గెలుపొందినా ఎన్‌డిఎకు ఎదురుదెబ్బలు : పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం

ఇటీవల ముగిసిన బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి కారణంగా గత ఎన్నికల్లో ఏకంగా 71సీట్లు సాధించిన జెడి(యు)కి ఈసారి కేవలం 43సీట్లే లభించాయని సంపాదకీయం వ్యాఖ్యానించింది. మహాగత్‌బంధన్‌ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2017లో నితీష్‌ కుమార్‌ బిజెపికి ఫిరాయించడాన్ని ప్రజలు అంత సులభంగా తీసుకోలేదు. అవకాశవాదాన్ని ఇంత పచ్చిగా ప్రదర్శించినందుకు నితీష్‌ కుమార్‌ చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చిందని సంపాదకీయం పేర్కొంది. తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని మహాగత్‌బంధన్‌ సాగించిన ఎన్నికల ప్రచారానికి యువత నుండి పెద్దగా ప్రతిస్పందన వచ్చిందని, ప్రధానంగా ఉద్యోగాలు, ఆర్థిక న్యాయంపైనే తేజస్వి యాదవ్‌ దృష్టి పెట్టారని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం పేర్కొంది. వామపక్షాలు ఎన్నికల ప్రచారంలో పాల్గనడంతో ఉద్యోగాలు, లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక దుస్థితి, స్వస్థలాలకు వలస వెళ్ళిపోవడం, రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించేలా చేయడం జరిగిందని సంపాదకీయం వివరించింది. సిపిఐ(ఎంఎల్‌) 16, సిపిఎం రెండు, సిపిఐ రెండు సీట్లు చొప్పున మొత్తంగా వామపక్షాలు 16సీట్లను గెలుచుకుని మంచి పనితీరు కనపరచడం చూస్తుంటే తమ జీవితాలకు అవసరమైన అంశాలు, సమస్యలకే ఈ ఎన్నికల్లో ప్రజలు బాగా ప్రతిస్పందించారని తెలుస్తోందని సంపాదకీయం వ్యాఖ్యానించింది. సాధారణంగానే బిజెపి తన హిందూత్వ ఎజెండాను, 370వ అధికరణ, రామ మందిరం, చొరబాట్లు వంటి అంశాలను ప్రచారంలో ఉపయోగించడానికి చూసింది. జై శ్రీరామ్‌ అన్న నినాదాన్ని వ్యతిరేకించే వారున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు కూడా. బిజెపి తన పరిస్థితి మెరుగుపరుచుకుని 73సీట్లు గెలుచుకోవడం చూస్తుంటే, కుల, మతోన్మాద రాజకీయాలు చాలా పటిష్టమైన ప్రభావాన్ని కనపరుస్తాయనే సందేశం వెల్లడవుతోందని పేర్కొంది. భవిష్యత్తులో సరైన గుణపాఠాలు నేర్చుకోవాలంటే ఈ ఎన్నికల ఫలితాలను కూలంకషంగా విశ్లేషించాల్సిన అవసరం వుందని అర్ధమవుతోందని తెలిపింది. హిందూత్వ, నియంతృత్వ ముప్పుకు వ్యతిరేకంగా సాగించే పోరుకు ప్రతిపక్షాల విస్తృత ఐక్యత అవసరమని అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో మహాగత్‌బంధన్‌ ఇచ్చిన గట్టి పోటీ, పోరాటం ఈ విషయాన్ని రుజువు చేసిందని తెలిపింది. అయితే, ఇటువంటి ఎన్నికల కూటముల్లో భాగస్వాములు తమ బలం, చూపగల ప్రభావానికి మించి సీట్లను డిమాండ్‌ చేయరాదని, పోటీ చేయరాదనే వాస్తవం కూడా ఇందులో ఇమిడి వుందని పేర్కొంది. 70సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 19సీట్లను మాత్రమే గెలుచుకోవడం ఈ కూటమి బలహీనతగా రుజువైందని సంపాదకీయం పేర్కొంది. ఆ రకంగా బీహార్‌ ఎన్నికలు నిర్దిష్టమైన సానుకూల అంశాలు కొన్నింటిని చూపించాయని, వాటిలో సమర్ధవంతంగా ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, కాలానుగుణ ప్రజా సమస్యలపై ప్రచారం, కొన్ని ప్రజానుకూల విధానాలను ప్రతిపాదించడం, యువతను ఆకట్టుకోగలిగే సామర్ధ్యాన్ని కనపరచడం వంటివి ముఖ్యమని సంపాదకీయం పేర్కొంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వీటిని ముందుకు తీసుకెళ్లాల్సి వుందని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం పేర్కొంది.