హై హై నాయకా!

మనం ఒక యుద్ధంలో ఉన్నాం. అందరమూ సైనికులమే. మన అందరి శక్తి సామర్థ్యాలనీ కలబోసి యుద్ధంలో శత్రువు మీద విజయం సాధించేలా సైన్యాన్ని నడపవలసిన బాధ్యత సేనా నాయకుడిదే. అతగాడేం ఆదేశించినా మనం పాటిస్తాం. ఇందులో సందేహం లేదు. మార్చి 22న నాయకుడు జనతా కర్ఫ్యూ పాటించాలన్నాడు. పాటించాం. చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లే కాదు, శంఖాలూ మోగించాం. తాళాలు, బాజాలు వాయించాం. మోత మోగించాం. నాలుగ్గంటలన్నా వ్యవధి ఇవ్వకుండానే లాక్‌డౌన్‌ పాటించమన్నాడు. పాటిస్తున్నాం. ఎన్ని లక్షల మంది కాలినడకన లాంగ్‌మార్చ్‌లు చేయాల్సి వచ్చిందో లెక్క లేదు. అయినా నడిచారు. బహుశా ఇంకా కొందరు నడుస్తూనే ఉన్నారు కూడా. రాష్ట్రాల సరిహద్దుల దగ్గర వాళ్లని నానా యాతనలు పెట్టారు. బందెల దొడ్లో పశువుల్ని కూడా కుక్కనంత హీనంగా బీహార్‌లో క్వారంటైన్లు నడుపుతున్నారు. అయినా భరిస్తున్నాం. సేనా నాయకుడు నోరు తెరిచి క్షమించమని అడిగాడు. దాంతో పడిన కష్టమంతా మరిచిపోవాలని మనకి చాలా మంది పెద్దలు సలహా ఇచ్చారు. ఆ సలహానూ పాటిస్తున్నాం. తాజాగా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించమన్నాడు. దీపాలు బ్రహ్మాండంగా వెలిగించాం. ఏప్రిల్‌ 5న కరిగించిన కొవ్వొత్తుల ఖర్చుతో దేశంలో వైద్య సిబ్బంది అంతటికీ ఎన్‌ 95 మాస్క్‌లను కొని సరఫరా చేయొచ్చనని ఎవరో అన్నారు. అయినా మనం పట్టించుకోలేదు కదా! కొవ్వొత్తులతోబాటు హారతులు ఇచ్చాం. పటాసులు కాల్చాం. బీహార్‌లో ఒక బిజెపి మహిళా నేత గాల్లో తుపాకీని పేల్చి భారతీయ మహిళా శౌర్యం ఏంటో ప్రపంచానికి చాటింది.ఇంత చేసినా ఆ దరిద్రపు వైరస్‌కి ఏమీ బుద్ధొచ్చినట్టు లేదు. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇంకా వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీన్ని మహాభారత యుద్ధంతో పోల్చి బిజెపి నేతలు కొందరు మాట్లాడుతున్నారు. అక్కడ పాండవులు (ధర్మం వాళ్ల వైపే వుందని కృష్ణుడంతటివాడు చెప్పేడు) కౌరవుల మీద యుద్ధం చేసేరు. వాళ్లకి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న కౌరవులు కనపడుతున్నారు గనక యుద్ధం చేయగలిగేరు. కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం మనం. ఆ శత్రువు బలం రోజురోజుకూ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.ఈ యుద్ధంలో ముందు వరసలో నిలబడ్డవాళ్లు డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు. ఆ వెనక పోలీసులు, పాత్రికేయులు. పాత్రికేయుల్ని తక్కువ అంచనా వేయొద్దు సుమా. యుద్ధ రంగంలో అన్ని చోట్లా తిరిగి ప్రత్యక్షంగా చూసి ఉన్నదున్నట్లు రిపోర్టు ఇవ్వాలంటే అది వాళ్లకే సాధ్యం. అయితే ముందు వరసలో నిలబడ్డ మన సైన్యం-అంటే డాక్టర్లు, వైద్య, ఆరోగ్య కార్యకర్తలు-ప్రస్తుతం ముందు వరసలోనే నిలబడినా, వాళ్ల దగ్గర ఆయుధాలు లేవు. కవచాలు లేవు. కత్తీ, డాలూ, కవచం లేకుండా యుద్ధం చేయడానికి వీలు పడుతుందా? మరి డాక్టర్లకి, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వకుండా 'యుద్ధం చేయండి' అని గంభీరంగా సేనా నాయకుడు పిలుపిస్తే సరిపోతుందా?మహాభారత యుద్ధంలో యుద్ధం ప్రారంభం అవడానికి సూచనగా అర్జునుడు పాంచజన్యం పూరించేడు (ఆ తర్వాత ఎవరి శంఖాలు వాళ్లు ఊదేరు). శంఖాలూదేశాం కాబట్టి యుద్ధం అయిపోయినట్టేనని నాబోటివాడు వెనక్కి పోయేడనుకోండి! వాడినేమనాలి? అలాగే నాయకుడు 'శంఖాలు పూరించండి!' అని పిలుపిచ్చి ఆ తర్వాత పక్కవాళ్లతో ముచ్చట్లాటలో మునిగిపోతే? యుద్ధం కాస్తా ఏమౌతుంది?ఎఫ్‌సిఐ గోడౌన్లలో దాదాపు 6 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు స్టాకు ఉన్నాయి. కరువు కాటకాలొస్తే తట్టుకోవడానికి ఎప్పుడూ కనీస నిల్వ వుండాలి. అలా ఉండవలసిన నిల్వ రెండు కోట్ల టన్నులు. పైగా రాబోయేది రబీ కోతల కాలమే గనుక ఎటుతిరిగీ మళ్లీ కొత్త నిల్వలు చేరుతాయి. అందుచేత మోడీ ముందు 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాన్ని దేశ ప్రజలందరికీ పంచెయ్యడం అర్జెంటుగా చేయాలి. పేదా, గొప్పా అని చూడొద్దు. కక్కుర్తి పడే గొప్పోళ్లు కొందరు ఎటుదిరిగీ ఎప్పుడూ ఉండనే ఉంటారు కదా!ఈ యుద్ధంలో జనం చేయాల్సింది ఇళ్ల దగ్గర కదలకుండా ఉండడమే కదా! కాని ఆ ఇల్లు నడవాలి కదా! అందుకే ప్రతి ఇంటికీ, తిండి గింజలతో బాటు తలా కుటుంబానికీ ఏడు వేల రూపాయలు ఇచ్చెయ్యాలి. మళ్లీ ఇక్కడ తెల్ల కార్డుందా లేదా అని చూడొద్దు. ఇల్లూ, వాకిలీ లేని వాళ్లు, స్లమ్స్‌లో అడ్రెసులు లేకుండానే బతుకుతున్న వాళ్లూ అందరికీ ఇచ్చెయ్యాలి. డబ్బులెక్కడి నుంచొస్తాయని అడగొచ్చు కొందరు. అదే చెప్తా. మనకి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 50 వేల కోట్ల డాలర్లున్నాయి. అంటే రూ.35 లక్షల కోట్లు. ఇప్పుడీ పరిస్థితుల్లో ఎగుమతులూ లేవు. దిగుమతులూ లేవు. పైగా ముడి చమురు ధరలేమో తగ్గిపోయాయి. అయినా మన సేనా నాయకుడు పన్ను పెంచి పారేశాడు గనక అదనపు ఆదాయం సమకూరింది. అయినా చాలదంటే ఎలా? ఇప్పుడు మన నాయకుడు జనాల్లోకి పంపిణీ చేయాల్సిన సొమ్ము రూ.35 లక్షల కోట్లు కాదు గదా! అంతా కలిపి రూ.4 లక్షల కోట్లు అవుతుంది. ఆర్థిక పండితులను 'బడ్జెట్‌ లోటు పెరగకూడదు' లాంటి సణుగుడు మాని కాసేపు నోరు మూసుకోమని చెప్పాలి మన నాయకుడు.

