విలవిల్లాడుతున్న ఆదివాసీలు

కరోనా వైరస్‌ ప్రమాదం గుర్తించని మోడీ ప్రభుత్వం దేశాన్ని లాక్‌డౌన్‌ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా అర్థంతరంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ వలన పేదలు, రోజు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు అందునా ఆదివాసీలు, దళితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లాక్‌డౌన్‌తో ఆదివాసీల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆదివాసీలు వారపు సంతల్లో ఉత్పత్తులు అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కుంటారు. లాక్‌డౌన్‌ వలన వారపు సంతలు మూసేయాల్సి వచ్చింది. సంతలు లేనందున తమ సరుకును అమ్ముకోలేక పోతున్నారు. నిత్యావసరాలు కొనుక్కోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చింతపండు పంట వస్తుంది. అలాగే కొండ చీపుళ్లు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలకు పెద్ద ఆదాయం. వాటిని గిరిజన సహకార సంస్థ (జి.సి.సి) కొనడం లేదు. ఇతరులు కొనడానికి అవకాశం లేదు. కిలో చింతపండు రూ.100 ధర పలుకుతుండగా ఏజెన్సీలో రూ.40 కూడా పలకడం లేదు. ప్రభుత్వం కూడా జి.సి.సి తో కొనిపించడం లేదు. దీనివల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీలో చింతపండుతో పాటు జీడి ప్రధానమైన పంట. తేనె మంచు కారణంగా జీడి పంట తీవ్ర నష్టానికి గురై 50 శాతం పంట కూడా వచ్చే పరిస్థితి లేదు. చింతకు ధర రాక జీడి పంట దిగుబడి లేక ఆదివాసీల ఆదాయం ఈ సంవత్సరం దారుణంగా పడిపోతోంది. ఇది తాత్కాలిక సమస్యగా గాక దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది.2006లో 'ఉపాధి హామీ చట్టం' వచ్చిన దగ్గర నుండి ఆదివాసీలకు ఎంతో ఉపకరించింది. చేసిన పనికి ఆదాయం రావడమేగాక తమ భూమిని చదును చేసుకున్నా, తమ తోటను బాగు చేసుకున్నా, మొక్కలు నాటుకున్నా ఉపాధి హామీ కింద లెక్కగట్టి రోజు కూలీ ఇచ్చేవారు. దీంతో ఆ పథకం ఆదివాసీలకు తక్షణ ఆదాయమేగాక దీర్ఘకాలిక భరోసా ఇచ్చింది. ప్రతి సంవత్సరం డిసెంబరు మొదలు జూన్‌ వరకు పని దొరికేది. అందువలన చదువులేని ఆదివాసీలు వలసలు వెళ్లక గ్రామాల్లోనే వుండిపోయారు.అయితే ఈ సంవత్సరం కాలంలో పని ఇవ్వలేదు. చేసిన పనికి కూలీ ఇవ్వలేదు. లాక్‌డౌన్‌ పేరుతో ఏకంగా పనులనే నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంగా రోజు కూలీ రూ.182 బదులు రూ.25 పెంచి రూ.202 ఇస్తామని చెప్పింది. అసలు పనే ఇవ్వకపోవడం నిజం. ప్రభుత్వం చెప్పిన దానికీ చేసిన దానికీ పొంతనే లేదు.ఆదివాసీలు ప్రధానంగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణకు తోడు అసంఘటిత రంగ కార్మికులుగా ఎక్కువ మంది జీవిస్తున్నారు. అందులో ప్రభుత్వం చేపట్టే రోడ్లు, భవనాలు, ప్రాజెక్టు తదితర నిర్మాణ పనులు చేస్తుంటారు. ప్రభుత్వం ఆదాయాలన్నీ నిలిపివేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ఇళ్ళ నిర్మాణం, తదనుగుణంగా జరిగే కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. బిల్డింగ్‌ కార్మికులు చాలా నష్టపోతున్నారు. పస్తులు వుంటున్నారు. వారి ఆర్థిక కార్యకలాపాలతో బతుకుతున్న చిరు వ్యాపారులూ నష్టపోతున్నారు.ఎక్కువ మంది ఆటోలు, మినీ వ్యానులు నడుపుకుని బతుకుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆటోలు, వ్యానులు ఆగిపోయాయి. ఫైనాన్స్‌ కంపెనీలకు, బ్యాంకులకు కిస్తీలు కట్టలేకపోతున్నారు. రవాణా రంగంలో జీవిస్తున్న ఈ బడుగు జీవుల జీవితాలు లాక్‌డౌన్‌ వలన ఛిద్రమైపోతున్నాయి.

