పొగిడిన వారికి లోటు లేదు. కాని ఇదో సంప్రదాయ సంఖ్యా శాస్త్ర సందేశమని పండితవర్యులు విశ్లేషణలు వెలువరించేశారు! శాస్త్ర విజ్ఞానంతో కరోనా భూతాన్ని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి మధ్యంతరంగా మందులు తెలుసుకోవడానికి వైజ్ఞానిక ప్రపంచం తలమునకలవుతుంటే సాక్షాత్తూ దేశ ప్రధాని ఈ సంఖ్యా క్రీడకు పాల్పడటం పెద్ద సంకల్ప సంకేతమని కీర్తించేవారిని ఏమంటాము? భారతీయులు ప్రపంచానికి సున్నా కనిపెట్టారని చెబుతుంటారు. దానికి ముందు 9 అతి కీలకమైన అంకె. నవగ్రహాలు, నవమాసాలు, నవరంధ్రాలు, నవరత్నాలు, నవరాత్రులు వంటివన్నీ అలా వచ్చినవే. ఇదే విధంగా ఇతర అంకెలకూ పురాణ ప్రతీకలు వున్నాయి. మత విశ్వాసాలలో ఎవరి ఇష్ట ప్రకారం వారు చెప్పుకోవచ్చు గాని లౌకిక దేశ ప్రధాని అధికారికంగా పిలుపివ్వడం ఏమిటి? ప్రతిపక్షాల నుంచి మీడియా వ్యాఖ్యాతల నుంచి దీనిపై వ్యాఖ్యలు వచ్చాయి. కొంతమంది ముఖ్యమంత్రులు అది ప్రధాని వ్యక్తిగత పిలుపని సరిపెట్టారు. కాని ఎ.పి, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రం ఇది అమలు చేసే బాధ్యతా తీసుకున్నారు! వామపక్షాలు ప్రధాని పిలుపును విమర్శించకున్నా కరోనా నివారణకోసమూ ప్రజల బాధలు తీర్చడం కోసమూ తక్షణం చేయవలసిందేమిటో సవివరంగా ప్రకటన చేశారు. చేయవలసింది ఇది తప్ప దీపాలు ఆర్పడం వెలిగించడం కాదన్న సందేశం ఇందులో వుంది.

వైరస్‌ వ్యాప్తి ఏ దశలో వుందన్నదే స్పష్టంగా చెప్పకుండా దాగుడు మూతలు ఎందుకో కూడా అర్థం కాదు. పరిమిత సామూహిక వ్యాప్తి దశలో ప్రవేశించినట్టు అధికార పత్రంలో సమాచారం అనధికారికంగా వెల్లడైంది తప్ప సూటిగా ప్రకటించలేదు. మరి దశ అదే అయితే సరకుల కోసం గానీ, చికిత్స కోసం గాని ఒక చోట చేరితే ఏమవుతుంది? ఇరుకు మురికి వాడల్లో పరిస్థితి ఏమిటి? రేపు లాక్‌డౌన్‌ ఎత్తివేసి రాకపోకలు, పనులు పెరిగితే అప్పటి మాటేమిటి? ప్రభుత్వం చెప్పడం లేదు. కరోనా కోసం మామూలు ఓపీలు రద్దు చేసి ఆస్పత్రులలో చికిత్సలు దాదాపు ఆపేశారు. ఆ వ్యాధులు ముదిరితే ఆ సంగతేమిటి? వైరస్‌ వార్డులలో చికిత్స చేసే ఆరోగ్య సిబ్బందికే సరైన మాస్కులు, పిపిఇ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) లేదు. ఇప్పటికే యాభై మంది డాక్టర్లకు వ్యాధి సోకింది. ఇది ఇంకా విస్తరిస్తే పరిస్థితి ఏమిటి? ఉద్యోగులకే సగం జీతాలు ఇస్తున్న స్థితిలో అసంఘటిత రంగం లోని అసంఖ్యాక శ్రామికులకు, వ్యవసాయ కార్మికులకు ఆధారమే లేకుండా పోతున్నది. వారు బతుకు తెరువు కోసం పెనుగులాటలో ఈ జాగ్రత్తలన్నీ పాటించడం సాధ్యమయ్యేది కాదు. మరి వారికి రక్షణ ఎలా? వ్యవసాయ రంగం గురించి, దిగుబడుల కొనుగోలు గురించి నామకార్థంగా తప్ప పెద్ద సహాయక విధానమేదీ అమలవడం లేదు. ప్రభుత్వం చెప్పే కేటాయింపులు నాలుగో వంతు దిగుబడులు కూడా కొనుగోలు చేసేందుకు సరిపోవు. పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కోలుకోవడానికి మరెన్ని మాసాలు పడుతుందో అసలు ఈ లోగా వైరస్‌ ఎలా విస్తరిస్తుందో తెలియదు. తక్షణ విధానమే సమగ్రంగా లేని ఈ పాలకుల నుంచి దీర్ఘకాలిక చర్యలు ఎక్కడ ఆశించగలం?

