ప్రమాదకర బిజెపి విధానాలు

కరోనా సందర్భాన్ని సైతం బిజెపి దూకుడుగా వినియోగించుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తోంది. మొన్న జిఎస్‌టి, అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్ట సవరణలు అన్నీ బుల్డోజు చేసేందుకు పూనుకున్నది. కార్మిక హక్కులను రద్దు చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. అసలే కరోనా మహమ్మారి వ్యాప్తిలో ప్రభుత్వ వైద్య సహాయం మృగ్యమైంది. బాధ్యతారహితంగా లాక్‌డౌన్‌ అమలు జరిపి కోటాను కోట్ల అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని దెబ్బగొట్టింది. ఈ పరిణామాలు చిన్న చిన్న వ్యాపారాల్ని, చిన్న ఉత్పత్తిదారుల్ని, వృత్తుల్ని సంక్షోభం లోకి నెట్టింది. ఈ విపత్కర పరిస్థితుల్లో 6 మాసాల పాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500, ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం, నిరుద్యోగ భృతి లాంటి ప్రజల డిమాండ్లను పెడచెవిన పెట్టిన బిజెపి రైతాంగాన్ని సంక్షోభం లోకి నెట్టే చర్యలకు పూనుకున్నది. కార్పొరేట్లకు రాయితీలు, ప్రజలకు భారాలు నేటి కేంద్ర ప్రభుత్వ విధానాలుగా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి గడిచిన సంవత్సరం రూ. 1.45 లక్షల కోట్లు ప్రజల మీద భారాలు మోపితే... కార్పొ రట్లకు పన్నుల రాయితీ రూపంలో సుమారు రూ. 20 లక్షల కోట్లు రాయితీలిచ్చింది. దేశంలో రూ.62 లక్షల కోట్ల మేరకు వ్యవసాయోత్పత్తుల వ్యాపారం జరుగుతుంది. ఇంత కీలకమైన వ్యవసా యాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే మోడీ ప్రభుత్వం తాజాగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది.
పార్లమెంటునే తొత్తడం చేసిన బిజెపి
రైతాంగ వ్యతిరేక చట్ట సవరణలు రైతాంగంలో ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి. పూర్తి మెజారిటీ ఉన్న లోక్‌సభ ప్రతిపక్షాల గోడును పెడచెవిన పెట్టింది. ఎన్‌డిఏ భాగస్వాముల్లో వస్తున్న అభ్యంతరాలను లెక్క చేయలేదు. రాజ్యసభలో 12 పార్టీలు తమ వ్యతిరేకతను ఎలిగెత్తి చాటాయి. సంపూర్ణ మెజారిటీ లేని బిజెపి సభా సాంప్రదాయాల్ని మంటగలిపింది. సెలక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనను ఖాతరు చేయలేదు. సభలో ఎవరు ఎటున్నారో తెలియడానికి ప్రతిపక్షాలు డివిజన్‌ కోరినా అనుమతించక మూజువాణి ఓటుతో పార్లమెంటు సాంప్రదాయాలనే తొత్తడం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభ్యులు ఆయా విధానాలపై తమ ఆక్షేపణను తెలపడానికి ఓటింగు పద్ధతి చట్టరీత్యా సభ్యుల హక్కుగా ఉన్నది. రాజ్యసభలో సెప్టెంబర్‌ 20న ఈ హక్కును నిరాకరించి మూజువాణి ఓటుతో రైతాంగ వ్యతిరేక బిల్లులు ఆమోదించినట్లు ప్రకటించింది. సవరణలు అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. కానీ ఓటింగును కోరినప్పుడు నిరాకరించడానికి వీలు లేదు. కానీ, బిజెపి బల ప్రయోగం చేసింది. మరిన్ని ప్రజా వ్యతిరేక చట్టాలకు సవరణలు చేసేందుకు సిద్ధమవుతున్న దాఖలాలు ఇందుమూలంగా వ్యక్తమవుతున్నాయి.

