విషాదంలో వలస కార్మికులు

కోవిడ్‌-19 మరణాల కంటే స్వగ్రామాలకు బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. స్వగ్రామాలకు వస్తుండగా 40 మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మాసాల గర్భణితో సహా సహరాన్‌ పూర్‌ నుంచి వంద కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిన వలస కార్మిక కుటుంబాన్ని 50 కిలోమీటర్లు తర్వాత ప్రజలు ఆదుకొని అంబులెన్స్‌లో సొంతూరుకు పంపారు. నాగపూర్‌ నుంచి కాలినడకన చెన్నై బయలుదేరిన వలస కార్మికుడు హైదరాబాద్‌ శివారులో గుండెపోటుతో మరణించాడు. తొమ్మిది నెలల నిండు గర్భిణీ కాళీబారు దీ అలాంటి గాధే. ఉత్తరప్రదేశ్‌ లోని మధుర నుంచి కాలినడకన బయలుదేరి మధ్యప్రదేశ్‌ లోని స్వగ్రామానికి...అనేక అవస్థలు పడుతూ ఐదు ట్రక్కులు మారి...ఏప్రిల్‌ 1న ఇంటికి చేరింది. ఇలాంటి వలస కార్మికుల బాధలు, గాధలు రోజూ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వీరిలో అత్యధికంగా ఉన్నారు.కరోనా నివారణకు మార్చి 23న ప్రధాని మోడీ చేసిన లాక్‌డౌన్‌ ప్రకటన వలస కార్మికులకు శాపంగా మారింది. అప్పటి వరకు ఉన్న పని పోయింది. అన్ని చోట్ల పోలీస్‌ బారికేడ్లు స్వగ్రామానికి పోకుండా అడ్డుగా మారాయి. ఉన్నచోట బతకలేని పరిస్థితి ఏర్పడింది. మధ్య దళారులు, కాంట్రాక్టర్లు వీరిని వదిలించుకుని ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. ఆహారం, నివాసం, మంచినీరు వంటి కనీస సౌకర్యాల వలస కార్మికులకు అందని దుస్థితి ఏర్పడింది. యజమానులు వారి జీతాల్లో కోత విధించవద్దు, ఉద్యోగాలు తొలగించవద్దు అని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటన చేసినా వలస కార్మికులను పట్టించుకున్న యజమాని లేడు. కేంద్రం చిత్తశుద్ధి లేని ప్రకటనలు వెలువరించింది తప్ప కచ్చితంగా అమలుపరిచే జీవోలు, ఆదేశాలు జారీ చేయలేదు. పని లేని దగ్గర ఉండలేక, సొంతూరు వెళ్లడానికి కాలినడకన బయలు దేరిన వలస కార్మికులు ఇంటికి చేరకుండా మధ్య దారిలోనే ప్రాణాలు వదలడం అత్యంత బాధాకరం.

మన దేశంలో వలస కార్మికులు 90 లక్షలు మంది ఉన్నారని అంచనా. వీరిలో అత్యధిక భాగం మంది నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. వీరిలో సగం మంది ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు వలసలు వెళ్లిన వారే. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని వేలాది కిలోమీటర్లు వలస పోతుంటారు. గుజరాత్‌ లోని పోర్‌బందరు, వెర్వేల్‌ సముద్ర ప్రాంతానికి ఉత్తరాంధ్ర నుంచి మత్స్య కార్మికులు ప్రతి సంవత్సరం పనుల కోసం వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలలో 70 శాతం చేపల వేట అవుతుంది. ఒక ట్రిప్పు సముద్రం లోకి వెళ్లి వచ్చేసరికి పరిస్థితి అంతా తారుమారైంది. లాక్‌డౌన్‌ తో ట్రాలర్ల నుంచి బయటికి వెళ్లడానికి లేదు. ఐస్‌ ఫ్యాక్టరీలు ఆగిపోవడంతో వేటాడి తెచ్చిన చేపలు బాక్స్‌లో పెట్టడానికి ఐస్‌ లేదు. ఈ సీజన్లో వేట అయిపోయినట్లే. ప్రతి ట్రాలర్‌లో పది మంది చొప్పున ఇరుకు బోట్లలో నేటికీ నరకం అనుభవిస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ట్రాలర్ల యజమానులకు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి చేతులు దులుపుకుంది. ట్రాలర్‌ యజమానులు మేం చేయలేమని తప్పించుకుంటున్నారు. మధ్యలో మత్స్యకారులు నలిగిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే...రూ.28 వేల కోట్ల పెట్టుబడితో ఇప్పుడు హిందూస్థాన్‌ పెట్రోలియంలో 'ఎల్‌ అండ్‌ టి' ద్వారా జరుగుతున్న విస్తరణ పనుల్లో స్థానికులు నామమాత్రంగా వున్నారు. పరవాడ ఫార్మా సిటీలో మూడు వేల మంది, అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌, రాంబిల్లిలో మరో మూడు వేల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. నెల్లూరూ జిల్లా ముత్తుకూరు క్లస్టర్‌, చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతం లోని శ్రీ సిటీతో సహా ప్రతి జిల్లా లోనూ హిందీ రాష్ట్రాల్లోని వలస కార్మికులు పని చేస్తున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా తమ సొంత గ్రామాలు వెళ్లాలని బయలుదేరిన వలస కార్మికులు ఊరూవాడా తెలియని చోట బందీలుగా ఉన్నారు. వీరి పట్ల కనీస జాలి, దయ, సానుభూతి లేని బడా పెట్టుబడిదారులు వలస కార్మికులు వెళ్లి తిరిగి రాకపోతే తమ ఆర్థిక వ్యవస్థ ఏమౌతుందని గుండెలు బాదుకుంటున్నారు. అంతే తప్ప...వారి బతుకులు ఏమవుతాయని ఆలోచించడం లేదు. పని చేసిన కాలానికి జీతాలు చెల్లించాలని వలస కార్మికులు అడిగిన చోట ఉత్తర ప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాల్లో వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. ఎక్కడ వలస కార్మికులను కదిలించినా మా ఊరు ఎప్పుడు వెళ్తామని ఘోషిస్తున్నారు.దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిన వలస కార్మికులకు అన్ని రకాల భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో కేరళ లోని వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా వుంది. వలస కార్మికులకు 'అతిథి కార్మికులు' పేరుతో ప్రభుత్వ సౌకర్యాలన్నీ వారికి వర్తింపజేస్తోంది.

తిండి, నీరు, నివాసం లేని వీరికి తాత్కాలికంగా భోజన వసతితో కూడిన సౌకర్యాలు ఏర్పాట్లు చేసి సహాయపడడంలో దేశం లోనూ, రాష్ట్రం లోనూ సిఐటియు ముందుంది. ప్రతి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర నాయకులకు వచ్చే ఫోన్లకు స్పందించి, వలస కార్మికులు ఎక్కడున్నా వెతికి వారికి సిఐటియు ఆపన్నహస్తం అందిస్తున్నది. ఆహారం వసతులతో పాటు ధైర్యాన్ని కల్పిస్తున్నది.

- సిహెచ్‌ నర్సింగరావు

వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)