మహమ్మారి పీడిత ప్రజలు - ద్రవ్య పెట్టుబడి

ప్రస్తుత కాలపు ప్రపంచీకరణ లోని ప్రధాన వైరుధ్యాన్ని కోవిడ్‌-19 మహమ్మారి మన కళ్లకు కట్టినట్లు స్పష్టంగా చూపిస్తోంది. ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకూ, సాధారణ ప్రజల ప్రయోజనాలకూ మధ్య ఉండే మౌలిక వైరుధ్యమే ఇప్పుడు ప్రధానంగా ముందుకొచ్చింది. ప్రపంచీకరణ శకం అంతటికీ ఈ వైరుధ్యమే మౌలికమైనది. ఇప్పుడది స్పష్టంగా ముందుకొచ్చింది.
వరుసగా ఒక్కొక్క దేశం లోనూ ఇది బైటపడుతోంది. మన దేశాన్నే తీసుకోండి. ఒక్కసారిగా పదుల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. లక్షలాది వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు దూరంగా ఇన్నాళ్లూ పనులు చేస్తున్న వాళ్లు కాస్తా ఆ పనులు పోవడంతో కాలి నడకన వెనక్కి బయలుదేరారు. చాలా మంది క్వారంటైన్‌లో ఉండిపోయారు. వాళ్ల జేబుల్లో చిల్లి గవ్వ లేదు. ఇటువంటి వారిని ఆదుకొని సహాయం అందించాలి. అలా చేయాలంటే ద్రవ్యలోటును పెంచాల్సిందే.
కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఇలా ద్రవ్యలోటును పెంచడం అంగీకారం కాదు. అందుకే ప్రభుత్వం అలా చేయడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ చర్యల ప్యాకేజీ అత్యంత స్వల్పంగా ఉంది. అందులో కూడా ఇప్పటికే బడ్జెట్‌లో ప్రతిపాదించిన చర్యలు కూడా ఉన్నాయి. వాటిని పక్కనబెట్టి లెక్క వేస్తే కేవలం రూ.92,000 కోట్లు మాత్రమే సహాయం అందుతుంది. అందులో నగదు రూపంలో అందేది రూ.34,000 కోట్లు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల రూపంలో అందేది రూ.45,000 కోట్లు. వంటగ్యాస్‌ సిలిండర్ల రూపంలో మరో రూ.13,000 కోట్లు. ఇదంతా కలిపితే మన దేశ జిడిపిలో 0.5 శాతం మాత్రమే. స్వాతంత్య్రానంతర కాలంలో మన దేశం ఎప్పుడూ ఎదుర్కోనంత గడ్డు పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంత స్వల్పంగా సహాయం ప్రకటించడం చాలా అన్యాయం.

మన ఆర్థిక పరిస్థితి మాటేంటి? 5 కోట్ల 80 లక్షల టన్నుల ఆహారధాన్యాల నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఖరీఫ్‌లో సేకరించిన పంట ఇంకా పంపిణీకి సిద్ధం కాలేదు. దానితో కలిపితే ఏకంగా 7 కోట్ల 70 లక్షల టన్నులు! ప్రస్తుతం రబీ పంట కూడా బాగా పండింది. పారిశ్రామిక రంగమేమో డిమాండ్‌ కొరతతో కునారిల్లుతోంది. పూర్తి స్థాపక సామర్థ్యం కన్నా చాలా దిగువ స్థాయి లోనే ఉత్పత్తి జరుగుతోంది. నిజానికి ఈ కోవిడ్‌-19 మహమ్మారి వ్యాపించక ముందే మనం పారిశ్రామిక మాంద్యం లోకి జారిపోవడం మొదలైంది. ఇక విదేశీ మారక నిల్వలు చూస్తే రికార్డు స్థాయిలో 50,000 కోట్ల డాలర్లు పోగుబడి వున్నాయి (అంటే సుమారు రూ.38 లక్షల కోట్లు)! ఈ పరిస్థితుల్లో ద్రవ్యలోటు భారీగా పెరిగినా దేశ ఆర్థిక వ్యవస్థకొచ్చే ముప్పేమీ లేదు. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఇందుకు అంగీకరించదు. ఆ కారణంగానే ప్రజలు ఇంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ద్రవ్యలోటు గనుక పెరిగితే అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు భారత దేశపు రేటింగ్‌ను తగ్గించేస్తాయి. రేటింగ్‌ తగ్గిపోతే మన దేశంలో మదుపులు పెట్టే వారి విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అప్పుడు వాళ్లు ఈ దేశం నుండి తమ పెట్టుబడులను మరో దేశానికి తరలించుకుపోతారు. దాని పర్యవసానంగా రూపాయి విలువ మరింత పడిపోతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇదీ అధికార వర్గాలకున్న భయం.
