అమెరికా అంటే భయమా? సైద్ధాంతిక ఐక్యతా?

నిన్నటికి నిన్న...హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు పంపకపోతే ట్రంపు ప్రతీకారం తీర్చుకుంటా మనగానే...మోడీ ప్రభుత్వం భయపడిపోయింది. మారు మాట్లాడకుండా అమెరికాకు మందులు పంపించింది. ఈ రోజు...చైనా నుండి తమిళనాడుకు రావాల్సిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను బలవంతంగా మళ్లించేసుకున్నా నోరు మెదపలేదు. గతంలో కూడా ఇరాన్‌ నుండి ఆయిల్‌ను కొనవద్దని ఆజ్ఞ జారీ చేయగానే కొనడం ఆపివేసింది. సర్వసత్తాక సార్వభౌమాధికారం గల భారత దేశాన్ని మోడీ ప్రభుత్వం అప్రతిష్ట పాల్జేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించడం తప్ప మోడీ ప్రభుత్వం కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్‌ కిట్లను ఏర్పాటు చేయలేదు. వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ), రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు చేయలేదు. వలస కార్మికుల బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వాల పైనే పడేసింది. మొత్తం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టి...చప్పట్లు కొట్టడం, లైట్లు ఆర్పడం, దీపాలు వెలిగించడం వంటి ఖర్చు లేని ప్రచార కార్యక్రమాలు మాత్రమే కేంద్రం బాధ్యతగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తెప్పించుకునే ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అమెరికా దొంగతనంగా ఎత్తుకుపోతుంటే అడ్డుకోవడంగానీ, కనీసం తప్పని చెప్పడం గానీ చేయకుండా అమెరికాకు లొంగుబాటు ప్రదర్శిస్తున్నది.

భారత ప్రభుత్వం 'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' మందును ఎగుమతి చేయరాదని 2020 మార్చి 25న నిషేధం విధించింది. ఏప్రిల్‌ 4వ తేదీన మోడీ ప్రభుత్వం అదే నిర్ణయాన్ని మరోసారి చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్‌ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందును పంపించమని అడిగారు. అక్కడితో ఆగకుండా పంపించక పోయినట్లయితే ప్రతీకార చర్యలు తీసుకునే వాడినని బహిరంగంగానే ప్రకటించారు.వెంటనే భారత ప్రభుత్వం అమెరికాకు ఔషధాలను పంపించేందుకు వీలుగా నిషేధం ఎత్తివేసింది. ట్రంపు బెదిరింపులకు లొంగి నిషేధం ఎత్తివేశారా? లేక మన దేశ అవసరాలకు మించి ఉన్నందున పంపించారా? మన అవసరాలకు సరిపడా ఔషధం వుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటన కూడా చేశారు. మనకు సరిపడా మందు లేదని జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని కూడా ఆ ప్రకటన సారాంశం. మన అవసరాలకు మించి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు వుంటే మార్చి 25న ఎందుకు ఎగుమతులపై నిషేధం విధించారు? ఏప్రిల్‌ 4న కూడా ప్రభుత్వం అదే వైఖరి ఎందుకు తీసుకుంది? ఈ ప్రశ్నకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

మందులు మన అవసరానికి మించి ఉండి ఉండవచ్చు. లేదా మానవత్వంతో కూడా పంపవచ్చు. లేదా అమెరికాతో మన దేశానికి ఉన్న వ్యాపార సంబంధాలు, అవసరాల రీత్యా మందు పంపించి ఉండవచ్చు. కానీ, మందు పంపించకపోతే ప్రతీకార చర్యలు తీసుకునే వాడినని ట్రంపు చేసిన బెదిరింపు వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? కనీసం నిరసన కూడా ఎందుకు తెలియజేయలేదు? ఇది బెదిరింపులకు లొంగుబాటు కాదా? మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి.సార్వభౌమాధికారం గల ఏ ప్రభుత్వమైనా ఇంత అవమానకరంగా వ్యవహరిస్తుందా? 130 కోట్ల జనాభా గల స్వతంత్ర భారతదేశం ఇంతలా అమెరికాకు లొంగుబాటు ప్రదర్శించడం దేశ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం కాదా? నిత్యం దేశభక్తి గురించి, భారతదేశ గత ఔన్నత్యం గురించి గొప్పగా చెప్పే మోడీ ప్రభుత్వం ఇంతలా సాగిల పడిపోవడాన్ని ఏమనుకోవాలి? స్వతంత్ర పోరాట కాలంలోనే గాక నేటికీ ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగానికి సామ్రాజ్యవాద లొంగుబాటు కొనసాగుతున్నదని అనుకోవచ్చా?

