మతోన్మాద శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత

చరిత్రలో సిపిఎం - 5 దేశంలోని భిన్నత్వాన్ని, సామరస్యాన్ని దెబ్బ తీసే మతోన్మాద శక్తుల ఎదుగుదలపై సిపిఎం మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉంది. జనసంఫ్‌ు కాలం నుంచీ ఆ పార్టీ దూరంగా ఉంటూ, దానిని ఒంటరిపాటు చేయటానికీ అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నించింది. అవకాశవాదంతో కొన్ని ప్రాంతీయ పార్టీలు దాని పంచన చేరుతున్నప్పుడు, కాంగ్రెస్‌ పలు కీలక సందర్భాల్లో దాని పట్ల ఉదారంగా వ్యవహరించినప్పుడు తీవ్రంగా హెచ్చరించింది. బిజెపి ఎదుగుదల దేశానికి ప్రమాదమని 11వ మహాసభ నుంచి చేస్తున్న తీర్మానాలు ఇప్పుడు అది ఎంత నిజమో స్పష్టమవుతోంది.
1987 అక్టోబర్‌ 12న మతోన్మాదానికి, వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా సిపిఎం ఢిల్లీలో సదస్సు నిర్వహించింది. చీలికలు, పీలికలుగా ఉన్న లౌకిక ప్రతిపక్షాలు నేషనల్‌ ఫ్రంట్‌గా ఏర్పడటానికి కృషి చేసింది. 1987 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, బెంగాల్‌లో సిపిఎం నాయకత్వంలోని సంఘటనలు అఖండ విజయం సాధించాయి.
ఈ కాలంలోనే సోవియట్‌ యూనియన్‌లో ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకోసాగాయి. అక్టోబర్‌ మహా విప్లవ 70వ వార్షికోత్సవానికి 1987 నవంబర్‌లో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన సిపిఎం ప్రతినిధి బృందం హాజరైంది. గోర్బచెవ్‌ ప్రసంగంలోని అంచనాల పట్ల ఈ బృందం అభ్యంతరం తెలిపింది. సోవియట్‌ పార్టీ అంచనాలు సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చేవిగా వున్నాయని, తృతీయ ప్రపంచ దేశాల దోపిడీని తీవ్రతరం చెయ్యడానికి దోహదపడతాయని సిపిఎం ముందుగానే అంచనా వేసింది. తరువాతి పరిణామాలు ఆ అంచనాను నిజం చేశాయి.
1989 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దేశంలో 55 చోట్ల మత కొట్లాటలు జరిగాయి. మరోవైపు బోఫోర్స్‌ కుంభకోణం కేసు దేశాన్ని కుదిపి వేసింది. 1989 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం మూడు లక్ష్యాలతో పాల్గొంది. ఒకటి, కాంగ్రెస్‌ను ఓడించడం. రెండు, మతతత్వ శక్తులను ఒంటరిపాటు చేయడం. మూడు, లోక్‌సభలో వామపక్ష శక్తుల బలాన్ని పెంచుకోవడం. వీటిలో మొదటి లక్ష్యం పూర్తిగా నెరవేరింది. చివరి రెండూ పాక్షికంగా నెరవేరాయి. కాంగ్రెస్‌ ఓటమి పాలైనప్పటికీ ఎవ్వరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో నేషనల్‌ ఫ్రంట్‌ - జనతాదళ్‌ కూటమి వామపక్షాలు, బిజెపిల బయటి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. బిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే తాము మద్దతు ఇవ్వబోమని వామపక్షాలు నిర్ద్వంద్వంగా ప్రకటించడంతో గత్యంతరం లేక బిజెపి ప్రభుత్వం వెలుపలే ఉండాల్సి వచ్చింది. వి.పి.సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ అమలుకు పూనుకోవడంతో- రిజర్వేషన్‌ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు చెలరేగాయి.
అది సద్దు మణగక ముందే బిజెపి రథయాత్ర ప్రారంభించింది. 1989 అక్టోబర్‌ 12న వామపక్షాలు మత సామరస్యాన్ని కోరుతూ లక్నోలో పెద్ద ర్యాలీ నిర్వహించాయి. వి.పి.సింగ్‌, యుపి, బీహార్‌లలోని జనతాదళ్‌ ప్రభుత్వాలు మతోన్మాదుల ఒత్తిడికి లొంగలేదు. బీహార్‌లో అద్వానీని అరెస్టు చెయ్యడంతో రథయాత్ర నిలిచిపోయింది. తరువాత బిజెపి మద్దతు ఉపసంహరణతో విపి సింగ్‌ రాజీనామా చేశారు. అనేక పరిణామాల అనంతరం.. 1991 మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నేషనల్‌ ఫ్రంట్‌, వామపక్షాలు జాతీయ స్థాయి సమన్వయంతో ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి. తొలి దశ పోలింగ్‌ తర్వాత రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురవ్వడంతో - కాంగ్రెస్‌ పట్ల సానుభూతి పవనాలు బలంగా వీచాయి. అయినప్పటికీ ఆ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. గద్దెనెక్కిన పి.వి. నరసింహారావు మైనారిటీ ప్రభుత్వం.. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణలను పెద్దఎత్తున అమలు చేసింది. మతోన్మాద శక్తుల పట్ల రాజీ, ఉదాసీన వైఖరి కొనసాగించింది. అదే తరుణంలో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలింది. ఇటువంటి వాతావరణంలో సిపిఎం 14వ మహాసభలు 1992 జనవరి 3-9 తేదీల్లో మద్రాసులో జరిగాయి.
సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా పరిణామాలపై మద్రాసు మహాసభ చర్చించి కొన్ని నిర్ధారణలకొచ్చింది. సిపిఎం కార్యక్రమాన్ని తాజా పరచాలని కూడా ఈ మహాసభ నిర్ణయించింది. ఈ కాలంలోనే మార్క్‌ ్స 175వ జయంతి సందర్భంగా కలకత్తాలో ఒక అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల సదస్సు నిర్వహించింది. పి.వి.నరసింహారావు ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, మతోన్మాదంపై పోరాటాలను ఉధృతం చేసింది.
1992 డిసెంబరు 6 దేశ చరిత్రలోనే చీకటి రోజు. హిందూ మతోన్మాద మూకలు అయోధ్యలో బాబ్రీ మసీదును ఆరోజు నేలమట్టం చేశాయి. రాజీవ్‌గాంధీ మాదిరిగా, పీవీ ప్రభుత్వం అనుసరించిన ఉదాసీన వైఖరి, రాజీ వైఖరి ఈ విషాదకర సంఘటనకు దోహదపడ్డాయి. అయోధ్యలో ఘటన తర్వాత దేశమంతటా మత కల్లోలాలు చెలరేగాయి. దుష్ట ఆర్థిక విధానాలపైన, మతోన్మాదం పైన ఏక సమయంలో పోరాటం చెయ్యాలని సిపిఎం నిర్ణయించింది. ఇటువంటి పూర్వరంగంలో 1995 ఏప్రిల్‌ 3-8 తేదీల్లో సిపిఎం 15వ మహాసభ చండీఘర్‌లో జరిగింది. పార్టీలో దిద్దుబాటు ఉద్యమం చేపట్టాలని ఈ మహాసభ నిర్ణయించింది. జాతీయంగా ఏర్పడ్డ అనేక రాజకీయ పరిణామాల తరువాత యునైటెడ్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వానికి సిపిఎంయే నాయకత్వం వహించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ పార్టీ తిరస్కరించింది.
యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కొన్ని ప్రశంసనీయమైన చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు, విదేశాంగ విధానం లాంటి విషయాల్లో మంచి కృషి చేసింది. ఆర్థిక విధానాల్లో మాత్రం కాంగ్రెస్‌ బాటనే నడిచింది. 18 నెలల అనంతరం కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరణతో 1998లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం మరింత పడిపోయింది. యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా ఓటమి పాలైంది. సిపిఎం, వామపక్షాలు మాత్రమే తమ బలాన్ని నిలబెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో లాభపడిన బిజెపి 18 అమాంబాపతు పార్టీలతో అవకాశవాద పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి తెలుగుదేశం పార్టీ లౌకిక శక్తులకు ద్రోహం చేసి బిజెపికి మద్దతు ప్రకటించిన ఫలితంగా ఎన్‌డిఏ కూటమి పేరుతో బిజెపి గద్దెనెక్కింది. అధికారంలోకి వచ్చిన బిజెపి సరళీకృత విధానాలను మరింత వేగవంతం చేసింది. మతోన్మాద విధానాలనూ తీవ్రతరం చేసింది. ఈ పూర్వరంగంలో 1998 అక్టోబర్‌ 5-11 తేదీల్లో కలకత్తాలో సిపిఎం 16వ మహాసభలు జరిగాయి. ''బిజెపి మామూలు బూర్జువా భూస్వామ్య పార్టీ కాదు. ఇది పచ్చి అభివృద్ధి నిరోధక పార్టీ. వేలాది మత సంస్థలను అదుపు చేస్తున్న మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌ దీని వెనుక ఉండి నడిపిస్తుంది'' అని ఈ మహాసభ రాజకీయ తీర్మానం పేర్కొంది. బిజెపి, మతోన్మాద శక్తుల ప్రమాదాన్ని ప్రతిఘటించే అంశంపైనా, వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తులను పటిష్టం చేయడం గురించి, వామపక్ష ఐక్యతను పెంపొందించడం గురించి ఈ మహాసభ ఎత్తుగడలను రూపొందించింది.