కార్మికవర్గంపై మోడీ దాడిని ప్రతిఘటిద్దాం

దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 23న నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఇందులో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌ తదితర సంఘాలు ముఖ్య పాత్ర నిర్వహిస్తు న్నాయి. కరోనాను నివారించడానికి దేశవ్యాప్తంగా 4 గంటల వ్యవధిలో మిలటరీ కర్ఫ్యూ లాగా లాక్‌డౌన్‌ విధించి నేటికి 6 మాసాలైంది. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగంగా సంస్కరణలను అమలు చేయడానికి పూనుకున్నది. లాక్‌డౌన్‌ 5.0 సందర్భంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి అందులో ప్రజలకు నేరుగా అందించింది రూ. 2 లక్షల కోట్లు మాత్రమే. భారత దేశం లోని భారీ పరిశ్రమల న్నింటిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నది. రైల్వే రంగంలో 151 పాసింజర్‌ రైళ్లను ప్రైవేట్‌కు అప్పగించింది. ప్రపంచం లోనే అతి చౌకగా నడుస్తున్న భారత్‌ రైళ్లలో ప్రయాణ, సరుకుల ఛార్జీలు అనేక రెట్లు పెరుగుతాయి. రక్షణ రంగంలోను, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. ఈ రంగంలో లాభాలు విదేశాలకు తరలిపోతాయి. ఇది దేశ ప్రయోజనాలకు పూర్తి విఘాతం కల్గిస్తుంది. ఇన్సూరెన్స్‌ ప్రైవేటీకరణ వల్ల కోట్ల మంది పాలసీ హోల్డర్లు తీవ్రంగా నష్టపోతారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు రూ. లక్ష కోట్లు కార్పొరేట్‌ కంపెనీలకు అప్పులు ఇస్తుంది. విద్యుత్‌ సంస్కరణల ఫలితంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వుండదు. ఎస్సీ, ఎస్టీ తరగతులు సబ్సిడీని కోల్పోతాయి. మోడీ ఒకవైపు ఆత్మ నిర్భర భారత్‌ పేర 'స్వయం సమృద్ధి' నినాదం ఇస్తూ మరో వైపున ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. భారత దేశ సంపదను విదేశీ కంపెనీలకు అప్పగించడం దేశ ద్రోహం. తను చెప్పే నినాదాలకు పూర్తి భిన్నంగా కార్పొరేట్లకు అనుకూలంగా బిజెపి వ్యవహరిస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా కార్పొరేట్‌ కంపెనీలకు లాభాల పంటలు పండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీరికి గత ఆరు సంవత్సరాల్లో పన్నుల తగ్గింపు, బ్యాంక్‌ రుణాలు, వడ్డీ మాఫీలు వగైరాల ద్వారా సుమారు రూ. 18 లక్షల కోట్ల లాభాలు కల్పించింది. తద్వారా తమది కార్పొరేట్ల ప్రభుత్వమని రుజువు చేసుకున్నది.
కార్మికవర్గానికి నేడున్న హక్కులను పూర్తిగా హరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. 44 కేంద్ర కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చింది. జీతాల కోడ్‌ను గత పార్లమెంట్‌ సమావేశాలలో ఆమోదించింది. మిగిలిన మూడు కోడ్‌లను ప్రతిపక్షంలేని సమయంలో ఆమోదించింది. స్వాతంత్య్రానికి ముందు నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులే కార్మిక చట్టాలు. ఈ చట్టాలను మార్చడం అంటే కార్మికులను బానిసలుగా మార్చడమే. బిజెపి, కాంగ్రెస్‌ పాలిత కొన్ని రాష్ట్రాల్లో మూడు సంవత్సరాల వరకు ఎటువంటి చట్టాలు అమలు చేయబోం అని ఆర్డినెన్సులను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 60 సంవత్సరాలకు బదులుగా 55 సంవత్సరాలకే సర్వీసును కుదించారు. 5 సంవత్సరాల ముందే కంపల్‌సరి రిటైర్మెంట్‌ ఇస్తారు. ఎం.పి లకు, ఎమ్మెల్యేలకు కంపల్‌సరి రిటైర్మెంట్‌ లేదా? కార్మికుల సర్వీసు 60 సంవత్సరాలు అన్నది చట్టపరంగా సాధించుకున్న హక్కు. దేశ ప్రయోజనాలకు వీరి సర్వీసు పూర్తిగా ఉపయోగించాలి. కేవలం ఉద్యోగాలను తొలగించడానికే కేంద్రం ఇటువంటి దాడికి పూనుకోవడం దుర్మార్గం. గత ఆరు మాసాల కరువు భత్యం చెల్లించకుండా కేంద్రం వాయిదా వేసింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీని 8.5 శాతానికి తగ్గించింది. ఇఎస్‌ఐ ద్వారా అందుతున్న వైద్య సదుపాయం బాగా తగ్గింది.
మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకొని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగి స్తున్నది. ఈ కాలంలో అత్యధిక మంది కార్మికులు పూర్తిగా పనులు కోల్పోయారు. ఆదాయం లేదు. 10 కోట్ల మంది వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని తట్టబుట్టతో వందల, వేల కి.మీ నడిచి తమ సొంత ప్రాంతాలకు చేరుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించలేదు. వందలాది మంది దారి లోనే మరణించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ నినాదం మోస పూరితమైనది. మోడీ విధానాల ఫలితంగా ఉన్న పనులు పోయాయి. కార్మికులు అత్యధిక మంది అప్పు లతో బతుకుతు న్నారు. వీరికి ఆర్థి కంగా సహాయ పడా లని మే నెల నుంచి కార్మిక వర్గం జరుపుతున్న పోరాటా లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడ చెవిన పెట్టాయి. కార్మి కులకు నెలకు రూ.7500 తో పాటు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరా చేయాలనే డిమాండ్‌ను కూడా పట్టించుకోలేదు. కరోనా వ్యాధికి గురైన వారి అవస్థలు వర్ణనాతీతం. బిల్డింగ్‌ కార్మికుల సొంత నిధులను (బిల్డింగ్‌ సెస్‌ ఫండ్‌) నెలకు రూ.10 వేల చొప్పున ప్రతి బిల్డింగ్‌ కార్మికునికి ఇవ్వాలనే డిమాండ్‌ను పట్టించుకోలేదు. గ్రామీణ ఉపాధి హామీ పనులను సంవత్సరానికి 200 రోజులు కల్పించాలని, పట్టణాల్లో ఉపాధి పనులు కల్పించాలని ట్రేడ్‌ యూనియన్లు పోట్లాడుతు న్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత త్రైమాసికంలో జిడిపి 23.9 శాతం పడిపోయింది. రానున్న కాలంలో ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా వుంటుంది.
కేంద్ర ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తు న్న సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. పైగా పార్లమెంట్‌లో బిజెపి చేస్తున్న ప్రతి చట్టానికి వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి లు పోటీ పడి బలపరుస్తున్నాయి. కార్మిక, కర్షక సంఘాలు యావత్తు ప్రజానీకాన్ని కలుపుకొని ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్వహించడం కర్తవ్యంగా భావించాలి. మోడీ విధానాలను ప్రతిఘటించడం ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకోగలం.
(వ్యాసకర్త సిఐటియు ఎ.పి రాష్ట్ర అధ్యక్షులు)