అమెరికా ఉచ్చులో పడొద్దు

చైనాతో సరిహద్దు వివాదం ఒక పరిష్కారానికి వచ్చే సూచనలు ప్రస్తుతానికి కనబడడం లేదు. సరిహద్దుకి ఇరువైపులా సైన్యాల మోహరింపు తగ్గుముఖం పడుతున్న దాఖలాలూ లేవు. ఈ నేపథ్యంలో అమెరికా నుండి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ (విదేశాంగ వ్యవహారాల బాధ్యత)గా ఉన్న మైక్‌ పాంపియో, సెక్రటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ (రక్షణ రంగ బాధ్యత)గా ఉన్న మార్క్‌ ఎస్పర్‌ అక్టోబరు చివరి వారంలో మన దేశానికి వచ్చారు. మిలిటరీ రంగంలో అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 'బెకా' (బేసిక్‌ ఎక్స్‌చేంజ్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకున్నారు. ఈ కాలంలోనే విశాఖపట్నం లోను, మలబార్‌ తీరం లోను నాలుగు దేశాల (ఇండియా, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా) నావికా దళాల సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి. ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణిలో యుద్ధానికి అవసరమైన షినూక్‌ హెలికాప్టర్లు, సి-17 అనే గ్లోబ్‌మాస్టర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అమెరికా నుండి మన దేశం కొనుగోలు చేసింది. అత్యంత క్లిష్టమైన వాతావరణంలో సైనికులకు సరఫరాలను అందించడానికి ఇవి అవసరం. ఎముకలు కొరికే చలిలో సైనికులు వాడే ప్రత్యేక దుస్తులను 11,000 సెట్లు కూడా కొనుగోలు చేశారు. ఆ చలిలో గడ్డకట్టుకు పోకుండా వుండే ఇంధనాన్ని, లూబ్రికెంట్లను, వైద్య పరికరాలను, ఆహారాన్ని కూడా అమెరికా సరఫరా చేయనుంది.
చైనాను కట్టడి చేసే పేరుతో ఏర్పడిన నాలుగు దేశాల సైనిక కూటమి వ్యూహంలో భాగంగా అండమాన్‌, నికోబార్‌ దీవులను కీలక మిలిటరీ కేంద్రంగా అభివృద్ధి చేయబోతున్నారు. భౌగోళికంగా ఈ దీవులు కీలక ప్రదేశంలో ఉన్నాయి. చైనా సముద్ర వాణిజ్య మార్గంలో కీలకంగా వుండే మలక్కా జలసంధికి అండమాన్‌ దీవులు సమీపంలోనే ఉన్నాయి. ఈ కారణాలరీత్యా అండమాన్‌ దీవులు చైనా వ్యతిరేక మిలిటరీ వ్యూహంలో కీలకం కానున్నాయి.
      అటు హిమాలయ పర్వతాల వైపు నుండి, ఇటు బంగాళాఖాతం వైపు నుండి చైనాను ఎదుర్కొని దీటుగా సమాధానం చెప్పగలిగే సైనిక వ్యూహాన్ని రూపొందించామని జబ్బలు చరుస్తోంది కేంద్ర బిజెపి ప్రభుత్వం. ఈ పరిణామాలను చూపించి ప్రజల్లో చైనా వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ హడావుడిలో చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోడానికి జరగవలసిన ప్రయత్నాలన్నీ పక్కకు పోతున్నాయి. దౌత్యపరంగా తేలికగా పరిష్కరించుకోవలసిన వివాదాన్ని భారీ మిలిటరీ వ్యూహంతో, అందునా, అమెరికన్‌ సామ్రాజ్యవాద మిలిటరీ కూటమిలో భాగంగా మారి తేల్చుకోదలచుకుంది మోడీ ప్రభుత్వం. మన సత్తా ఏమిటో చూపిస్తేనే అవతలివారు చర్చలకు దిగివస్తారు అన్నది బిజెపి ప్రచారం చేస్తోంది. హిందూత్వ శక్తుల ఈ కండకావర ప్రదర్శన (జింగోయిజం)కు మన దేశం భారీ మూల్యమే చెల్లించుకోవలసి వుంటుందన్నది మనం గమనించాలి.
