ప్రపంచ వ్యాపితంగా ప్రభావం చూపుతున్న ఈ అంటువ్యాధి వల్ల ఆర్థికంగా కలిగే నష్టాల గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ, ప్రజాస్వామిక వాతావరణాన్ని కుదించడం వల్ల జరిగే కీడు గురించి అంతగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. అసోం దగ్గర నుంచి అమెరికా దాకా నిరంకుశ పోకడలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం. కరోనాను సాకుగా చూపి హంగరీ ప్రధాని, పచ్చి మితవాది విక్టర్ ఓబ్రాన్ తప్పుడు సమాచారం ఇచ్చే వారిని జైలుకు పంపడంతో సహా పలు క్రూరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని పార్లమెంటరీ ఆమోదానికి పెట్టారు. డిక్రీల ద్వారా పాలన సాగించేందుకు ఎమర్జెన్సీని రుద్దారు. ఈ అత్యయిక పరిస్థితికి నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టే కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కాల్చిపారేస్తామని హూంకరించారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా 90 రోజుల జాతీయ విపత్తుగా ప్రకటించి అసాధారణమైన అధికారాలను తనకు సంక్రమించేలా చూసుకున్నారు. ప్రజల కదలికలను ఇకపై సైన్యం పూర్తిగా నియంత్రిస్తుంది. మన దేశంలోనూ హంగరీ ప్రధాని అనుసరించిన వ్యూహాన్నే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేసినట్టుంది. అసోం లోని బిజెపి ప్రభుత్వమూ ఇదే పంథాలో పోతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి నిర్బంధ శిబిరాల్లో కన్నా అధ్వానంగా ఉందని విమర్శించిన పాపానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడల గురించి ఇక వేరే చెప్పాలా? లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల ఇబ్బందులపై ఏం చర్యలు తీసుకున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ అడిగితే దానికి సూటిగా సమాధానం ఇవ్వకుండా వలస కార్మికుల అవస్థలకు ఫేక్ న్యూసే కారణమన్నట్లుగా మాట్లాడింది. నాలుగే నాలుగు గంటల వ్యవధిలో ఎటువంటి ముందస్తు సన్నాహాలు, సమాచారం లేకుండా లాక్‌డౌన్ విధించడమే వలస కార్మికుల తిప్పలకు మూలకారణం. కానీ కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించినదేమిటి?
మూడు నెలలపాటు లాక్‌డౌన్ ఉంటుందన్న ఫేక్ న్యూస్ వల్ల కార్మికులంతా భయోత్పాతానికి గురై ప్రయాణాలు కట్టారని ప్రభుత్వం నివేదించింది. ఇది వాస్తవమా, కాదా అన్నది సుప్రీం కోర్టు పరిశీలించకుండానే ఆమోదించేసింది. ఇదే సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ వెర్షన్‌ని మాత్రమే వీడియా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిని బట్టి కరోనా సంక్షోభాన్ని అడ్డంపెట్టుకుని మీడియాపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అర్థం అవుతోంది. నిజానికి కరోనా మహమ్మారిపై పోరాడడంలో విశ్వసనీయ సమాచార వ్యవస్థ ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాస్తవాల ఆధారంగానే ప్రజల్లో విశ్వసనీయత కలుగుతుంది. ప్రభుత్వ వెర్షన్‌ను ఇవ్వడం వేరు, ప్రభుత్వ వెర్షన్‌కు మాత్రమే పరిమితం కావడం వేరు. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి. 'ఫేక్ న్యూస్' ద్వారా, లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడం వంటివి పైనుంచే ఎక్కువగా జరుగుతుంటాయనేది చేదు నిజం. ఎవరు అధికారంలో ఉంటారో వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ జర్నలిజం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల అధ్యయనంలో తేలింది.ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) ఈ కరోనా విషయంలో ఎలా వ్యవహరిస్తున్నదో చూడండి. గత వారం ఆరంభంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఒక ప్రకటన చేస్తూ, బ్రిటన్ యువరాజు చార్లెస్ హోమియోపతి మందులు వాడడం వల్ల ఆయన కరోనా వ్యాధి నయమైపోయిందని చెప్పారు. అంతేకాదు, వేల సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్న హోమియోపతి మందులు తిరుగులేనివని దీంతో రుజువైందన్నారు. అయితే చార్లెస్ ప్రతినిధి ఒకరు దీనిని తిరస్కరిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక ఇ-మెయిల్ పంపారు. 'ఇదంతా తప్పుడు సమాచారం. కరోనా చికిత్సకు బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ఇచ్చిన వైద్య సలహాలనే ప్రిన్స్ చార్లెస్ పాటించారు. ఇంకే విధమైన పద్ధతులు పాటించలేదు' అని ఆ మెయిల్‌లో స్పష్టం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలుగజేసుకుని కరోనాపై పోరులో ఆయుష్ అడ్వర్టయిజ్‌మెంట్లు ప్రచురించరాదని, దానికి ప్రచారం కల్పించరాదని పత్రికలకు సూచించింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆయుష్ డ్రగ్స్ గురించి అసత్య ప్రచారాన్ని నివారించేందుకు ఇదొక్కటే మార్గమని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకత గురించి పలువురు ప్రముఖులు చెప్పిన అభిప్రాయాలను ఒక్కసారి నెమరువేసుకోవాలి. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మూడు దశాబ్దాల క్రితం ప్రపంచాన్ని అల్లాడించిన భయానక క్షామాల గురించి వివరిస్తూ...పత్రికా స్వేచ్ఛ, స్వతంత్రత, ప్రజాస్వామ్యం పరిఢవిల్లే ఏ దేశంలోనూ చెప్పుకోదగ్గ క్షామాలేవీ చోటుచేసుకోలేదన్నారు. పత్రికా స్వేచ్ఛ, మంచి పరిపాలన అనేవి విడదీయరాని అంశాలని, దేశ ఆర్థిక, మానవాభివృద్ధికి పాటుపడడంలో ఈ రెండూ పరస్పరం సహకరించుకుంటాయని యునెస్కో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చిన తరుణంలో ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ప్రజాతంత్ర హక్కుల పైన, మీడియా స్వేచ్ఛా స్వతంత్రత పైన ప్రభుత్వ దాడికి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు.