వేగుచుక్క వుహాన్‌

అత్యంత సూక్ష్మ రూపంలో ఉండే కరోనా వైరస్‌ నేడు విశ్వ మానవాళికి పెను సవాలు విసురుతూ అతి పెద్ద శత్రువుగా పరిణమించింది. అణ్వాయుధ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అణగారిన దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తూ హడలెత్తిస్తున్న ఈ మహమ్మారిపై చైనాలోని వుహాన్‌ నగరం విజయం సాధించింది. ఇది ఈ వైరస్‌పై మానవాళి సాగిస్తున్న పోరాటంలో దక్కిన తొలి విజయం. ప్రజలు, ప్రజా సంక్షేమం కోరే పాలకులు ఉమ్మడిగా పట్టుబడితే ఎంతటి భయంకరమైన శత్రువైనా పాదాక్రాంతం కాకతప్పదనేందుకు వుహాన్‌ తార్కాణంగా నిలుస్తోంది. కరోనా మొట్టమొదట వెలుగుచూసిన హ్యుబెయి ప్రావిన్స్‌ లోని వుహాన్‌లో 76 రోజుల లాక్‌డౌన్‌కు బుధవారం తెర దించడం అక్కడి ప్రజలకే గాక విశ్వజనులందరికీ అమితానాందం కలిగించింది. 'ప్రజలే ముందు' అన్నది చైనా లక్ష్యం. ఆ స్ఫూర్తితోనే ప్రజలంతా కలిసికట్టుగా తెగించి పోరాడినందునే ఇంతటి గొప్ప విజయం సాధ్యమైంది. కనిపించని శత్రువుతో పోరాడుతున్న ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఒక వేగుచుక్క వుహాన్‌. 

'ప్రజల ప్రాణాలు, భద్రత, ఆరోగ్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజల ప్రయోజనాల కన్నా ఇంకోటేదీ ముఖ్యం కాదు' అని చైనా అధ్యక్షులు సీ జిన్‌పింగ్‌ చెప్పిన మాటలు వుహాన్‌ విజయంలో ప్రతిబింబించాయి. 'వైద్యులు చాలా చెబుతారు. వారు చెప్పినట్లు లాక్‌డౌన్‌ చేస్తే వాణిజ్యం ఏం కావాలి. మాకు వాణిజ్యమే ముఖ్యం' అని నిస్సిగ్గుగా చెప్పుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి 'పెట్టుబడి' అహంభావులకు జిన్‌పింగ్‌ చేసిన ఉద్ఘాటనలు చెవికెక్కుతాయో లేదో గాని ప్రపంచానికి కమ్యూనిస్టు స్ఫూర్తి అంటే ఏమిటో తాజాగా తెలియజేసింది వుహాన్‌. సమగ్ర కార్యాచరణేదీ లేకుండానే గంభీర ఉపన్యాసాలతో కరతాళ ధ్వనులు, దీపారాధనలకు పిలుపునిచ్చే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి నేతలు కూడా చైనా ప్రభుత్వాధినేతల నుంచి నేర్వాల్సింది ఎంతో ఉంది. కరోనాపై పోరు సల్పేందుకు ప్రజానీకంతో కలిసికట్టుగా చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి ప్రభుత్వం అమలు చేసిన పక్కా ప్రణాళికలు ప్రజా సంక్షేమం కోరే పాలకులకు అనుసరణీయం, ఆచరణీయం. చైనా వుహాన్‌లో విజయం సాధిస్తే హ్యుబెయి రాష్ట్రం విజయం సాధించినట్టే, హ్యుబెయి విజయం సాధిస్తే చైనా విజయం సాధించినట్టేనని జిన్‌పింగ్‌ చేసిన దిశా నిర్దేశంతో కరోనా వైరస్‌ తలెత్తగానే దానిని కట్టడి చేసేందుకు నడుం బిగించిన జనచైనా ఒక్కతాటిపై నిలిచి సమరభేరి మోగించింది. క్వారంటైన్‌ శిబిరాల ఏర్పాటు, ప్రజల రాకపోకలను నిలిపివేయడం, వుహాన్‌లో రెండు వారాల వ్యవధిలో రెండు పెద్ద ఆసుపత్రులు నిర్మించడం యుద్ధ ప్రాతిపదికన చైనా జనావళి కదిలిన తీరు అమోఘం. 