       అమెరికా తన ప్రపంచాధిపత్యం విస్తరింపజేసుకోడానికి పన్నిన ఉచ్చులో భారత దేశం చిక్కుకుంది. 1995లో పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఇందుకు తొలి అడుగులు పడ్డాయి. పాతికేళ్ళ తర్వాత ఇప్పటికి అమెరికన్‌ వ్యూహం సంపూర్ణ రూపం మన కళ్ళ ముందు ఆవిష్కారం అవుతోంది.
     1950 దశకంలో అమెరికన్‌ వ్యూహంలో పాకిస్తాన్‌ ఇదే విధంగా చిక్కుకుంది. సెంటో (సెంట్రల్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) సియాటో (సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌)లలో భాగస్వామి అయింది. తాను అమెరికా ఆడుతున్న అంతర్జాతీయ చదరంగంలో ఒక పావుగా ఉన్నానన్న సంగతి ఆ దేశానికి అర్ధం కాలేదు. పాకిస్తాన్‌ను అడ్డం పెట్టుకుని అటు ఆనాటి ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వాన్ని, తద్వారా సోవియట్‌ యూనియన్‌ను దెబ్బ తీయడానికి, ఇటు అమెరికా ఆధిపత్య వ్యూహానికి దూరంగా ఉంటూ అలీన విధానాన్ని ముందుకు తెచ్చిన భారత దేశంపై ఒత్తిడి పెంచడానికి అమెరికా ప్రయత్నించింది. చివరికి పాకిస్తాన్‌ తాలిబాన్లకు, ఇతర ఉగ్రవాద ముఠాలకు సహాయం అందించే స్థావరంగా దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌ లో అమెరికా వ్యూహం ఫలించింది. కాని అందుకు పాకిస్తాన్‌ భారీ మూల్యం ఇప్పటికీ చెల్లిస్తోంది. మన దేశంతో గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు సత్సంబంధాలు లేవు. అమెరికన్‌ మిలిటరీ జోక్యం పాకిస్తాన్‌లో సైనిక విభాగాన్ని రాజకీయం చేసింది. పాక్‌ సైన్యం అక్కడి అంతర్గత రాజకీయాల్లో ఇప్పుడు ఎటువంటి ఆధిపత్య పాత్ర పోషిస్తోందో అందరూ చూస్తున్నారు. ఈ మిలిటరీ వ్యూహం ఫలితంగా పాకిస్తాన్‌ దేశం ఆర్థికాభివృద్ధిలో బాగా వెనుకబడింది. ప్రజల పరిస్థితులు దిగజారాయి.
       1995లో మారిన అంతర్జాతీయ పరిస్థితులలో అమెరికా ఆధిపత్యాన్ని తట్టుకోడానికి మరింత పటిష్టంగా అలీన విధానాన్ని అమలు చేయడానికి పూనుకొనే బదులు ఆ విధానానికే నీళ్ళొదిలి మన ప్రభుత్వం అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సిద్ధపడింది. అటు ఆఫ్ఘనిస్థాన్‌ విషయంలోనూ అమెరికాకు ఇక పాకిస్తాన్‌ అవసరం లేకపోయింది. కూరలో కరివేపాకు మాదిరిగా పాకిస్తాన్‌ ను అమెరికా పక్కనబెట్టింది.
      అమెరికాతో తమ మైత్రి ఎటువంటి దయనీయ స్థితికి తమను నెట్టిందో ఇప్పుడు పాకిస్తాన్‌ ప్రజలు గమనిస్తున్నారు. మిలిటరీ పెత్తనం తమ దేశాన్ని రెండుగా చీల్చిందన్న సత్యాన్ని అర్ధం చేసుకున్నారు. పాక్‌ మిలిటరీ కబంధ హస్తాల నుండి తమ దేశ ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా రక్షించుకోవాలో బోధపడక సతమతమౌతున్నారు.