రైతు ప్రయోజనాలను పణంగా పెట్టిన వైసిపి-టిడిపి
సెప్టెంబర్‌ 20వ తేదీ రాజ్యసభలో రైతు ప్రయోజనాలను దెబ్బ తీసే మూడు బిల్లులు పాసయ్యాయి. రాజ్యసభలో తగినంత బలం లేని బిజెపి గట్టెక్కడానికి వైసిపి తన బలాన్ని తోడుచేసింది. రైతాంగ ప్రయోజనాలను దెబ్బ తీసింది. అసలే సరైన ధరలు లేక ఆత్మహత్యల పాలవుతున్న రైతాంగానికి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. బిల్లులు చట్టాలయ్యేందుకు తోడ్పడింది. ఇలాంటి విధానాలతో రైతు భరోసా దెబ్బ తింటుందన్న రైతాంగ స్పందనను విస్మరించింది. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసమని కేంద్ర బిజెపి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని సైతం ఎక్కుపెట్టింది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు అంత ప్రధానం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని 6 నెలల ముందు తన ఎంపీలు చేత రాజీనామా చేయించింది. తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించవచ్చని హోరెత్తించింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు ముఖ్యమని, అందుకోసం ఎంత దూరమైనా పోరాడతామని జగన్‌ మెహన్‌ రెడ్డి ప్రకటించారు. తనకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే ఆ బలంతో ప్రత్యేకహోదా విభజన హామీలు సాధిస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిజెపి కి 302 స్థానాలు రావడంతో విభజన హామీలు, ప్రత్యేకహోదా ఇప్పుడు అవకాశం లేకుండా పోయిందని కుండకు చిల్లి వేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని గాలికొదిలేశారు. ఇప్పుడేమో కొన్ని దశాబ్దాలుగా రైతులకు రక్షణగా ఉన్న మద్దతు ధరల విధానం, ఆహార భద్రతకి ఎంతో కొంత ఉపశమనం ఇచ్చే ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ మార్కెట్‌ను కార్పొరేట్ల దోపిడీకి నిలయం కాకుండా ఉంటూ వచ్చిన రక్షణలను తన్నుకెళ్లడానికి కార్పొరేట్లకు అవకాశం కల్గించే చర్యలకు వైసిపి తోడ్పడడం దారుణం.
వైఎస్సార్‌సిపి తీరు
2019 ఎన్నికలకు ముందు కేంద్ర బిజెపి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించిన వైసిపి ఎన్నికల అనంతరం అన్ని ముఖ్యమైన సందర్భాల్లో బిజెపి పంచన చేరింది. విద్యుత్‌ చట్టానికి సవరణ తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను హరించడమేగాక రైతుల ఉచిత విద్యుత్‌కు గండికొట్టేందుకు సైతం బిజెపికి మద్దతు తెలిపింది. అంతేగాక దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రం లోనే విద్యుత్‌ రంగంలో మీటర్లు పెట్టే సంస్కరణలకు ఒడిగట్టింది. డిస్కాములను ప్రయివేటు రంగానికి అప్పగించే నీతిబాహ్యమైన చర్యలే అయినా బలపరుస్తోంది.
ఇప్పుడు ఎకాఎకిన రైతు ప్రయోజనాల్ని దెబ్బగొట్టే మూడు ఆర్డినెన్సులకు మద్దతు తెలిపి రాజ్యసభలో తన రాజభక్తిని ప్రకటించుకున్నది. రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని, రైతాంగానికి స్వతంత్రతను కల్పిస్తున్నామని ప్రకటించిన బిజెపి...చట్టంలో రైతుల మద్దతు ధరలకు గ్యారెంటీ ఇచ్చే క్లాజును పెట్టలేదు. పెట్టకపోయినా వైసిపి మద్దతు తెలిపింది. ఉత్పత్తి ఖర్చులో 50 శాతం లాభం వచ్చేటట్లుగా చర్యలు చేపడతామన్న బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టో పేలపిండిలా గాలికి కొట్టుకుపోతున్నా అభ్యంతరం చెప్పలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ల ఒత్తిడికి తట్టుకోవాలన్నట్లయితే, గిట్టుబాటు ధరల విధానం అవసరమని, ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ అనివార్యమని అమలు లోకి వచ్చాయి. ఈ విధానాలను ఒక్క చట్టంతో రద్దు చేసింది. ఎన్నో ఏళ్లుగా అమలైన విధానాల్ని మందబలాన్ని వినియోగించి లాక్‌డౌన్‌ కాలంలో బిజెపి దెబ్బ దీసింది. తెలుగుదేశం పెట్టిన కార్పొరేట్‌ వ్యవసాయాన్ని రాష్ట్రంలో రైతులు ప్రతిఘటించారు. ఇప్పుడు కేంద్ర చట్టంతో రైతులతో కార్పొరేట్లు ఒప్పందాలు చేసుకునే అసమాన క్రీడకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. ఇలాంటి రైతాంగ వ్యతిరేక విధానాలను వైఎస్సార్‌సిపి బలపరిచి 'రైతు భరోసా' అనే తన ఎన్నికల వాగ్దానానికి నీళ్లు వదిలింది.
తెలుగుదేశం నైజం ఇదీ
నిరంతరం అవినీతి మీద పోరాడతానని, అభివృద్ధే తమ విధానమని ప్రకటించే తెలుగుదేశం సెప్టెంబర్‌ 20న వైఎస్సార్‌సిపి తో కలిసి బిజెపికి మద్దతు ప్రకటించింది. రైతాంగ ఆదాయాలను దెబ్బ తీసే చట్టాలను బలపర్చింది. రైతాంగ వ్యతిరేక బిల్లుల్ని బలపర్చి తెలుగుదేశం తమ నైజాన్ని బయట పెట్టుకున్నది. రాష్ట్రంలో ప్రతి అంశంలో వైఎస్సార్‌సిపి ని ఎదిరిస్తున్నట్లు పోజులు పెట్టే తెలుగుదేశం వైఎస్సార్‌సిపి తో పాటు విద్యుత్‌ చట్ట సవరణను బలపర్చింది. ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్టాలకు మద్దతు పలికింది. రైతుల ఉసురు తీసే చట్టాలను ఎదిరించకుండా 'జనసేన' దిగజారి బిజెపి పంచన చేరింది. ఒకవైపు బిజెపి రైతాంగ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంటే, మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షం అని చెప్పుకునే తెలుగుదేశం, అలాగే అధికారంలో ఉన్న వైఎస్సార్‌సిపి సెప్టెంబర్‌ 20న రాజ్యసభలో రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసాయి. రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ, సన్నకారు, చిన్నకారు రైతులకు కార్పొరేట్ల నుండి రక్షణ దెబ్బ తీసే చర్యలకు ఈ చట్టాలు ద్వారా వీరందరూ మూకుమ్మడిగా వ్యవహరించడమే ఈనాటి ప్రత్యేకత. రైతాంగ వ్యతిరేక చట్టాలను వామపక్షాలు పార్లమెంటులో నికరంగా ఎదిరించాయి. 12 రాజకీయ పార్టీలు వ్యతిరేకతను చాటాయి. ఎన్‌డిఏ భాగస్వామి పక్షాలు అకాలీదళ్‌, అన్నా డియంకె ...బిజెపితో విడగొట్టుకున్నాయి.
రైతాంగ వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించాలన్న 155 రైతు సంఘాల నినాదం ప్రజలందరి నినాదంగా మారాలి. రైతు నిరసన లకు చిన్న చిన్న వ్యాపారస్తులు, వృత్తిదార్లు సంపూర్ణ మద్దతు తెలపాలి. సెప్టెంబర్‌ 25న నిర్వహించే రైతాంగ నిరసన కార్యక్రమానికి సిపిఐ(యం), వామపక్షాలు మద్దతును తోడుచేస్తున్నాయి. విరివిగా పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
వామపక్షాలు 155 సంఘాలు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాల్సిందిగా కోరాయి. మన రాష్ట్రంలో దీనిపై భవిష్యత్‌ కార్యాచరణ కోసం సెప్టెంబర్‌ 26న సమావేశం అవుతున్నాయి. రైతాంగ వ్యతిరేక విధానాల్ని నికరంగా ప్రతిఘటించడమే భవిష్యత్‌కు మార్గం.
(వ్యాసకర్త సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి)