నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా...అదే సమయంలో...హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సాగే రాజకీయ సైద్ధాతిక పోరాటాల సమ్మేళనంగానే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ పాలనపై సాగే పోరాటం వుండాలని సిపిఎం ఎప్పుడూ చెబుతూ వస్తుంది. హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదం, అందులో అంతర్లీనంగా ముస్లిం వ్యతిరేకత అనేది ప్రజల్లో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజల్లో గణనీయ వర్గాలను ప్రభావితం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సి వుంది. హిందూత్వకు రాజకీయ-సైద్ధాంతిక ప్రతివాదాన్ని నిర్మించి, ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళని పక్షంలో హిందూత్వ-కార్పొరేట్ వర్గాల పాలనను దీటుగా, సమర్ధవంతంగా సవాలు చేయలేం.
సిపిఎం 23వ మహాసభ ఏప్రిల్ 6 నుండి 10 వరకు కేరళ లోని కన్నూర్‌లో జరగనుంది. రాబోయే మూడేళ్ళ కాలానికి పార్టీ రాజకీయ దిశా నిర్దేశాన్ని రూపొందించనుంది.
రెండు మాసాల క్రితమే పార్టీ కేంద్ర కమిటీ ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని విడుదల చేసింది. పార్టీ లోని అన్ని స్థాయిల్లో దీనిపై చర్చ జరిగింది. ప్రతినిధుల చర్చ జరిగిన అనంతరం మహాసభ దీన్ని ఆమోదిస్తుంది. పార్టీ రాజకీయ వ్యూహాత్మక వైఖరికి ఒక రూపమివ్వడంలో, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఈ కసరత్తు సిపిఎంకే ప్రత్యేకమైనది.
పార్టీ గత మహాసభ 2018లో జరిగింది. ఆ ఏడాదే దేశంలో మితవాద పార్టీ తన స్థానాన్ని మరింత సంఘటితపరుచుకుంది. 2019 మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అతి పెద్ద మెజారిటీతో తిరిగి రావడాన్ని మనం చూశాం. తదనుగుణంగా, హిందూత్వ ఎజెండాను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగడాన్ని ఈ దేశం వీక్షించింది. దీనితో పాటు కార్పొరేట్ అనుకూల, నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఫలితంగా ప్రభుత్వానికి అనుకూలంగా వున్న కొద్దిమంది బడా పెట్టుబడిదారులు అపారమైన ఆస్తులను కూడగట్టారు. లాభాలను పెంచుకున్నారు.
మరోపక్క నిరుద్యోగం, ఆదాయాల క్షీణత, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలతో ప్రజల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తలెత్తిన నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి.
అదే సమయంలో, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, తమపై మోపబడుతున్న భారాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గంలోని వివిధ విభాగాలు అతి పెద్ద ఐక్య పోరాటాలు సాగించిన కాలం ఇది. ఈ ప్రజా ప్రతిఘటనకు ప్రధాన ఉదాహరణ- మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చారిత్రక రీతిలో ఏడాది కాలం పాటు సాగిన రైతాంగ ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం వాటిని రద్దు చేసుకోవాల్సి రావడం.
కార్మిక వ్యతిరేక నిబంధనలను, ప్రైవేటీకరణను, కనీస వేతనాలు లేకపోవడాన్ని నిరసిస్తూ కార్మిక వర్గం యావత్తు సమైక్య పోరాటాలు నిర్వహించింది. 2018 నుండి 2022 వరకు నాలుగు సార్వత్రిక సమ్మెలు జరిగాయి. తాజా సమ్మె మార్చి 28, 29 తేదీల్లో జరిగింది. ఈ సమ్మెల్లో అన్ని రంగాలకు చెందిన కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ విలువలు, సూత్రాలను పరిరక్షించాలని కోరుతూ ఇతర ఉద్యమాలు, పోరాటాలు సాగాయి. వాటిలో ప్రధానమైనది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, దేశవ్యాప్తంగా దీనిపై విస్తృతంగా ప్రజాందోళనలు జరిగాయి.
ఈ పోరాటాలు, ఉద్యమాలను మరింత ముమ్మరంగా జరిగేలా చూడడంలో సిపిఎం, వామపక్ష శక్తులు కీలక పాత్ర పోషించాయి.
నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా...అదే సమయంలో...హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సాగే రాజకీయ సైద్ధాతిక పోరాటాల సమ్మేళనంగానే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ పాలనపై సాగే పోరాటం వుండాలని సిపిఎం ఎప్పుడూ చెబుతూ వస్తుంది. హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదం, అందులో అంతర్లీనంగా ముస్లిం వ్యతిరేకత అనేది ప్రజల్లో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజల్లో గణనీయ వర్గాలను ప్రభావితం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సి వుంది. హిందూత్వకు రాజకీయ-సైద్ధాంతిక ప్రతివాదాన్ని నిర్మించి, ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళని పక్షంలో హిందూత్వ-కార్పొరేట్ వర్గాల పాలనను దీటుగా, సమర్ధవంతంగా సవాలు చేయలేం.