పంటల కోతల కాలం వచ్చింది. కనుక నిబంధనలను సడలించైనా పొలాల్లో పంటలను రక్షించుకోవాలి. అవసరమైతే ఉపాధి హామీ పథకాన్ని కూడా వాడుకోవడానికి అనుమతించి పొలం లోని ప్రతి గింజనూ చేజిక్కించుకోవాలి.యుద్ధంలో దళాల నాయకుల్లాంటి వాళ్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అందరూ రథాల మీద ఎక్కి కూచుని రెడీగానే ఉన్నారు! కాని ఆ రథాలే కదలడం లేదు. ఎందుకని? ఆ రాష్ట్రాల రథాలకి నిధులు లేవు. వాళ్లకి వెంటనే అవసరానికి తగినట్లు అప్పులు చేయడానికి అనుమతులివ్వాలి మన సేనాని. నిబంధనలను సవరించాలి.అన్నింటికన్నా ముందు....ముందు వరస లోని డాక్టర్లకు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు, ఆస్పత్రుల్లో అవసరమైన వెంటిలేటర్లు, ఔషధాలు వెంటనే సమకూర్చాలి. చైనా, దక్షిణ కొరియా, క్యూబా సాయం చేస్తామని ముందుకొచ్చాక ఆలస్యం చేయకుండా ఆ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి.బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధాని. 'కరోనా వైరస్‌ వస్తే రానీలే' అని పట్టించుకోకుండా బేఖాతర్‌గా వ్యవహరించాడు. ఇదిగో ఇప్పుడు అతగాడికే వైరస్‌ సోకి ఆస్పత్రిలో ఉన్నాడు. ట్రంప్‌ పరిస్థితి చూస్తూనే వున్నాం కదా! ప్రపంచంలో అమెరికా నెంబర్‌ వన్‌ అంటూ కబుర్లు చెప్తాడు బాగా. ఇప్పుడు కరోనాలో మాత్రం నెంబర్‌ వన్‌ అయి కూచుంది. మన సేనా నాయకుడి మాటేంటి?

ఐర్లండ్‌ ప్రధాని తన పదవిని పక్కనబెట్టి వృత్తిరీత్యా వైద్యుడు గనుక మాస్క్‌ వేసుకుని స్టెత్‌ పట్టుకొని వైద్యం చేయడానికి రంగం లోకి దిగేడు. అదిగో అదీ నాయకుడంటే. రెండు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాలో రెండున్నర లక్షల మందికి ఆగమేఘాల మీద పరీక్షలు జరిపించి కరోనాను కట్టడి చేసింది దక్షిణ కొరియా. అదిగదిగో అదీ నాయకత్వం అంటే.మరి మన నాయకుడేం చెయ్యనున్నాడో! శంఖాలూదడం, తాళాలు వాయించడం, దీపాలు వెలిగించడం, క్షమాపణలు చెప్పడం-అక్కడితో సరిపెడతాడా? పనికొచ్చే పనేదైనా చేస్తాడా?

- సుబ్రమణ్యం