అయితే ఇక్కడ వాళ్లు ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. అటువంటి పరిస్థితే (పెట్టుబడులను మరో దేశానికి తరలించుకుపోయే పరిస్థితి) గనుక వస్తే మన ప్రభుత్వం ఆ పెట్టుబడుల తరలింపుపై ఆంక్షలు విధించవచ్చు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా అటువంటి చర్యలతో నియంత్రించవచ్చు. కాని మన 'హిందూత్వ' ప్రభుత్వం మాత్రం ఆ సాహసం చేయలేకపోతోంది.
ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రభుత్వాన్ని కదలనీయకుండా కాళ్లు, చేతులు కట్టేసేటటువంటి పట్టు అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి కలిగివుండడం ఏమిటి? మన ప్రభుత్వానికి ఈ సంగతి తోచదు. అందుకే ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా పెట్టుబడుల రాకపోకలను నియంత్రించవచ్చన్న ప్రయత్నమే చేయకుండా వుంది. ద్రవ్యలోటు పెరిగి, క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గితే ఆ తర్వాత కదా పెట్టుబడులు తరలిపోయే సమస్య తలెత్తుతుంది. కాని ఆ ఆలోచన చెయ్యడానికే భయపడిపోతున్న మోడీ ప్రభుత్వం ద్రవ్యపెట్టుబడిని సంతృప్తి పరచడం కోసం ప్రజల ప్రయోజనాలను బలిపెడుతోంది.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించి మాట్లాడలేని కేంద్ర ప్రభుత్వపు పిరికితనం రాష్ట్ర ప్రభుత్వాల కాళ్లూ చేతులూ కట్టిపడేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు అయ్యే వ్యయంలో గణనీయమైన భాగాన్ని రాష్ట్రాలే భరించాలి. కాని బిజెపి ప్రభుత్వ హయాంలో ఆర్థిక వనరుల కేంద్రీకరణ అంతకంతకూ పెరుగుతోంది. జిఎస్‌టి విధానం వచ్చాక ఏ రాష్ట్రమూ ఏ సరుకు మీదా జిఎస్‌టి కౌన్సిల్‌ అనుమతి లేకుండా పన్ను విధించలేదు. ఆ కౌన్సిల్‌ మీద కేంద్రానికి పెత్తనం. అందువలన కేంద్రం నుండి వచ్చే నిధుల పైనే రాష్ట్రాలన్నీ ఆధారపడవలసి వస్తోంది.
చివరకు రాష్ట్రాలు ఏ మోతాదులో అప్పులు తేవొచ్చు అన్నది కూడా కేంద్రం అదుపులోనే ఉంది. అందుచేత కేంద్రం దగ్గర నిధులు లేకపోతే రాష్ట్రాల దగ్గరా ఉండవు. కేంద్రం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి లొంగి వుంటే రాష్ట్రాలూ లొంగి వుండాల్సి వస్తోంది. పై నుంచి కింది వరకు అన్ని స్థాయిల్లోనూ ప్రజల ఇబ్బందుల్ని తొలగించడం కోసం ప్రభుత్వాలు తగినంత మోతాదులో ఖర్చు చేయనీయకుండా అడ్డు పడుతున్నది కేంద్ర ప్రభుత్వపు ఈ పిరికితనమే.
ఇదే రకమైన ఘర్షణ యూరప్‌ లోనూ కనబడుతోంది. దక్షిణ యూరప్‌ లోని దేశాలు, ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌ ఈ మహమ్మారి వల్ల బాగా దెబ్బతిన్నాయి. ఏ దేశానికి ఆదేశం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించుకోవాలి. అందుచేత యూరో దేశాలన్నీ కలిపి ఉమ్మడిగా రుణాల కోసం బాండ్లు విడుదల చేస్తే వాటిపై చెల్లించే వడ్డీ తగ్గుతుందని కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. అంటే ఇటలీ కోసం, స్పెయిన్‌ కోసం, మొత్తం యూరో దేశాలన్నీ కలసి ఉమ్మడిగా అప్పు తేవాలి.
