సమాజం ఎప్పుడూ మారుతూ వుంటుంది. ప్రపంచంలో ఏ మార్పు అయినా ఆకాశం నుండి ఊడిపడదు. సమాజంలోనే అందుకు సంబంధించిన చోదకశక్తులు వుంటాయి. బుద్ధిజీవులు వాటిని అర్థం చేసుకొని మార్పును అంగీకరిస్తారు. మరికొందరు వాటికి మానవాతీత శక్తుల్ని అంటగట్టి ఆవేదన చెందుతారు. అనేక భయాందోళనల మధ్య, సవాలక్ష అనుమానాల మధ్య, అనేక అపనమ్మకాల మధ్య, అనంత వేదనలు, ఆవేదనల మధ్య వున్నాం మనం. లాక్‌డౌన్‌లో చాలారోజులు ఉండిపోతే వైరాగ్యం రావడం కద్దు. చాలా రకాల వైరాగ్యాలున్నాయి. ఎవరి చావుకైనా వెళ్లొచ్చినప్పుడు...ఈ పాడు జీవితం బుద్బుదప్రాయం. ఎప్పుడైనా వెళ్లిపోవాల్సిందే కదా.. చెయ్యకూడని పనులన్నీ చేశాం, ఏం కట్టుకుపోతాం...వంటి భావనలతో సతమతం కావడమే స్మశాన వైరాగ్యం. కడుపులో ఆకలి కేక పెట్టగానే ఈ వైరాగ్యం కాస్త మాయమైపోతుంది. ఆ తర్వాత ఎవరి రోజువారి జీవితం వారిదే. అలాగే ప్రతి ప్రసవం తల్లికి జీవన్మరణ పరీక్ష. ప్రసవ వేదన భరిస్తూ మొత్తుకుంటుంది...ఆ సుఖం ఎందుకు...ఈ దుఖం ఎందుకు? ఇకపై అసలు పిల్లలనే కనకూడదు అనుకోవడమే ప్రసూతి వైరాగ్యం. కానీ బిడ్డల మీద ప్రేమను వదులుకుంటుందా? రాజకీయ వైరాగ్యం కూడా అత్యంత వేదనాభరితమని కొందరు రాజకీయ నాయకులను చూస్తే అర్థమౌతుంది. ఇలా చాలా వైరాగ్యాలు వున్నాయి. ఇప్పుడు వీటన్నింటి కంటే భీతిగొల్పే ప్రళయ వైరాగ్యం... కరోనా వైరాగ్యం. 'నెవర్ బిఫోర్...ఎవర్ ఆఫ్టర్' అనేది ఓ పాపులర్ సినిమా డైలాగ్ లాగే, కరోనా తర్వాత ఏమి జరగబోతోంది? అనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఆ తర్వాత జీవితం ఎలా వుంటుంది? ఈ వైరస్ నుండి బయట పడతామా? అనే నైరాశ్యం చాలామందిలో వ్యక్తమౌతోంది..
ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న మహమ్మారి కోవిడ్-19...కులం, మతం, దేశం, ప్రాంతం-దేన్నీ వదలకుండా అందరినీ చుట్టబెట్టేస్తోంది. రాజకుమారుడు చార్లెస్ నుండి బ్రిటన్ ప్రధాని, కెనడా ప్రధాని భార్య వరకు అందరూ కరోనా బాధితులే. ఇటలీలో వందమంది డాక్టర్లు చనిపోయారు. పోప్ భవనం నుండి ఇటలీలో పూజారులు, ఇరాన్‌లో మత ప్రచారకులు, ప్రపంచ వ్యాప్తంగా మూతపడిన దేవాలయాలు-ఏ ఒక్కరూ ప్రపంచంలో భద్రంగా లేరు. కంటికి కనిపించని ఒక జీవమో నిర్జీవమో తేలని కణం ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తూ... మానవ మనుగడకే ప్రమాదకారిగా మారిన సమయంలో 'ఒకరికొకరం' అనే మానవత్వం అవసరం. 'అన్నీ పురాణాల్లోనే వున్నాయష' అన్నవారు, మంత్రాలకు చింతకాయలు రాల్తాయని ఉద్భోదించేవారు ముఖం చాటేశారు. ఇప్పుడు నిజంగానే గోవు పేడ, గో మూత్రాన్ని నమ్ముకుంటే... కొంప మునుగుతుందని అర్థమవడంతో వారినిప్పుడు కరోనా వైరాగ్యం ఆవహించింది. కనిపించని దేవుడిపై వుండే నమ్మకం కన్నా...కనిపించని కరోనాని నమ్మక తప్పడంలేదు. ముఖానికి మాస్కులు కట్టుకున్నా, శానిటైజర్‌తో పదేపదే చేతులు కడుక్కుంటున్నా ఆ నమ్మకమే. ఆచరణలో ప్రతివాడూ లౌకికవాదేనని రుజువు చేసిన నగసత్యం ఇది. అయితే, ప్రాణం పోతున్నా... మతం, కులం, జెండర్, సామాజిక వివక్షలను వదలని ఘనచరిత మనది. ఎదుటివాడి ప్రాణం తీసైనా ఈ ఘనతను నిలుపుకోవాలనుకునే నైజం మనది. స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగే కరోనా వైరాగ్యమూ సడలుతుంది. మళ్లీ మంత్రాలకు చింతకాయలు రాల్తాయని ఉపదేశించేవారు తమ నిజరూపు దాల్చుతారు. ఈ మంత్రాలకు, వంకరటింకర జీవితాలకు ఒక ప్రత్యామ్నాయం, వాస్తవిక దృష్టి కావాలి.
'ఆశ మీదనే మనుష్యుడు బ్రదుకుచుండును/ గాని బానిసవలె నిరర్థకముగా పని చేయడు' అంటాడు చిలకమర్తి. నెల రోజుల్లోనా రెండు నెలల్లోనా అని చెప్పలేకపోవచ్చు గాని ఏదోక రోజున మనం కరోనాపై విజయం సాధిస్తాం. దీనికి సంబంధించిన మందులు, వ్యాక్సిన్లూ వస్తాయి. ఒక్కసారి చరిత్ర లోకి వెళితే, మనం మశూచిని జయించాం. ప్లేగు, పోలియోను జయించాం. స్పానిష్ ఫ్లూనీ జయించాం. అలాగే కోవిడ్-19ని కూడా జయిస్తాం. ఈలోగా సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడటానికి ప్రయత్నించాలి. 'ప్రపంచమంతా ఒక్కటై, ప్రతీ ఒక్క మనిషినీ కాసుకున్నప్పుడు, తప్పకుండా ప్రపంచం నెగ్గుతుంది' అంటాడు ప్రముఖ రచయిత భమిడిపాటి కామేశ్వర రావు 'బాగు బాగు' అనే నాటకంలో. వాస్తవానికి లౌకికవాదం, వాస్తవిక దృష్టితో ఆలోచించిన చైనా, క్యూబా వంటి దేశాలు మాత్రమే కరోనాను కట్టడి చేయగలిగాయి. ఈ స్మశాన వైరాగ్యం నుండి బయటపడి, కంటికి కానరాని అతీతశక్తులు గాక ఎదురుగా ఉన్న మానవ సమాజపు సమిష్టి స్ఫూర్తితో మాత్రమే కరోనాను తరిమికొట్టగలం అన్న వాస్తవాన్ని గ్రహించాలి. ధైర్యంతో ముందుకు సాగాలి. చేతులు కలపకుండా అందరమూ కలవాలి.