అంబేద్కర్‌ స్ఫూర్తితో....

నేడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి. ప్రతి ప్రజాస్వామ్యవాదీ, ప్రతి బడుగు జీవీ, ప్రతి దళితుడూ తమ కోసం జీవిత కాలమంతా పోరాడి, మరణానంతరం కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ మహామనీషిని స్మరిస్తారు. భక్తితో తలచుకుంటారు. ఆయన ఆశయాలకు పునరంకితమౌతారు.
భారత దేశంలో అంబేద్కర్‌ వేసిన ముద్ర ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తోందంటే పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలు సైతం ఈ రోజు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తాయి. అయితే ఇదంతా మాటలకే పరిమితం అయ్యే నాటకం అని వేరే చెప్పనక్కర్లేదు. నిజంగానే ఈ పాలక వర్గాలకి అంబేద్కర్‌ మీద గౌరవం ఉంటే మన దేశంలో ఎప్పుడో కుల వివక్ష, కుల పీడన, దాడులు, అత్యాచారాలు నిలిచిపోయి ఉండాలి.
కనీసం ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సృష్టించిన బీభత్సం నేపథ్యంలోనైనా నిజాయితీగా అంబేద్కర్‌ ఆశయాలను అమలు జరిపే చిత్తశుద్ధి పాలకుల్లో కనపడుతోందా?
మన బ్రాహ్మణవాద ఆధిపత్య సమాజం ఒకవైపు హారతులు వెలిగించి, దీపాలు పెట్టి, చప్పట్లు కొట్టి, శంఖాలూది నానా రభసా చేస్తోంది. ఇంకోపక్క తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పారిశుధ్య యుద్ధ రంగంలో ముందు పీఠిన నిలిచిన సైనికుల మాదిరి రేయింబవళ్లు కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. వారికి ఏ రక్షణా లేదు. ఏ గ్యారంటీనీ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇవ్వలేదు. చివరికి పేరుకుపోయిన జీతాల బకాయిలను సైతం ఇవ్వలేదు. పైగా కొన్ని చోట్ల జీతాలకు కోతలు సైతం తప్పడం లేదు. ఇంత అన్యాయంగా నిర్లక్ష్యం వహిస్తున్నా, పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రజలందరి ప్రాణాలకూ తమ ప్రాణాలను అడ్డం వేసి పోరాడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వాలకి సిగ్గూ శరమూ ఉంటే వీరి పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి బహిరంగంగా లెంపలు వేసుకుని చేసిన తప్పులు వెంటనే దిద్దుకోవాలి.
కుల వ్యవస్థను, దానితోపాటే వెన్నంటి వచ్చే ఆధిపత్యాన్ని, వివక్షను సమర్థించేవారు ఈ రోజువారి పీకల మీదకు కరోనా భూతం వచ్చి కూచున్న వేళ, తమను కాపడుతున్నదెవరో చూడగలుగుతారా? ఇటువంటి విపత్తులోనైనా నిజాన్ని నిజాయితీగా అంగీకరిస్తారా? అంగీకరించే నిజాయితీ, చేవ ఉంటే వెంటనే మను ధర్మశాస్త్రాన్ని తగల బెట్టాలి. కుల వ్యవస్థను, వివక్షను సమూలంగా పెకిలించి వేయడానికి సిద్ధపడి ముందుకు రావాలి. హిందూత్వవాదులు మనువాదం భజనను విసర్జించాలి. 'హిందూ సమాజం' అంటూ మతం రంగు కళ్లద్దాలతో మాత్రమే ఈ సమాజాన్ని దర్శించే ప్రబుద్ధులు కుల వ్యవస్థ లేని సమాజంగా దానిని తీర్చిదిద్దుతామని ప్రకటించాలి. వేల సంవత్సరాల అణచివేత వల్ల, వివక్ష వల్ల అన్ని రకాలుగా, అన్ని రంగాలలో వెనకబడిన దళిత బహుజనులకు సామాజిక న్యాయం జరిగేలా తమ విధానాలను, తమ ప్రాధాన్యతలను మార్చుకుంటామని ప్రకటించాలి. అలా చేయగలిగిన నిజాయితీని ఈ విపత్కాలంలోనైనా ప్రదర్శించగలిగే ధైర్యం వారికుందా?