మోడీ ప్రభుత్వం గతంలో కూడా ట్రంపు ప్రభుత్వపు ఆదేశాలకు తలొగ్గి భారతదేశ ప్రయోజనా లకు తిలోదకాలు ఇచ్చింది. మన అలీనోద్యమ భాగస్వామి, మిత్ర దేశం, మన దేశ అవసరాలకు అనుకూలంగా చమురు సరఫరా చేస్తున్న ఇరాన్‌ నుండి ఆయిల్‌ దిగుమతి చేసుకోవద్దని అమెరికా ఆంక్ష విధించగానే తలొగ్గింది. ఇరాన్‌ నుండి ఆయిల్‌ దిగుమతులను తగ్గించేసింది. సార్వభౌమాధికారం గల దేశాలను శాసించే అధికారం నీకెక్కడిదని ప్రశ్నించ లేకపోయింది. అదే సందర్భంలో చైనా, రష్యా రెండు దేశాలు అమెరికా ఆంక్షలను ధిక్కరించి తమ దేశ అవసరాల రీత్యా ఇరాన్‌తో ఒప్పందాలు కొనసాగిం చాయి. ఇలా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. 

బిజెపి నిత్యం చేసే దేశభక్తి వల్లింపులు ఉత్తుత్తి వేనా? మాటల్లో దేశభక్తి-ఆచరణలో సామ్రాజ్య వాదానికి లొంగుబాటేనా? అతి చిన్న దేశం, ఎటువంటి వనరులు లేని దేశం క్యూబా శక్తివంతమైన అమెరికాను నువ్వెంత అంటే నువ్వెంత? నీకు నేనెంత దూరమో- నాకూ నువ్వంత దూరమని హెచ్చరించి మొనగాడుగా నిలుస్తుండగా 130 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో పెద్ద దేశంగా వున్న భారత ప్రభుత్వం ఇంత హీనంగా వ్యవహరించడాన్ని ఆత్మాభిమానం గల భారతీయులు ఎవరైనా అంగీకరిస్తారా? పైగా ఔషధాలు పంపిన తరువాత మోడీ ఘనకార్యాలు చేస్తున్నట్లు ట్రంపు పొగడడం, ఇందుమూలంగా అమెరికాతో సంబంధాలు గొప్పగా బలపడినట్లు మోడీ చెప్పడం చక్కటి వినోద కార్యక్రమంగా మారింది.

ట్రంపు అహంకారాన్ని, బెదిరింపు ధోరణిని భారత ప్రభుత్వ అవసరాల రీత్యా ఖండించ లేకపోవచ్చు. బిజెపి ఒక రాజకీయ పార్టీగా కూడా స్పందించలేదు. మన్ను తిన్న పాములా మిన్నకుండి పోయింది. అదే సందర్భంలో చైనా విషయంలో ట్రంపుకు భిన్నంగా బిజెపి వ్యవహరించడం లేదు. ట్రంపు చేసే ప్రతి ఆరోపణతో బిజెపి ఏకీభవిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తోంది.

'మేడిన్‌ చైనావన్నీ అంటువ్యాధులు తెచ్చేవైతే...చైనా మాస్కులు వాడొద్దు. చైనా పిపిఇ లు వాడొద్దు. చైనాలో తయారైన వెంటిలేటర్లు వాడొద్దు. ఇలాగైతే వైరస్‌ తగలకుండా ఉంటార'ని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి ఒకరు ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందనగా భారత ప్రభుత్వ భద్రతా సలహా మండలి సభ్యుడు తిలక్‌ దేశ్‌కర్‌ 'ది ట్రిబ్యూన్‌'కు ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని ఒక తెలుగు దినపత్రిక ప్రచురించింది. రుజువు లేకపోయినా, చైనాయే వైరస్‌ను సృష్టించిందని బాధ్యతా రహితంగా ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. 

వైరస్‌ బయటపడిన దగ్గర నుండి చైనా కావాలనే వైరస్‌ను సృష్టించిందని, ప్రపంచానికంతా అంటించేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదు. ట్రంప్‌ దానికి 'చైనా వైరస్‌' అని పేరు కూడా పెట్టారు. భారతదేశంలో బిజెపి కూడా అదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. 

అమెరికా బెదిరింపును ఖండించని బిజెపి, చైనాపై దుష్ప్రచారంలో ట్రంపుతో కలిసింది. బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో తన లాంటి మిత్రుల తోనే జత కలుస్తోంది. అందువలనే ట్రంపు అహంకారాన్ని, అవమానాల్ని కూడా సహిస్తోంది. ఇది భారతదేశ స్వతంత్రతకు తిలోదకాలు ఇవ్వడమే. నాడు బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తొత్తులుగా... నేడు అమెరికన్‌ సామ్రాజ్యవాద భక్తులుగా వ్యవహరించే...వీళ్ళ దేశభక్తి ముసుగు వెనక వున్న సామ్రాజ్యవాద అనురక్తిని దేశ ప్రజలు ఎంత తొందరగా తెలుసుకుంటే దేశానికి అంత తొందరగా విముక్తి. 

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">- యం.కృష్ణమూర్తి