      రేపు మన దేశం పరిస్థితీ అంతే అవుతుందని మోడీ ప్రభుత్వం గమనించడంలేదు. అమెరికా యెక్క 'చైనాను అదుపు చేసే వ్యూహం'లో మనం ఒక కీలుబొమ్మగా మారుతున్నాం అని అర్ధం చేసుకోవడంలేదు. ఈ మిలిటరీ ఒప్పందాల మాటున అమెరికన్‌ ప్రైవేటు కంపెనీల నుంచి రక్షణ పరికరాలను భారీ ఖర్చుతో దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో మన దేశం అలీన విధానానికి కట్టుబడి వున్న కాలంలో అమెరికా మన దేశంతో ఆయుధ వ్యాపారం ఏమీ చేయలేకపోయింది. కాని ప్రస్తుత ఒప్పందాల ఫలితంగా ఇప్పటికే రూ.1.26 లక్షల కోట్ల ఆయుధాలను మన దేశానికి అమ్మింది. ఇది ఆరంభం మాత్రమే. ఇంతకు అనేక రెట్లు రానున్న కాలంలో మన దేశం అమెరికా నుండి కొనుగోలు చేయవలసి వస్తుంది. అంతే కాదు. ఇన్నేళ్ళూ మనం అంతర్జాతీయ మార్కెట్‌లో మనకు ఆమోదకరంగా ఉండే మార్కెట్‌ నుండి కొనుగోలు చేయగలిగే పరిస్థితి ఉండేది.                   ఇకముందు ఆ వెసులుబాటు ఉండదు. తమ టెక్నాలజీతో సమన్వయపరచుకోవడానికి వీలుగా ఉండే దగ్గరే ఆయుధాల కొనుగోళ్ళు జరపాలన్నది అమెరికా షరతు. ఇంతవరకూ వాడుతున్న రష్యన్‌, తదితర దేశాల పరికరాలను, ఆయుధాలను సైతం వాడే వీలుండదు. అందువలన వాటిని పక్కన పడేసి మళ్ళీ కొత్తగా అమెరికా నుండి కొనుగోలు చేయాల్సిందే. లక్షల కోట్ల రూపాయలు ప్రతీ ఏటా ఆయుధాల కోసం కేటాయించాల్సిందే. అక్కడ ప్రైవేటు కంపెనీలు లాభపడుతున్నాయి. ఇక్కడ మన దేశంలో పేదరికం మరింత పెరుగుతోంది. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బ తింటున్నాయి. చైనాతో సాగుతున్న అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతింటోంది. ఒకసారి అమెరికా కూటమిలో చేరాక ఇక మన దేశంతో చైనా ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ప్రశ్నార్ధకమే.
        ఈ వ్యూహం వలన మనకేమీ లాభం లేకపోగా నష్టపోయేదే ఎక్కువగా ఉంటుందన్నది పాకిస్తాన్‌ అనుభవం చెప్తున్న విషయం. మన దేశ ప్రయోజనాల రీత్యా ఈ మిలిటరీ కూటముల నుండి విడగొట్టుకుని స్వతంత్రంగా వ్యవహరించడం చాలా అవసరం. మనతో వైరం చైనాకూ ఎటువంటి ప్రయోజనాన్నీ ఇవ్వదు.
       ఉభయ దేశాలూ దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా సరిహద్దు వివాదాన్ని ఉభయతారకంగా పరిష్కరించుకుని షాంఘై కో ఆపరేషన్‌, బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ సహకార ఒప్పందాలను బలోపేతం చేసుకునే దిశగా నడిస్తేనే మనకూ, చైనాకూ, ఈ ప్రపంచానికీ మేలు. అలాగాక అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకు తెచ్చిన వ్యూహంలో ఇరుక్కుంటే అందుకు భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వుంటుంది. అమెరికన్‌ సైన్యంతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఫలితంగా పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం దెబ్బ తిని సైనిక పెత్తనం పెరిగినట్టే మన దేశంలోనూ పరిణామాలు జరగవచ్చు. అది ఈ దేశానికీ, ప్రజాస్వామ్యానికీ కీడు.

- ఎం.వి.ఎస్‌. శర్మ