బాబా సాహెబ్‌ మేథస్సుతో రూపు దిద్దుకుని, ఆయన చేతుల్లో జీవం పోసుకున్న మన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఇచ్చింది. ఈ జీవించే హక్కే రాజ్యాంగానికి పునాది. జీవించే హక్కుని గ్యారంటీ చేయడం అంటే కొన ప్రాణాలతో మనుషుల్ని బతకమని వారి ఖర్మలకు వారిని విడిచి పెట్టేయడం కాదు. వారికి కనీస వసతులతో గౌరవప్రదంగా జీవించే పరిస్థితులను కల్పించడం జీవించే హక్కు పరమార్థం. అందులో మంచి ఆరోగ్యం కలిగివుండడం అంతర్భాగం. మన పొరుగునే వున్న చైనా జిడిపి మన దేశ జిడిపి కన్నా ఐదారు రెట్లు ఎక్కువ. ఆ దేశంలో ప్రజారోగ్యం కోసం తమ జిడిపిలో ఆరు శాతం ఖర్చు చేస్తున్నారు. మన దేశంలో మాత్రం ఒక్క శాతమే! పైగా వైద్య రంగాన్ని గత ముఫ్పై ఏళ్లలో కార్పొరేట్లకు అప్పజెప్పారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పర్యవసానాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దేశంలో కరోనా వ్యాప్తిని అదుపులోకి తేగలిగిన చేవ ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రమే ఎందుకుంది? అక్కడ వామపక్ష సంఘటన ప్రభుత్వం తమ బడ్జెట్‌లో దాదాపు 20 శాతాన్ని వైద్య రంగానికి కేటాయించింది. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసింది. నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది.
బాబా సాహెబ్‌ నిర్దేశించిన విధంగా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వమే ప్రధానంగా వహిస్తూ గత కాలం నుంచీ ప్రజారోగ్య వ్యవస్థను బలీయంగా, అధునాతనంగా తీర్చిదిద్దుకుని వుంటే నేడు దయనీయ, నిస్సహాయ స్థితిలో ఉండేవారమా? పుక్కిటి పురాణాలనే గొప్పగా శ్లాఘిస్తూ, గో మూత్రమే సర్వరోగ నివారిణి అనుకుంటూ దేశాన్ని సైతం అదే మూఢత్వం వైపు నడిపించజూస్తున్న ఈ మనువాదులు ఎక్కడీ గొప్ప దార్శనికతతో ప్రజలకు ఆరోగ్యం హక్కుగా కల్పించిన బాబా సాహెబ్‌ ఎక్కడీ
ప్రధాని మోడీ ప్రకటించిన లాక్‌డౌన్‌ ప్రస్తుతానికి కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగి వుండొచ్చేమో గాని, అది దేశవ్యాప్తంగా కోట్లాది వలస కార్మికుల నెత్తి మీద పిడుగుపాటే అయ్యింది. స్వస్థలాలను విడిచి పొట్ట పోసుకోవడం కోసం ఎక్కడెక్కడికో పయనమై పోయిన ఈ శ్రమజీవుల బతుకులు లాక్‌డౌన్‌తో ఛిద్రమయ్యాయి. కరోనా సోకుతుందో లేదో తెలియదు. సోకితే బతికే అవకాశాలు ఉన్నాయి. కాని లాక్‌డౌన్‌ దెబ్బకి కోట్లాది మంది బతుకులు అతలాకుతలమై పోతున్నాయి. రెక్కల కష్టాన్ని అమ్ముకుని ఉన్నంతలో తన బతుకేదో తాను బతుకుతున్న వలస కార్మికుడు ఈ రోజు నడిరోడ్డు మీదో, క్వారంటైన్‌ కేంద్రం లోనో, కాకుంటే స్వగ్రామంలో సైతం పరాయివాడి లాగా తిండి కోసం 'దేహీ' అని చేతులు చాచాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఈ రోజు వారికి ఆ స్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ముందస్తు సన్నాహాలేమీ చేయకుండా, ఈ కోట్లాది కార్మికులు ఏమైపోతారో కనీసం ఆలోచించకుండా పిడుగుపాటులా లాక్‌డౌన్‌ ప్రకటించి తామేదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చరుచుకుంటోంది! పైగా ఇంత కరోనా కల్లోలంలో కూడా లేబర్‌ కోడ్‌లను, ఆర్డినెన్సులను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రేప్పొద్దున లాక్‌డౌన్‌ను సడలించాక కార్మికులు పనుల్లోకి తిరిగి వచ్చే నాటికి వారి మెడలకు పలుపు తాడుల్లాగా లేబర్‌ కోడ్‌లు సిద్ధంగా ఉంటాయి. 12 గంటల పని దినాన్ని ప్రధాని కార్మికులకు బహుశా మేడే కానుకగా ఇవ్వనున్నారేమో!
