కరోనా వైరస్ మృతుల సంఖ్య లక్ష దాటిపోరుంది. ఇందులో డెబ్భై అయిదు వేల మంది అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా వంటి సంపన్న దేశాలలోనే మరణించడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఆయా దేశాల అనుభవాలలో పరిపరివిధాలుగా వుండొచ్చు గాని ఒక విషయంలో మాత్రం తేడా లేదు. ఇది ప్రపంచీకరణ వైఫల్యం. నయా ఉదారవాద విధాన సంక్షోభం. అందుకు అతి తీవ్రంగా గురైన వైద్య వ్యవస్థల వైఫల్యం. ప్రపంచ ప్రజల ఆరోగ్య, ఆర్థిక, ఆహార భద్రతలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిన విషాదం. అద్దాల మేడలా మెరిసిన అంతర్జాతీయ వ్యవస్థ భూత్ బంగళాగా మారిపోయింది. ఏ యుద్ధం లేకుండానే శత్రువు దాడి లేకుండానే శవాల గుట్టలు పడుతున్నాయి. కరోనా అదృశ్య శత్రువు అంటున్నారు గాని నిజానికి అగోచర శత్రువు. మనం నివసిస్తున్న మార్కెట్ మాయాబజార్ మాత్రమే. మనుషుల ప్రాణాలకూ మానవాళి మనుగడకు ఆ మార్కెట్‌లో విలువ లేదు గనకే కరోనా కరాళ నృత్యాన్ని ఆపేందుకు కార్పొరేట్ వైద్య వ్యవస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. అంతకు ముందే కుప్పకూల్చబడిన ప్రజారోగ్య వ్యవస్థకు ఇంత స్వల్ప వ్యవధిలో సవాలును స్వీకరించగల సత్తా లేకపోయింది. వైద్య నిపుణుల కొరత, సహాయక సిబ్బంది, యంత్రాంగం, పరికరాలు, మందులు అన్నిటినీ కోత కోసిన స్థితి. దానికి చెల్లిస్తున్న మూల్యమే ఇంతటి ప్రాణ బలి.
మొదట పేర్కొన్న జాబితా లోని దేశాలన్నీ చితికిపోయిన పెట్టుబడిదారీ దేశాలే. పైగా వాటిలో చాలా భాగం ఇతర దేశాలను ఆక్రమించిన వలసాధిపత్య రాజ్యాలు కూడా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆధిపత్య శక్తిగా అవతరించినా పాశం వండిన కుండ వాసన పోదన్నట్టు వాటికీ సంపన్న వారసత్వం కొనసాగుతూనే వుంది. వాటి తలసరి ఆదాయాలు ఎక్కువగానే వున్నాయి. వర్ధమాన దేశాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారి సేవలు వినియోగించుకుంటూ సాంకేతిక రంగం లోనూ ఆధిక్యత, బహుళజాతి కంపెనీల ద్వారా ఆర్థిక ప్రాబల్యం సాగిస్తున్నాయి. అలాంటి దేశాలలో ఈ దయనీయ పరిస్థితి ఎలా వచ్చింది? పైగా కరోనా వైరస్ వల్ల మరణాలు అయిదు శాతం లోపే అని చెప్పుకున్న నేపథ్యంలో వేల వేలమంది కుప్పకూలడం ఎందుకు జరుగుతున్నది? ఉదాహరణకు పాజిటివ్ కేసులలో స్పెయిన్‌లో 18.3 శాతం మంది, ఇటలీలో 15.8 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఎందుకంటే వారి సంపదలూ వ్యవస్థలూ ప్రజలను ఆదుకోడానికి బదులు వ్యాపార రేఖలలో బంధితమై వున్నాయి. పైగా సుఖంగా వున్నా మనుకునే ఆ ప్రజలకు వాటిని అందిపుచ్చుకోగల స్థితి కూడా