చరిత్రలో సిపిఎం - 3 తన సొంత విధానాన్ని రూపొందించుకున్న సిపిఎం సిద్ధాంతం విషయంలో ఎటువంటి రాజీ పడకుండా సాగుతోంది. ఎత్తుగడల విషయంలో మాత్రం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ కార్మిక, కర్షక, కష్టజీవుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళుతూ వస్తున్నది. అందువల్లనే బెంగాల్‌లో రెండవ యునైటెడ్‌ఫ్రంట్‌లో ఇతరులకన్నా అసెంబ్లీ స్థానాలు తనకే ఎక్కువ వచ్చినప్పటికీ ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని బంగ్లా కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.
బెంగాల్, కేరళ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో రైతాంగం, ఇతర కష్టజీవుల వర్గ చైతన్యాన్ని పెంచేందుకు సిపిఎం బ్రహ్మాండంగా కృషి చేసింది. భూమి సమస్యపైనా, ఇంకా ఇతర సమస్యలపైనా గ్రామీణ ప్రాంతాల్లో వివాదాలు చెలరేగినప్పుడు గతంలో ప్రభుత్వాల మాదిరిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు భూస్వాముల కొమ్ము కాయలేదు. ఫలితంగా పశ్చిమ బెంగాల్‌లో రైతాంగ పోరాటాలు పెద్దఎత్తున విజృంభించాయి. ఈ పోరాటాల్లో సిపిఎం జోక్యం చేసుకొని నాయకత్వం వహించడంతో ఆ పార్టీ గ్రామీణ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన స్థానాన్ని సాధించుకున్నది. ఈ పోరాటాల ప్రభావం పేద రైతులు, వ్యవసాయ కూలీలపైనే కాక ఇతర తరగతుల వారిపైనా పడి పార్టీ పట్ల వారిలోనూ విశ్వాసం నెలకొనేలా చేసింది. పెరిగిన సిపిఎం బలం ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిబింబించింది.
ఈ కాలంలోనే పాలకపక్షమైన కాంగ్రెస్ ఇండికేట్, సిండికేట్ అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇందిరాగాంధీ నాయకత్వంలోని ఇండికేట్ గుత్తేతర జాతీయ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదని, మొరార్జీ దేశారు ప్రభృతుల నాయకత్వంలోని సిండికేట్ గుత్త పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదని కొందరు సూత్రీకరించి ఇందిరా కాంగ్రెస్‌తో సంపూర్ణమైన పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం మాత్రం ఈ రెండు వర్గాల మధ్య మౌలికమైన తేడా లేదని, అయితే సిండికేట్ మరింత అభివృద్ధి నిరోధకమైందని చెప్పింది. ఇందిరాగాంధీ గైకొన్న బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దులాంటి చర్యలను సమర్ధించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సిండికేట్ ఓటమికి కృషి చేసింది. ఆ తర్వాత 1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌కు అఖండ విజయం లభించింది. కాంగ్రెసేతర పార్టీలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఒక్క సిపిఎం మాత్రమే దీనికి మినహాయింపు. పార్లమెంటులో సిపిఎం బలం 19 నుండి 25కి పెరిగింది. ఒక్క బెంగాల్‌లోనే 20 స్థానాలు లభించాయి. 1971 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం అంతకుముందున్న తన బలాన్ని 83 నుంచి 115కి పెంచుకుని అతి పెద్ద ఏకైక పార్టీగా వచ్చింది. అయినప్పటికీ ఇతర కూటముల కుట్రవల్ల అధికారం చేపట్టలేకపోయింది. కొద్దినెలలకే ఆ ప్రభుత్వం విఫలమై రాష్ట్రపతి పాలన విధించారు. ఈ కాలంలోనే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో దాని ప్రతిష్ట పెరిగింది. 1972లో అనేక రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. బెంగాల్‌లో 1972 అసెంబ్లీ ఎన్నికలు అర్ధ ఫాసిస్టు భీతావహ పూర్వరంగంలో జరిగాయి. సిపిఎం పైనా, ఆ పార్టీ మద్దతుదారులపై క్రూరమైన దాడికి కాంగ్రెస్ పూనుకున్నది. ఈ బీభత్సకాండలో 650 మంది సిపిఎం నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడింది. సిపిఎంకు 14 స్థానాలు మాత్రమే లభించాయి. ఈ ఎన్నికల ఫలితాలను నిరాకరించిన సిపిఎం అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
1971లో పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు పెద్ద మెజారిటీ రావడం, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఏక పార్టీ నియంతృత్వం ఏర్పడింది. రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించబడుతున్నాయని, కేంద్రం చేతుల్లో మరిన్ని అధికారాలు కేంద్రీకరించబడు తున్నాయని సిపిఎం హెచ్చరించింది. ఈ పూర్వరంగంలో సిపిఎం 9వ మహాసభ 1972 జూన్ - జులైలో తమిళనాడులోని మధురైలో జరిగింది. ఏకపక్ష నియంతృత్వానికి దారి తీస్తున్న కాంగ్రెస్ పాలనను ప్రతిఘటించేందుకు అన్ని ప్రజాతంత్ర పార్టీలతో, గ్రూపులతో, వ్యక్తులతో విశాల సంఘటనను నిర్మించాలని మహాసభ పిలుపునిచ్చింది. మధురై మహాసభలో ప్రధానమైన అంశం జాతుల సమస్యపై సిపిఎం వైఖరిని స్పష్టం చేయడం. భారతదేశం వివిధ జాతుల, ఉపజాతుల సమ్మేళనం అయినప్పటికీ అవసరమైతే విడిపోయేందుకు వీలు కల్పించే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కు అవసరం లేదని సిపిఎం పేర్కొంది. ఇక్కడ ఒక ప్రధానమైన జాతి ఇతర జాతులను అణచివేసి, దోపిడీ చేస్తున్న పరిస్థితి లేదు. అందువల్ల వివిధ భాషలకు చెందిన వారు, జాతులకు చెందిన వారు తమ ఆర్థికాభివృద్ధి కోసం జరిపే పోరాటం దేశ సమైక్యతా పరిధిలోనే జరగాలని పేర్కొంది. విచ్ఛిన్న శక్తులు పెరిగితే అది పాలకవర్గాలకు, సామ్రాజ్య వాదులకే లాభం అని అభిప్రాయపడింది.