16 చోట్ల స్పోర్ట్స్‌ స్టేడియాలను, ఎగ్జిబిషన్‌ హాళ్లను కరోనా ఆసుపత్రుల కింద మార్చివేయడం ద్వారా ఆపత్కాలంలో అందుబాటులో ఉన్న వనరులను ఎలా వినియోగించుకోవచ్చో జనచైనా చేసి చూపింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వుహాన్‌కు తరలి వచ్చిన 42 వేల మంది వైద్య సిబ్బంది 340 బృందాలుగా పని విభజనతో సేవలందించి ప్రజారంగ వైద్య ప్రత్యేకతను చాటి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన వేలాది మంది వాలంటీర్లు వైద్యులకు, ఇతర సిబ్బందికి చేదోడుగా నిలిచారు. వీరందరి లక్ష్యం ఒక్కటే. వీలైనంత ఎక్కువ మందిని కరోనా బారి నుంచి కాపాడడం. ప్రజలకన్నా తమకేమీ ముఖ్యం కాదని ఆర్థిక నష్టాన్ని సైతం ఆనందంగా భరించిందా ప్రభుత్వం. ప్రపంచానికి మహమ్మారి విస్తరించకుండా శాయశక్తులా శ్రమించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి శభాష్‌ అనిపించుకుంది జనచైనా.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇదే కంటగింపుగా మారింది. పర్యావరణ ఒడంబడికతో సహా అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు తిలోదకాలు ఇస్తూ ఇప్పటికే విమర్శల పాలైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు చైనా కృషిని మెచ్చుకున్న పాపానికి ప్రపంచ ఆరోగ్య సంస్థపై కస్సుబస్సుమంటున్నారు. కరోనా కట్టడిలో ఏమాత్రం చొరవ చూపడం లేదంటూ బరితెగించి డబ్ల్యుహెచ్‌ఒ పై నిందలు మోపడం ట్రంప్‌ టెంపరితనానికి నిదర్శనం. వుహాన్‌ విజయంలో అసువులు బాసిన నిస్వార్థ వైద్య సిబ్బంది, సహాయ సిబ్బందికి అశృనివాళులు అర్పిస్తూనే వారి ఆశయ సాధన దిశలో జనచైనా సాగిస్తున్న పోరాటాన్ని అభినందించాల్సింది పోయి కుటిల కుట్రలతో ప్రతీకార ఆంక్షలతో అమెరికా కాలు దువ్వుతోంది. భారత్‌ సహా అనేక దేశాలకు చైనా, క్యూబా లాంటి కమ్యూనిస్టు దేశాలు వైద్య సేవలందిస్తూ, వైద్య పరికరాలు అందిస్తూ మానవత్వం పరిమళింపజేస్తుంటే అమెరికా మాత్రం విద్వేష జాఢ్యంతో విషం చిమ్ముతోంది. ఆపత్కాలంతో ఆపన్నహస్తం అందిస్తున్న మిత్రులెవరో..బెదిరింపులకు దిగుతూ తమకు కావాల్సింది లాక్కొనే శత్రువులెవరో తెలుసుకొని మసలడం భారత్‌కు అవశ్యం. వుహాన్‌ విజయంతోటే కరోనాపై విజయభేరి మోగించామని జనచైనా సంబరాలేమీ జరుపుకోవడం లేదు. కరోనా మహమ్మారిని అణిచివేయగలమనే ధైర్యాన్ని, భరోసాను జన చైనా విశ్వ మానవాళికి అందించింది. ఈ అనుభవపు వెలుగులో విశ్వమంతా ఒక్క తాటిపై నిలిచి పోరాడితేనే కరోనా మహమ్మారి అంతు చూడగలుగుతాం.