లేకుండా పోయింది. వాస్తవానికి కరోనా సోకిన పేర్లలో యువరాజులు, ప్రధానులు, మంత్రులూ హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వున్నారు. వారిలో కొందరు కోలుకున్నా మరణించిన వారూ ఎక్కువే. కారణం ఆ వ్యవస్థల దృష్టికోణం రోగ నివారణ, నిరోధం నుంచి వైద్య వ్యాపారం వైపు మరలడమే. సామూహిక ఆరోగ్య సవాలును అందుకునే పరిస్థితి వాటికి లేకుండా పోయింది. క్యాన్సర్లు, హృద్రోగాలు, ఎయిడ్స్, ట్రాన్స్‌ప్లాంటేషన్లు, కాస్మొటిక్ సర్జరీలు, ఇలాంటి వాటి గురించే ఇంకా ఇంకా మాట్లాడుతూ భారీ రేట్లతో నిర్వహిస్తూ లాభాలు పోసుకోవడం వాటి పని. పైగా లాభాలు తక్కువగా వుండే అంటువ్యాధులు, వైరస్‌ల వంటి వాటిపై పరిశోధన, చికిత్స, మందులు కనుక్కోవడం వాటికి నచ్చని విషయం. అవి అవసరం లేనివని కాదుగాని ఎక్కువ మందికి ఎక్కువగా సోకే వ్యాధులపై దృష్టి లేకుండా పోయింది. ఇప్పుడైనా సరే ఆ సవాలును అందుకోవడానికి అవి ముందుకు రాలేదు. రావు కూడా. పేద మధ్యతరగతి వారికి చెల్లింపు సామర్థ్యం వుండదు. ఆరోగ్య బీమా గొప్ప వరప్రసాదంగా చెబుతారు గాని అనుకోని ఆపదలకు అది అక్కరకు రాదు. పైగా దానివల్ల కేసులు తీసుకోవడానికి మరింత వెనుకాడటం అనివార్యమవుతుంది. వైద్య రంగంలో ఇదంతా ఒక విష వలయం. ఇప్పుడు కూడా దేశాధినేతలు ఎంతగా ఆదేశించినా, అభ్యర్థించినా కరోనా పోరాటంలో కార్పొరేట్ చొరవ కనిపించడం లేదు. తత్ఫలితమే ఈ మానవ మహా విషాదం.
మన దేశంలో కరోనా వైరస్ పరీక్షలు నామమాత్రంగా జరిగాయంటే ఇదే కారణం. అవి లేకుండా వ్యాధి వ్యాప్తిపై తుది నిర్ధారణలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం. అశాస్త్రీయం. ఈ పరీక్షకు రూ.4500 ఫీజు ప్రపంచం లోనే అత్యధికమని నిపుణులు వ్యాఖ్యానించారు. పైగా దానికి రెండు రోజుల వ్యవధి. పరీక్షా సదుపాయాలు విస్తరించలేని కేంద్రం పరీక్ష చేయించుకోడానికి అర్హతలు ప్రకటించింది. ఇవన్నీ ఒక్క ఐసిఎంఆర్ ఆధ్వర్యం లోనే జరగాలని ఆదేశించింది. అందుకే జనాభాలో రెండవ స్థానంలో వున్నా కేసులు కూడా వేలలో బయిటపడుతున్నా ప్రపంచంలోకెల్లా తక్కువగా మన దగ్గర పరీక్షలు జరిగాయి. తర్వాత దశలో ఈ పరీక్షలలో యాంటీబాడీ టెస్ట్ అని సులభతర విధానం ప్రకటించగా అది కూడా కేరళ లోనే సగానికి పైగా జరిగాయి. పరీక్షల ఖరీదు తగ్గించడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు కూడా వాటిని నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. పెద్దగా ప్రచారం చేసుకునే పంచ నక్షత్రాల ఆస్పత్రులు కనీసం పరీక్షలకు కూడా సిద్ధం కాకపోవడం వల్లనే అత్యున్నత న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. వాటికి