ఆదివాసీ ఆదాయం మైదాన ప్రాంతంతో సమానంగా లేకపోయినా పెరిగింది. ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధి తగ్గింది. చదువుకున్న యువతీయువకులు ఏజెన్సీలో పనులు లేక వలసలు వెళ్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, విశాఖపట్నం తదితర పట్టణాల్లో జీవిస్తున్నారు. కొంతమంది గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో స్పిన్నింగ్‌ మిల్లుల్లో పని చేస్తున్నారు.

కర్ణాటక మందుకూరుతో పాటు రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ప్రకాశం తదితర జిల్లాల్లో చేపల వేటకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ వ్యాపారాలన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో ఈ పనుల్లో ఉన్న ఆదివాసీలు ఇబ్బందుల్లో పడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గిరిజన ప్రాంతంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నమో అందరికీ తెలుసు. కరోనా వ్యాప్తితో ఆ వ్యవస్థ మొత్తం మూతపడింది. సాధారణ వ్యాధులకు వైద్యం నిరాకరించబడుతోంది. సీరియస్‌ కేసులను కూడా కరోనా కారణంగా పట్టించుకోవడం లేదు. కరోనా పేరుతో ఆదివాసీలకు వైద్యం నిరాకరించబడుతోంది.చింతపండుకు ధర రాక, సంతలు లేక, మార్కెట్‌ సౌకర్యం లేక, జీడి పంట, ఉపాధి పనులు లేక, అసంఘటిత రంగం మూత పడడం అన్ని విధాలా ఆదివాసీల జీవితం కష్టాల్లో పడింది. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోవడం ఇందులో ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భౌతిక దూరం పాటిస్తూ వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం ఉపాధి పనులను నిలిపివేయడంలో అర్థం వుందా? శ్రీరామ కళ్యాణంలో భౌతిక దూరం పాటిస్తూ భక్తులు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం తగు జాగ్రత్తలతో సంతలు ఎందుకు నిర్వహించకూడదు?జి.సి.సి ఏర్పడ్డదే గిరిజనోత్పత్తులను...వ్యాపారులు కారు చౌకగా కొల్లగొట్టకుండా వుండేందుకు. గిరిజనులకు రక్షణ కల్పించడానికి, చౌకగా నిత్యావసరాలు ఏర్పరచడానికి. మరి ఆ జి.సి.సి సహకారంతో గిరిజనుల వద్ద నుండి చింతపండును ఎందుకు కొనుగోలు చేయరు? రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఏర్పరచింది కదా! వారి సహకారంతో చింతపండును సేకరించవచ్చు. అయినప్పటికీ ఎందుకు చేయడం లేదు? 

చైనాలో డిసెంబర్‌ 31న కరోనా వైరస్‌ అలజడి ప్రారంభమైంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు 23 రోజులు ప్రయత్నం చేసింది. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తీరును గమనించింది. కట్టడి చేసేందుకు వేల మంది వైద్యులను వ్యాధి ప్రబలిన వుహాన్‌కు తరలించింది. లాక్‌డౌన్‌ చేస్తే వచ్చే పరికరాలన్నింటికి రంగం సిద్ధం చేసుకుని జనవరి 23న లాక్‌డౌన్‌ చేసింది. చైనా వైరస్‌ ప్రమాదాన్ని, అది వ్యాప్తి చెందుతున్న తీరు, తీసుకోవాల్సిన చర్యలు వంటి అనుభవాలను ప్రపంచానికి తెలియజేసింది. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' కూడా ప్రపంచ దేశాలన్నింటిని హెచ్చరించింది.

ఆ హెచ్చరికలు లెక్క చేయని మోడీ, ట్రంప్‌తో కలిసి పుణ్యకాలమంతా ఊరేగారు. ఆపైన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే గ్రూపులు చేశారు. ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా చెలరేగుతున్న ప్రజా ప్రతిఘటనను దెబ్బ తీయడమెలాగా అని కుయుక్తులు పన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. 

మరోవైపు మోడీ అనుచరగణం, బిజెపి నేతలు, మంత్రులు వేద భూమి భారత్‌ను కరోనా వైరస్‌ ఏమీ చేయలేదని, గోవు మూత్రం తాగితే కరోనాను కట్టడి చేయగలమని, ఒంటి నిండా పేడ పూసుకుంటే కరోనా ఖతం అవుతుందని, ఆవు పేడ నీళ్ళతో స్నానం చేస్తే కరోనా అంతం అవుతుందని, రొట్టె మీద పేడను వెన్నలా రాసుకుని తింటే ఇక ఎదురే ఉండదని...పరమ చెత్త ప్రచారంలో మునిగి తేలారు. 

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"=""> యం.కృష్ణమూర్తి

( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )