కార్మిక సంఘాల జాతీయ సమ్మెకు మద్దతు

సార్వత్రిక సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా తొలిరోజైన సోమవారం కార్మికలోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతామని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు.విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్మికులు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పారిశ్రామిక నగరాలు, వాడల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోల్‌కత్తా, ముంబాయి వంటి నగరాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ సమ్మెలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో దాదాపు నూరుశాతం సమ్మె జరిగింది. బిహెచ్‌ఇఎల్‌ యూనిట్లలోనూ పనులు నిలిచిపోయాయి.