ప్రజాస్వామ్యం అంటూనే అధినేతల భజన పరిపాటిగా మారిన ఈ వ్యవస్థలో ప్రతిదీ దారి తప్పిపోతున్నది. ఒక రోజు కర్ఫ్యూ అన్నా 22 రోజుల లాక్‌డౌన్‌ అన్నా అవే తారకమంత్రాలుగా చలామణి అవుతున్నాయి. సెలబ్రెటీలు, కార్పొరేట్లు తమ వంతు భూరి విరాళాలివ్వడం అభినందనీయమే. వారిని మెచ్చుకోవడమూ సహజమే, అయితే ఈ సోషల్‌ మీడియా యుగంలో ఆ చాటున అసలైన సమస్యలు, చర్చలు మరుగున పడిపోయాయి. విమర్శనాత్మకంగా మాట్లాడ్డం అపరాధమైనట్టు చిత్రించబడుతున్నది. అంతేగాక మీడియాలో విమర్శకులపైన కేసులు, బెదిరింపులు సర్వసాధారణమైనాయి. 'వైర్‌' సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు. అయినా లాక్‌డౌన్‌లలో పోలీసులు కొందరు అప్రజాస్వామికంగా బాదడం శ్రుతి మించి ఆఖరుకు జగన్‌, కెటిఆర్‌ వంటి వారు కూడా ఖండించక తప్పనిస్థితి ఏర్పడింది.గతవారం చెప్పుకున్నట్టు చైనా వ్యతిరేక కథనాలు నిర్విరామంగా సాగుతూనే వున్నాయి. మర్కజ్‌ ఘటన తర్వాత ముస్లిములపై కేంద్రీకరణ పెరిగింది. ఇతర మతాల పరంగానూ ఉల్లంఘనలు లేవని కాదు. హరిద్వార్‌ ఉత్సవంలో గుజరాతీయులు చిక్కుకుపోతే ప్రత్యేకంగా రప్పించాల్సిన స్థితి ఏర్పడింది. పంజాబ్‌ లోనూ సిక్కు మతాధిపతుల నిర్వాకాల వల్ల చాలామంది కరోనా బారిన పడ్డారు. ఇదిగాక కుల కాలుష్యం పెంచే ఏపీ రాజకీయాల మాట చెప్పనవసరం లేదు. మరీ బాధాకరమేమంటే ఈ తరుణం లోనూ కేంద్రం కాశ్మీర్‌ పాచికలు, ఏపీ ప్రభుత్వం అమరావతి ఇళ్ల స్థలాల వంటి పొరబాటు విధానాలు కొనసాగించడానికి ఉత్తర్వులివ్వడం. పాలక వర్గాల పోకడలు మారేవి కావని ఈ ఉదాహరణలే స్పష్టం చేస్తున్నాయి.

ఈ తరుణంలో కమ్యూనిస్టులే సహజ సిద్ధమైన సేవా నిరతిని ప్రదర్శిస్తున్నారు. ప్రజా వైద్యులు ప్రత్యక్షంగానూ హెల్ప్‌ లైన్ల ద్వారానూ వైద్య సేవ చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు, దాతలు, సానుభూతిపరుల సాయంతో ఆహారం అందిస్తున్నారు. అవసరమైతే మా భవనాలను వినియోగించుకోవలసిందిగా ఎ.పి, తెలంగాణ సిపిఎం కార్యదర్శులు లేఖలు రాశారు (తెలుగుదేశం, జనసేన వంటివి కూడా ఎ.పి ప్రభుత్వానికి సూచనలు చేయడంతో పాటు కలసి వస్తామని ప్రకటించాయి). అయితే ఆ విధమైన అఖిలపక్ష వ్యూహం కాని, అందరినీ కలుపుకుని పోవడం గాని కనిపించడం లేదు. ఏపీలో ప్రైవేటు వైద్యశాలలను కూడా ప్రభుత్వ ఆదేశాల పరిధిలోకి తీసుకోగా తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు వాటి ఆస్పత్రుల వరకూ వినియోగించు కుంటామన్నారు. వ్యక్తిగతంగానూ పలువురు ప్రముఖ వైద్య నిపుణులు సలహాలు సూచనలతో ముందకు వస్తున్నారు. వైరస్‌ కనుగొనడం లోనూ తక్షణం రక్షణ పరికరాల తయారీ లోనూ శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇవన్నీ ఫలించి కరోనా విస్తరణను అడ్డుకోగలమని ఆశించాలి. అయితే ఆ క్రమంలో అలసత్వం, అల్ప రాజకీయ ప్రయోజనాలు, అప్రజాస్వామిక అశాస్త్రీయ పోకడలు నివారించుకోవాలన్నదే ఈ పరిశీలన సారాంశం. లేకపోతే సమయం చేయి దాటిపోతుంది. అమెరికా లాగా మారుతుంది.

- తెలకపల్లి రవి