ఆ పరీక్షల ఖర్చును తర్వాత ప్రభుత్వం చెల్లించాలని కూడా కోర్టు నిర్దేశించింది. ఆ తర్వాత కొన్ని ఆస్పత్రులు తీవ్రమైన అసంతృప్తి తోనే పరీక్షలు చేస్తున్నాయి. అయితే దీనివల్ల కరోనాపై పోరాటానికి ఆటంకం కలుగుతుందని అపోలో ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇక ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత తరచూ మీడియాలో మాట్టాడే కిరణ్ షా కూడా ఈ ఆదేశంలో న్యాయం లేదని విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణ భారం కూడా గమనించాలని ఆమె దీర్ఘాలు తీస్తున్నారు. జాతీయ పత్రికలు కూడా ఈ పరీక్షల పద్ధతి మారాలని సంపాదకీయాలు రాశాయి. 'కరోనాపై పోరాటం' పేరుతో ఆస్పత్రులలో ఓపి మూసివేసి అత్యవసర కేసులు మాత్రమే చూడాలంటే కార్పొరేట్ వైద్యశాలలు దాదాపు మూత పెట్టారు. తెరిచి ఉంటే కరోనా కేసులు వస్తాయనే ఆందోళన ఒకటైతే వచ్చిన వారి దగ్గర ఫీజుల భారం కూడా బాగానే పడుతున్నది. బాగా పరిచితమైన ఒక ఆస్పత్రిలో ప్రవేశిస్తే రూ.70-80 వేలు లేకుండా బయిటకు రాలేకపోతున్నారు. ఐసొలేషన్ వార్డులు, భౌతిక దూరం వంటి జాగ్రత్త లన్నీ పాటించవలసి వుంటుంది గనక ప్రైవేటు సంస్థలు గప్‌చిప్‌గా వుండిపోయాయి. ప్రభుత్వాలే రైల్వే కోచ్‌లనూ విద్యాసంస్థలనూ స్టేడియంలనూ వార్డులుగా మారుస్తున్నాయి. మన దేశమే ఇలా వుంటే మార్కెట్ వ్యవస్థలో పైనున్న పాశ్చాత్య ప్రపంచం పరిస్థితి వేరే చెప్పనవసరం వుందా?
వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే విసయంలోనూ ఇదే వైరుధ్యం. ఇందుకు కనీసం ఏడాది పడుతుందని మొదటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వ్యాక్సిన్ పరిశోధనలో వివిధ దశలు అంత సమయం తీసుకుంటాయి. పైగా అందుకోసం అంతర్జాతీయ సహకారం అవసరం. కాని ఏదో వచ్చేస్తుందన్నట్టు మొదట ట్రంప్ మాట్లాడారు. జయప్రదంగా అరికట్టిన మొదటి దేశం చైనాను కలుపుకోకపోగా విద్వేష ప్రచారం చేశారు. మన దేశంలోనూ 'ఇదిగో...అదుగో... వ్యాక్సిన్' అన్న వారున్నారు గాని అవేమీ జరిగింది లేదు. సహజంగా సమయం పడుతుందనేది ఒకటైతే ఈ వ్యాక్సిన్ వల్ల లాభాలు భారీగా వుంటాయా లేదా అన్నది కంపెనీలు ప్రధానంగా ఆలోచించే అంశం. భారత దేశంలో సమృద్ధిగా ఉత్పత్తి అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటివి అమెరికా, యూరప్‌లు ఎందుకు తయారు చేయడం లేదు? ఆ దేశాల్లో మలేరియా లేకుండా పోవడం ఇందుకు కారణమంటారు. వారికి లేకున్నా ఇతరులకు ఎగుమతి చేయొచ్చు. కాని ఎందుకు చేయవంటే దానిపై లాభాలు పెద్దగా రావు గనక! క్లోరోక్విన్ పని చేస్తుందని పరిశోధనల్లో తేలకపోయినా ట్రంప్ దానికి అత్యధిక ప్రచార