కరోనాపై పోరు-రెండు వ్యవస్థల తీరు

అతి చిన్నదే, అయినా కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది. ఈ 21వ శతాబ్దంలో రెండు సామాజిక వ్యవస్థలైన పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మధ్య గల తేడాను ప్రస్ఫుటంగా మరోసారి కనపరిచింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను కొన్ని దేశాలు ఎదుర్కొన్న తీరు ఈ తేడాను ప్రముఖంగా చూపిస్తోంది. ఒకవైపు-ప్రపంచం లోనే అతి శక్తివంతమైన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశమైన అమెరికా వుంది. ప్రైవేటీకరించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వుంది. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే ఆరోగ్య రంగం లాభాల దిశగా పయనిస్తోంది. కానీ, కరోనా వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో ఈ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. పైగా ఆస్పత్రుల్లో పడకలు, ఐసియు లు, వెంటిలేటర్లు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యక్తిగత రక్షణ పరికరాలు...అన్నీ అరకొరగానే వున్నాయి. సాధారణ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఆరోగ్య సంరక్షణ అపారమైన వ్యయభరితంగా వుంటుంది. ప్రైవేటు ఆరోగ్య బీమా వ్యవస్థ లక్షలాది మంది ప్రజలకు భరించలేనిదిగా తయారైంది. అమెరికా వంటి అత్యధిక అసమానతలు వున్న సమాజంలో పరిస్థితులు ఇవి. కరోనా వంటి సంక్షుభిత సమయాల్లో కూడా సంపన్నులకు మెరుగైన చికిత్స లభిస్తోంది. మెడికల్‌ కన్సల్టెన్సీ సంస్థలకు భారీగా ఫీజులు చెల్లిస్తూంటే త్వరితగతిన సదుపాయాలు అందుతున్నాయి. దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితుల్లో రెండో వైపు అతి చిన్న దేశమైన క్యూబా వుంది.

సోషలిస్టు సమాజాన్ని అభివృద్ధి పరచాలన్న బృహత్తర ప్రయత్నంలో భాగంగా సమర్ధవంతమైన సోషలిస్టు ఆరోగ్య వ్యవస్థను నిర్మించారు. అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్నా, క్యూబా తన స్వంత వనరులపై ఆధారపడింది. ప్రజలకు సేవ చేసే ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించింది. క్యూబాలో వైద్య చికిత్స ఉచితం. కేవలం రిజిస్ట్రేషన్‌కు మాత్రం చాలా తక్కువ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి వుంటుంది. బయో టెక్నాలజీ ప్రాతిపదికన అధునాతనమైన మందుల పరిశ్రమను క్యూబా అభివృద్ధి చేసుకుంది. లాటిన్‌ అమెరికా, కరేబియా, ఆఫ్రికా దేశాల్లోని నిరుపేద ప్రజలకు సేవ చేసేందుకు క్యూబా వైద్య బృందాలను, డాక్టర్లను పంపుతోంది. కరోనా సంక్షోభ సమయంలో ఇటలీ, వెనిజులా, మరో నాలుగు కరేబియా దేశాలకు క్యూబా డాక్టర్లను, పారా మెడికల్‌ సిబ్బందిని పంపింది. క్యూబాలో సోషలిస్టు వ్యవస్థ వున్నందునే ఇటువంటి వైద్య వ్యవస్థ, ఆరోగ్య ప్రమాణాలు సాధ్యమయ్యాయి. క్యూబా సోషలిస్టు వ్యవస్థలో విద్య, ఆహారం, గృహ నిర్మాణం వంటివన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. మహిళల స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా మాదిరిగా కాకుండా ఇతర అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో సాపేక్షంగా మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థలే వున్నాయి. నయా ఉదారవాద విధానాలు, ఏళ్ళ తరబడి పొదుపు చర్యల కారణంగా ప్రజారోగ్య సదుపాయాలన్నీ బలహీనపడి, తుడిచిపెట్టుకుపోయాయి. బ్రిటన్‌లో జాతీయ ఆరోగ్య సేవలు (ఎన్‌హెచ్‌ఎస్‌)కు సరైన నిధులు అందకపోవడం, ఆరోగ్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటలీ ప్రజారోగ్య వ్యవస్థ కూడా దెబ్బతింది. ప్రజారోగ్య సంరక్షణను మూర్ఖంగా అణగదొక్కడంతో ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. స్పెయిన్‌లో జాతీయం చేయబడిన ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. కరోనా తాకిడిని మొట్టమొదటగా సమర్ధవంతంగా ఎదుర్కొన్న చైనా, అపారమైన కృషి చేసి విజయవంతంగా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. వైద్య రంగానికి అన్ని వనరులను సమకూర్చి కరోనాపై పోరులో విజయం సాధించింది. చరిత్రలో ఇది ప్రతిష్టాత్మకమైన, సమర్ధవంతమైన, శక్తివంతమైన వ్యాధి నిరోధక ప్రయత్నమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా సంయుక్త నివేదిక పేర్కొన్నాయి. సమర్ధవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ వున్నందువల్ల చైనాలో ఇది సాధ్యమైంది.

చైనా 2009లో ఒక అధికార పత్రాన్ని ('ఆరోగ్య వ్యవస్థలో తీవ్ర స్థాయి సంస్కరణలపై అభిప్రాయం') ప్రచురించింది. 2020 నాటికల్లా ప్రజలందరికీ సమర్ధవంతమైన, సమానమైన, అందరికీ అందుబాటులో వుండే ఆరోగ్య వ్యవస్థను నెలకొల్పడానికి రాజకీయ నిబద్ధతను ప్రదర్శించాలన్నది ఆ పత్రం సారాంశం. ఈ దిశగా సాధించిన పురోగతి మన కళ్ళ ముందు కనబడుతోంది. 2017లో ఆరోగ్యరంగంపై మొత్తం వ్యయం...జిడిపిలో 5 శాతం నుండి 6.4 శాతానికి పెరిగింది. 2017లో 82 శాతం ఇన్‌ పేషెంట్ల సంరక్షణను ప్రభుత్వ ఆస్పత్రులే అందించాయి. చైనాలో అతి పెద్ద ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ వుంది. ప్రపంచ దేశాల్లోని ఇతర ఫార్మా కంపెనీలకు అవసరమైన కెమికల్‌ ఏజంట్లను, ఇతర వస్తువులను ఇక్కడి పరిశ్రమే అందిస్తుంది. సరైన ప్రణాళిక, లాభార్జన లేని సామాజిక రంగ అభివృద్ధి కారణంగానే ఇదంతా సాధ్యమైంది.

ఇదే విషయమై పోలిక తీసుకు వస్తే భారత్‌లో పని తీరు చాలా పేలవంగా వుంది. ఇక్కడ, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రైవేటీకరించబడిన ఆరోగ్య వ్యవస్థ వుంది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య విధానం ప్రైవేటీకరణకు రాయితీలు కల్పిస్తోంది. ప్రజారోగ్యంపై పెట్టే వ్యయం జిడిపిలో కేవలం ఒకే ఒక్క శాతంగా వుంది. ప్రతి ఒక్క కుటుంబం తమ వ్యయంలో దాదాపు 70 శాతం ఆరోగ్యం మీదే ఖర్చు పెట్టే పరిస్థితి వుంది. కేవలం 44 శాతం మంది ఇన్‌పేషెంట్ల సంరక్షణను మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులు చూస్తున్నాయి. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని పక్కన పెడితే, ప్రజారోగ్య వ్యవస్థ ప్రజల సాధారణ ఆరోగ్య అవసరాలను తీర్చే పరిస్థితిలో లేదు.

అయితే దేశవ్యాప్తంగా వున్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితి కేరళలో వుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకున్న తీరు పట్ల ఇప్పటికే కేరళ అందరి ప్రశంసలు పొందింది. దశాబ్దాల తరబడి అభవృద్ధి పరిచిన ప్రజారోగ్య సంరక్షణా వ్యవస్థ వల్లనే ఇది సాధ్యమైంది. ప్రస్తుత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ బాగా ఆధునీకరించబడింది, సంస్కరించబడింది. 2017లో 'ఆర్ద్రమ్‌' పేరుతో ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం కింద ఈ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చారు. పటిష్టమైన సిబ్బందితో, సదుపాయాలతో ప్రాథóమిక ఆరోగ్య కేంద్రాలను కుటుంబ ఆరోగ్య సంరక్షణా కేంద్రాలుగా మార్చారు. తాలుకా, జిల్లా స్థాయి ఆస్పత్రులను కూడా వృద్ధిచేశారు. ఆరోగ్య రంగ కార్యకర్తలకు శిక్షణను అందించారు. ఆహార భద్రత, విద్య, గృహ నిర్మాణం, పారిశుధ్యం...వంటి సామాజిక ప్రమాణాల కారణంగా కూడా మెరుగైన ఆరోగ్య ప్రమాణాలు కేరళలో సాధ్యమయ్యాయి. సోషలిస్టు లక్ష్యాలతో స్ఫూర్తి చెందిన విధాన ప్రకటనలు, ప్రజా కార్యాచరణలో వామపక్షాల పాత్ర కూడా ఈ కేరళ నమూనాను ప్రభావితం చేసింది.

ప్రజారోగ్యానికి, ప్రజల సంక్షేమానికి పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల కలుగుతున్న ప్రమాదకరమైన ప్రభావాలు ఈ కరోనా వల్ల ప్రస్ఫుటంగా తేటతెల్లమయ్యాయి. మరోవైపు సోషలిజం వాదన మరింత పటిష్టమైంది. ఇప్పుడు, కరోనా అనంతర పరిస్థితుల్లో సామాజిక పరివర్తన కోసం మనం జరుపుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ఈ అనుభవాన్ని మన అమ్ములపొదిలో పెట్టుకుని ఉపయోగించుకోవడం మన బాధ్యత.