మరి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చివేయనున్న 40కి పైగా కార్మిక సంక్షేమ చట్టాలకు ఆద్యుడెవరు? 'దళిత బహుజనుల వ్యథార్థి వేరు, కార్మికుల కష్టనష్టాలు వేరు' అని బాబాసాహెబ్‌ అనుకోలేదు. దోపిడీకి, అణచివేతకు గురయ్యే ప్రతి వ్యక్తి తరపున ఆయన పరితపించాడు. స్పందించాడు. అదుగో అటువంటి స్పందన నుండే దాదాపు అన్ని కార్మిక సంక్షేమ చట్టాలూ రూపుదిద్దుకున్నాయి. పోరాడే కార్మికుల చేతుల్లో ఆయుధాలుగా ఉపయోగ పడుతున్నాయి. ఆ ఆయుధాలను కార్మికుల నుండి లాక్కోవాలనేదే కార్పొరేట్ల కుట్ర. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి డిమాండూ అదే. వారి చేతుల్లో కీలు బొమ్మ లాగానో, వారికి అనుంగు భృత్యుల మాదిరిగానో వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం బాబాసాహెబ్‌ ఆలోచనలకి ప్రతిరూపంగా కార్మికులకు అండగా నిలుస్తున్న కార్మిక సంక్షేమ చట్టాలన్నింటినీ రద్దు చేసే కుట్రలో నిండా మునిగి వుంది. ఈ రోజు ఇటువంటి కుట్రలతో బాబా సాహెబ్‌ ఆశయాలకు తూట్లు పొడిచే వారికి అంబేద్కర్‌ పేరెత్తే అర్హత ఉందా?
రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారం కల్పించే ఫెడరలిజం మన రాజ్యాంగపు మౌలిక స్వభావం. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ఫెడరలిస్టు సూత్రాల ప్రాతిపదిక తప్పనిసరి అని అంబేద్కర్‌ ప్రకటించారు. ఈ రోజు కరోనా మీద పోరులో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర. కాని ఇప్పుడు కూడా రాష్ట్రాలకు ఎటువంటి తోడ్పాటునూ ఇవ్వకుండా కేంద్రం ముష్టి వేసినట్టు విదిలిస్తోంది. జిఎస్టీ వంటి పద్ధతులతో రాష్ట్రాల హక్కులను లాక్కుంది. చివరికి విపత్తు సహాయనిధి విషయంలో కూడా అదే వైఖరి. రాష్ట్ర ముఖ్యమంత్రుల నిధికి ఇచ్చే విరాళాలు సిఎస్‌ఆర్‌ నిధులుగా పరిగణించబోమని కేంద్రం ప్రకటించింది. అంటే ఏ కంపెనీ అయినా ఇక సి.ఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళమిస్తుందా? ఇలా కరోనా విపత్తు కాలంలోనూ రాష్ట్రాల హక్కులపై, ఫెడరలిజంపై దాడి చేస్తున్న పాలకులకు, అంబేద్కర్‌కు నక్కకు నాక లోకానికీ ఉన్నంత తేడా వుంది.
అయితే మరి బాబాసాహెబ్‌ ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చేదెవరు? ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మీద పోరులో ముందున్న పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాలు, వైద్య బృందాలు, వారి కుటుంబాలు కుల, మత విభేదాలతో నిమిత్తం లేకుండా పాటు పడుతున్నారు. లాక్‌డౌన్‌ పరిమితుల్లో సైతం అన్నార్తులను ఆదుకోవడానికి కమ్యూనిస్టులు, ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని అభినందిస్తూ ఎందరో వారికి విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను గౌరవించే వారు అత్యధికులు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా వలస కార్మికులు కూడా కరోనాపై జరిగే యుద్ధంలో భాగస్వాములు అయ్యారు. మూఢత్వానికి, కుల దురహంకారానికి, వివక్షకు తావులేని రీతిలో వెల్లివిరుస్తున్న ఈ సమైక్యతలో అంబేద్కర్‌ ఆశయాలు వికసిస్తున్నాయి. ఈ చైతన్యం నుండి రూపొందే ప్రజాస్వామిక సమైక్యతా స్ఫూర్తి రానున్న కాలంలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలను సాకారం చేస్తుంది.

- ఎం.వి.ఎస్‌ శర్మ