మిచ్చారు. దాన్ని తెప్పించడం ద్వారా ప్రచారం పొందవచ్చని భావించారు. ఇక మన దేశంలో బాగా వేళ్లూనుకున్న ఫార్మా పరిశ్రమాధిపతులు క్లోరోక్విన్ ఎగుమతితో లాభాలు పొందేందుకు ఎదురు చూస్తున్నారు. ఆ ఒత్తిడి వల్లనే ప్రభుత్వం అమెరికా బెదిరింపులపై పెదవి మెదపకుండా ఆంక్షలు సడలించి ఎగుమతికి అనుమతించింది. ఇందులోనూ వారి ప్రైవేటు వ్యాపార ఒప్పందాలే ప్రధానం. మనకు కొరత లేదంటున్నారు గాని పారదర్శకంగా సమీక్షించింది లేదు. ప్రతీకారం తీర్చుకుంటామన్న వారికి లొంగిపోయిన మన పాలక వర్గం లక్షా 70 వేల పిపిఇ ల సెట్లు పంపి సహకారం ఇచ్చిన చైనాపై వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతుంటుంది. మనకు వైద్య పరికరాలు పంపిన ఒకే దేశం చైనా మాత్రమే. ఆ సామర్థ్యం వున్నదీ దానికే. చైనా డబ్ల్యుటివో లో చేరడానికి తాము సహకరించినందు వల్లనే ఇదంతా సాధ్యమైందని ట్రంప్ వాపోతున్నారు. మరి ఇండియా కూడా చేరినా దాన్ని ఎలా బెదిరించ గలుగుతున్నారు? విశ్వ వాణిజ్యంలో పరస్పర పోటీ అందరికీ అవకాశం వంటి నీతులు చెప్పిన అగ్రరాజ్యం ఇలాంటి స్థితికి ఎందుకు దిగజారింది?
1930 మహా మాంద్యం తర్వాత ఎన్నడూ లేనంత దుస్థితికి ప్రపంచం చేరిందని ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జియేవా ప్రకటించారు. 170 దేశాల జిడిపి తిరోగమి స్తుందని చెప్పారు. తాము కొద్ది మాసాల కిందట అంచనా వేసిన మెరుగుదల కాస్తా తిరోగమనంలో పడిందంటూ దీనిపై సమీక్షకు సమావేశం ఏర్పాటు చేశారు. భారతదేశం లోనే 23 శాతం నిరుద్యోగం పెరుగుతుందనీ, 40 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోతారని లెక్కలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ లో లక్షోపలక్షల పేదలు, శ్రమజీవుల దురవస్థలు కళ్లకు కడుతున్నాయి. అమెరికా ఆరోగ్య సంక్షోభంతో పాటు ఆర్థిక అఘాతంలో కూరుకుపోతుంటే ఉద్యోగాలు భారీగా వూడిపోతాయని హడలిపోతున్నారు. యూరప్ సంగతి చెప్పనే అవసరం లేదు. ఆసియాలో చాలా దేశాలు అఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు మరింత ఎక్కవగా చితికిపోతాయని కూడా ఐఎంఎఫ్ హెచ్చరిస్తున్నది. పైగా ఈ సంకట స్థితిని ఆసరాగా తీసుకుని మరింత పని భారం పెంచి, జీతభత్యాలు భద్రత కోత కోసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇండియా లోనే 12 గంటల పనిదినం అంటున్నారు. ఆహార ఆరోగ్య భద్రత లేని కష్టజీవుల కన్నా కార్పొరేట్ ఒత్తిళ్లే ఈ సమయం లోనూ ప్రభుత్వాలను ఆడిస్తున్నాయి. ఏతావాతా కరోనా తాకిడికి తలకిందులైన ప్రపంచీకరణ వైఫల్యం మరిన్ని వైపరీత్యాలను చూపించనుంది. ఇవన్నీ ఊహలు కాదు, కనిపిస్తున్న నిజాలు.