కరెంట్‌ బాదుడు

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపింది. కరోనా విలయానికి జనం బతుకులు కకావికలమైన సమయాన ఇళ్లకు వాడే కరెంట్‌ బిల్లులు పెంచి షాక్‌ ఇవ్వడం సర్కారు కర్కశానికి తార్కాణం. ఇప్పటికే కేంద్రం గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరల మోత మోగిస్తూ ప్రజల నడ్డి విరుస్తుండగా దానికి విద్యుత్‌ ఛార్జీల భారం అదనం. గృహ వినియోగదారులపై పడే మొత్తం భారం రూ.4,300 కోట్లు. అందులో టారిఫ్‌ పెంపుదల మూలంగా పడేది రూ.1,400 కోట్లు. ట్రూ అప్‌ వసూళ్లు రూ.2,900 కోట్లు. ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ (ఎపిఇఆర్‌సి)నే ఛార్జీలు వడ్డిస్తూ నిర్ణయం వెలువరించినా, ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడం వల్లనే ఛార్జీలు పెరిగాయి. మూడు డిస్కంలు కలుపుకొని 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.45,398 కోట్ల ఆదాయం అవసరం కాగా ఇప్పుడున్న ఛార్జీల ప్రకారం లోటు రూ.10,992 కోట్లుగా అంచనా వేశాయి. ఛార్జీల పెంపు ప్రతిపాదనతో లోటు రూ.10,045 కోట్లని తెలిపాయి. డిస్కంలు పెంచమన్నది 887 కోట్లు. ఇఆర్‌సి పెంచింది 1,400 కోట్లు. డిస్కంలు అడిగినదానికంటే ఎక్కువ పెంచడంలో ఇఆర్‌సి తత్వం బోధ పడదు. ఆగస్టు నుండి రాబోయే మూడేళ్లలో వాయిదాల్లో ట్రూ అప్‌ ఛార్జీలు వసూలు చేయబూనడం మరీ దారుణం.
    టారిఫ్‌ పెంచడం ఒక ఎత్తయితే శ్లాబుల మాయాజాలం అంతకంటే పెద్ద దగా. యూనిట్‌పై కనిష్ట పెంపుదల 45 పైసలు కాగా గరిష్టం 1.57 రూపాయలు. 0-30 యూనిట్ల శ్లాబు మరీ ఘోరం. నిరుపేదలనూ వదలకుండా యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31-75 యూనిట్ల శ్లాబు వినియోగదారులపై యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76-400 లోపు శ్లాబులపై రూపాయి కంటే ఎక్కువ వడ్డించి 400 యూనిట్ల కంటే ఎక్కువ వాడే వారిపై కనికరం చూపించి 55 పైసలే పెంచారు. టారిఫ్‌ పెంపు వల్ల ప్రజలపై భారం పడేది 1,400 కోట్లేనంటున్నా, శ్లాబుల కిరికిరితో అంతకంటే చాలా ఎక్కువే గుంజుతారని నిపుణులు నొక్కివక్కాణిస్తున్నారు. పేదలు 200 యూనిట్లు వాడతారని, వారిపై భారం వేయొద్దని ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వారి ప్రభుత్వ పథకాలు పొందడానికి 300 యూనిట్ల వరకు వాడేవారిని పేదలుగా నిర్ణయించారు. ఆ మేరకైనా ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం తరఫున ఎందుకు పూచీ పడరు? పైగా 75 యూనిట్ల వరకు వాడే వారి నుండి ఉత్పత్తి వ్యయంలో 50 శాతమే వసూలు చేస్తున్నామనడం పెంపును సమర్ధించుకోవడమేగా?
    కరెంట్‌ ఛార్జీల బాదుడు ప్రభుత్వాల నయా-ఉదారవాద విధానాల్లో భాగం. కేంద్ర విధానాలకనుగుణంగానే ఛార్జీలు పెంచక తప్పడం లేదని ఇఆర్‌సి స్పష్టం చేసిందందుకే. క్రాస్‌ సబ్సిడీ ఇవ్వొద్దన్న కేంద్ర ఆదేశాలను రాష్ట్ర సర్కారు పాటించింది. రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.9 వేల కోట్లు ప్రభుత్వం భరిస్తోందని ఇఆర్‌సి గొప్పగా చెప్పింది. సంస్కరణల్లో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్న తరుణంలో ఉచిత విద్యుత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పిపిఎ)ను సమీక్షిస్తామన్న ప్రభుత్వం అంతకంటే అధిక ధరలు చెల్లిస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతోంది. సెకీతో సౌర విద్యుత్‌ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం అదానీకి దోచిపెట్టేందుకే. ప్రభుత్వరంగంలోని కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అందుకే. జెన్‌కోను నిర్వీర్యం చేసి ప్రైవేటు నుండి అధిక ధరలకు కరెంట్‌ కొని ఆ భారాలు ప్రజలపై వేసే కుట్రలు గత ప్రభుత్వంలో మొదలై ఇప్పుడూ కొనసాగుతున్నాయి. వైసిపి వచ్చాక స్థిర ఛార్జీలు, శ్లాబుల పేరిట ఛార్జీలు మోపింది. ఉమ్మడి రాష్ట్రంలో 2000లో టిడిపి హయాంలో ఛార్జీల పెంపునకు నిరసనగా వెల్లువెత్తిన మహోద్యమం బషీర్‌బాగ్‌ కాల్పులకు దారితీసి ముగ్గురి ప్రాణార్పణతో అజరామరమైంది. విద్యుత్‌ ఛార్జీలు పెంచాలన్నా, సంస్కరణలు చేపట్టాలన్నా పాలకుల్లో వణుకు పుట్టించింది. టిడిపి పతనానికి నాంది పలికింది. కరెంట్‌ జోలికొచ్చిన ఏ ప్రభుత్వానికైనా అదే గతి పడుతుందని గమనంలో పెట్టుకోవాలి. వైసిపి సర్కారు పెంచిన విద్యుత్‌ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి.