బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

దేశంలో పాలనంతా అంబానీ, అదానీలకు మోడీ ఇచ్చిన వాగ్దానాల చుట్టే తిరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి డొలిచేస్తోంది. మోడీని గద్దెదింపే అతి పెద్ద పోరాటం దేశంలో సమీప భవిష్యత్తులో విశాఖ నుంచే ఉంటుంది' అని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. 'బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం' అనే నినాదంతో  విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కాన్వోకేషన్‌ హాల్‌లో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు పోరాడుతున్న తీరును అభినందించారు. భారత రాజ్యాంగంలోని మౌలిక విలువలకు బిజెపి ప్రభుత్వం చెద పట్టించిందన్నారు. ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌లో ప్రజలంతా పాల్గొని బిజెపి విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.