ఈ ప్రతిపాదన చేసింది ఇటలీ. కాని జర్మనీ, నెదర్లాండ్స్‌ దీనికి ఒప్పుకోలేదు. యూరో జోన్‌లో జర్మన్‌ ద్రవ్య పెట్టుబడిదే సింహభాగం. ఏ దేశానికి ఆ దేశం అప్పు చేసి దాని పర్యవసానాలు ఎదుర్కోవాలే తప్ప ఆ సమస్యను అన్ని దేశాలూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న ఆలోచనను జర్మనీ తిరస్కరించింది. ఏ దేశానికి అప్పు అవసరమో ఆ దేశపు ద్రవ్యలోటు పెరుగుతుంది. దాని పర్యవసానాలను ఆ దేశమే భరించాలి తప్ప తక్కిన దేశాలు ఎందుకు భరించాలి అన్నది జర్మనీ వాదన. ఈ వాదనను జర్మన్‌ ద్రవ్యపెట్టుబడి తరపున ముందుకు తెస్తున్న జర్మనీ అధినేత ఏంజెలా మెర్కెల్‌ ఇదే రకమైన వాదనను గతంలో గ్రీస్‌ దేశ సంక్షోభ సమయం లోనూ జర్మనీ చేసింది. ఆ దేశపు అప్పుల్ని రీ షెడ్యూల్‌ చెయ్యడానికి సుతరామూ ఒప్పుకోలేదు. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు, మేధావులు ఏంజెలా మెర్కెల్‌ను అభ్యర్థించారు. వందేళ్ల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం 'వర్సెయిల్స్‌ సంధి' ద్వారా జర్మనీపై కఠినమైన ఆంక్షలను విధించడం వలన అక్కడ నాజీయిజం ప్రబలడానికి అది ఏవిధంగా దోహదం చేసిందీ వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు (కొమింటర్న్‌ రెండవ మహాసభలో తన ప్రసంగంలో ఈ ఆంక్షలు గురించి ప్రస్తావిస్తూ అది ప్రపంచంలో విప్లవాలు బద్దలవుతాయన్న దానికి ఏవిధంగా సంకేతమో లెనిన్‌ వివరించాడు). కాని ద్రవ్యపెట్టుబడి ఈ విజ్ఞప్తులకు ఏమాత్రం చలించడం లేదు.
ప్రస్తుతం ఈ మహమ్మారి తాకిడి నేపథ్యంలో పలు మూడో ప్రపంచ దేశాలు తమ రుణాలను రీ షెడ్యూల్‌ చేయవలసింది గాను, కొత్తగా రుణాలు ఇవ్వవలసింది గాను కోరుతున్నాయి. ఐఎంఎఫ్‌ స్వంత ఆర్థిక వనరులు చాలా తక్కువ. అందువల్ల మహమ్మారి బాధితులకు సహాయం కోసమూ, తనకు ఆర్థిక వనరులను సమకూర్చిన ద్రవ్య సంస్థల ప్రయోజనాల కోసమూ-రెండింటికీ సరిపడా నిధులు ఐఎంఎఫ్‌ సమకూర్చగలిగిన స్థితిలో లేదు. అందుచేత ఐఎంఎఫ్‌ చేయబోయే రుణాల రీ షెడ్యూలింగ్‌ వలన కార్మికులకు, పేదలకు సహాయం అందించగలిగే అదనపు వనరులు ఏమీ రావు.
ఆ విధంగా ద్రవ్య పెట్టుబడికి, మహమ్మారి పీడిత ప్రజలకి మధ్య వైరుధ్యం తీవ్రమౌతోంది. 'వృద్ధి రేటును పెంచాలి', 'సంపద సృష్టించాలి' వంటి పద ప్రయోగాల మాటున ద్రవ్య పెట్టుబడి దాడి చేస్తోంది. వృద్ధి రేటు పెరిగితే సామాన్యులతో సహా అందరి జీవితాలూ వృద్ధి చెందుతాయన్నట్లు... దేశంలో 'సంపద వృద్ధి' జరిగితే ఆ సంపదలో దేశ ప్రజానీకం యావత్తూ వాటాలు పొందుతారన్నట్లు అభిప్రాయాలు కలిగిస్తారు. దేశ ప్రయోజనాలంటే ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలే అన్నట్లు, ఆ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను కాపాడడమే నిజమైన దేశ సేవ అన్నట్లు ప్రచారం చేస్తారు.
అయితే నానాటికీ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతలో ఇలాంటి ప్రచారాలు, వాదనలు ఎక్కువసేపు నిలవవు. వడ్డీ రేట్లు తగ్గించినంత మాత్రాన ప్రపంచం సంక్షోభం నుండి కోలుకోదు. ప్రజలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని పెద్ద ఎత్తున చేయాలి. ఇందుకోసం ద్రవ్యలోటును పెంచక తప్పదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చట్రం లోపలే వుంటూ ఇటువంటి ఆర్థిక సహాయం అందించడం ఏ ప్రభుత్వం వల్లా కాదు. ఒకవేళ అలా చేస్తే దేశం నుండి పెట్టుబడులు విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉంటుంది.
అంటే ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం. ఈ మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు ఆ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఈ వాస్తవాన్ని ఏవో పదాల ముసుగులో కప్పి పుచ్చడం ఇంక ఎంత మాత్రమూ సాధ్యం కాదు. తక్షణమే ప్రజలను ఆదుకోవాల్సిన కర్తవ్యం ముందు నిలుచుని వుంది. దాన్ని నెరవేర్చడానికి ప్రధాన ఆటంకంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వుంది. ఈ వైరుధ్యం ముదిరి రాబోయే కాలంలో అంతర్జాతీయ పెట్టుబడి ఆధ్వర్యం లోని ప్రపంచీకరణకు చావు గంట మోగిస్తుంది.

- ప్రభాత్‌ పట్నాయక్‌