హిందూత్వపై సాగించాల్సిన ఈ యుద్ధాన్ని చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర లౌకికవాద ప్రతిపక్ష పార్టీల్లోని అనేక పార్టీలు విఫలమవుతున్న సమయంలో ఇటువంటి ఒక వేదికను రూపొందించాల్సిన, లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నిటిని కూడగట్టాల్సిన బాధ్యత సిపిఎం, వామపక్షాలపై వుంది.
పార్టీ మహాసభ ఒకే ఒక అంశం (రాజకీయంగా, నిర్మాణపరంగా సిపిఎం స్వతంత్ర బలాన్ని ఎలా పెంపొందించుకోవాలనే అంశం)పై దృష్టి కేంద్రీకరించనుంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, త్రిపురలో బిజెపి వంటి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు సిపిఎంకు బలమైన స్థావరాలుగా వున్న బెంగాల్, త్రిపురలపై దాడులు చేయడంతో సిపిఎం తీవ్ర నష్టాలను చవిచూసింది. పార్టీ ప్రభావం కూడా క్షీణించింది. ఈ వాస్తవిక పరిస్థితుల నేపథ్యంలో స్వతంత్రంగా పార్టీ బలాన్ని పెంచుకోవడంపై సిపిఎం దృష్టి సారించనుంది. గత నాలుగేళ్ళలో పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులను పోగొట్టుకుంది. వివిధ రూపాల్లో వేలాదిగా దాడులను ఎదుర్కొంది. అయినా, పార్టీ కార్యకర్తలు ఆ అణచివేత చర్యలను దీటుగా ఎదుర్కొని, తిరిగి బలాన్ని కూడగట్టుకోవడానికి, ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా పోరాటాలను, కార్మికోద్యమాలను చేపడుతున్నారు.
గత మహాసభలు జరిగినప్పటి నుండి నిర్దేశించిన కర్తవ్యాల అమలును, నిర్మాణ కార్యక్రమాలను పార్టీ మహాసభ సమీక్షించనుంది. రెండేళ్ళుగా, కోవిడ్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లు విధించడంతో సాధారణ జన జీవనం దెబ్బ తింది. నిరుపేదలకు అనేక కష్టాలను, ఇబ్బందులను కలిగించింది. ఈ క్లిష్టమైన తరుణంలో పార్టీ ప్రజలతో పూర్తిగా మమేకమైంది. శరణార్ధులైన కార్మికులకు, పట్టణ, గ్రామీణ పేదలకు సాయపడేందుకు గణనీయంగా చర్యలు చేపట్టి సాయపడింది. కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, రేషన్ ఇవ్వడం, ఆహార కిట్‌లను అందచేయడం, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, శానిటైజర్లను అందచేయడం వంటి చర్యలను చేపట్టింది.
ఇక పార్టీ నిర్మాణ రంగానికి వస్తే, యువ కార్యకర్తలను పార్టీ లోకి తీసుకురావడం ద్వారా, మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వర్గ, సామాజిక సమ్మేళనాన్ని మెరుగుపరచడం ద్వారా పార్టీ కమిటీలను పునరుత్తేజపరచడానికి కృషి జరుగుతోంది.
ఇటువంటి సమయంలో కేరళలో పార్టీ మహాసభలు జరగడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. కన్నూర్ కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టని కోట వంటిది. ఇక్కడ ప్రజల్లో పార్టీకి లోతైన మూలాలు వున్నాయి. జిల్లాలో పార్టీ సభ్యత్వం 61,600 మందికి పైగానే వుంది. దేశంలోని అన్ని జిల్లాల్లోకెల్లా అత్యధికంగా పార్టీ సభ్యత్వం వున్న జిల్లా ఇది. కేరళలో గతేడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి ఎల్‌డిఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, ఆ ప్రభుత్వ పని తీరుకు ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆమోద ముద్ర లభించింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపట్టిన విధానాలకు ప్రత్యామ్నాయంగా కేరళ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఈ విధానాలను అమలు చేసింది.
అందువల్ల, వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల జాతీయ ప్రత్యామ్నాయ విధానాలను చూపుతూ...ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ విధానాలను, పని తీరును పరిగణన లోకి తీసుకుని... కేరళలో పార్టీ మహాసభ నిర్వహించడం చాలా ఉపయుక్తంగా వుంటుంది.
మితవాద, నయా ఉదారవాద హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సిపిఎం, వామపక్షాలు నిరంతర పోరాటాలు సల్పుతున్నాయని కన్నూర్ మహాసభల్లో ప్రదర్శితమవుతుంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం సమైక్యంగా పోరాడేందుకు దేశంలోని అన్ని లౌకికవాద, ప్రజాస్వామ్య శక్తులను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మహాసభలు మార్గ నిర్దేశనం చేస్తాయి.
వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు)
ప్రకాష్ కరత్