పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితేనే ఎడమ కాలవ ద్వారా విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు వస్తాయి. ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల మెట్ట ప్రాంతాల సాగునీటి అవసరాలకు మళ్ళించేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం పూర్తి కావడం ఇక్కడ కీలకం. దాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఇది విభజన చట్టం నిర్దేశించిన విషయమే. ఆ పోలవరానికి నిధులు ఇవ్వకుండా బిగబట్టినది ఎవరు? బిజెపి ప్రభుత్వం కాదా? లక్షలాది నిర్వాసితులను నీట ముంచుతూ వారి పునరావాసం తన బాధ్యత కానే కాదంటున్నది ఎవరు? బిజెపి కాదా? పోలవరం పూర్తి కాకుండా మోకాలడ్డుతూ, అక్కడ గిరిజనులను నీట ముంచుతూ ఇక్కడ ఉత్తరాంధ్రలో జలం కోసం యాత్ర అని ఘోష పెట్టడం ఎంత పెద్ద డ్రామా! విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు రావడం ఆలస్యం అయినదీ వీరి నిర్వాకం పుణ్యమే. ఇక్కడ నీళ్ళు కావాలంటూ యాత్ర చేసేదీ వీళ్ళే. గత ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో అధికారాన్ని వెలగబెడుతూ, వరసగా ఒకదాని వెంట మరొకటిగా ఉత్తరాంధ్ర కు, యావత్ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయాలను చేస్తూన్న బిజెపి ఇప్పుడు 'పోరుయాత్ర' చేయడానికి తయారైపోయింది. ఇంతకన్నా నయవంచన ఇంకొకటి ఉండదేమో ! వెనకటికి ఒకడు తన కన్న తల్లిని చంపేసి ఆ తర్వాత కోర్టులో జడ్జి గారి ముందు నిలబడి ''అయ్యా! కనికరించండి! అసలే తల్లి లేనివాణ్ణి'' అని ఏడ్చాడట! అలా ఉంది మన బిజెపి నేతల పరిస్థితి. విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టవద్దని స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ గత 400 రోజులకు పైగా నిరవధికంగా, సమైక్యంగా పోరాటాన్ని సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష నేత, ఇద్దరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆఖరికి బిజెపికి కొత్త మిత్రుడు పవన్ కల్యాణ్ సైతం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దనే అన్నాడు. కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కును అమ్మి తీరుతాం అని పార్లమెంటు సాక్షిగా ప్రకటిస్తూనే వుంది. రోజుకో విధంగా విశాఖ ఉక్కు నడకకి ఆటంకాలు కల్పిస్తూనే వుంది. తాజాగా జార్ఖండ్‌లో గతంలో కేటాయించిన బొగ్గు గనులను రద్దు చేసింది. ఈ నాలుగు వందల రోజుల్లోనూ బిజెపి ప్రభుత్వం సాగిస్తున్న ఈ దురాగతాన్ని గురించి నోరెత్తకుండా, ఇక్కడ మోడీ భజన మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్న ప్రబుద్ధులంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర జనం కోసం 'యాత్ర' చేస్తారట! ఎంత సిగ్గుమాలిన ప్రకటన ! ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఇవ్వాలన్నది విభజన చట్టంలోని ఒక అంశం. దానిని పార్లమెంటు ఆమోదించింది. అప్పుడు దానిని బిజెపి బలపరిచింది. తీరా అధికారానికి వచ్చాక ఆ సంగతే గాలికొదిలేసింది. మళ్ళీ 2019 ఎన్నికల ముందు రైల్వేజోన్ గుర్తుకొచ్చింది కాబోలు, పియూష్ గోయెల్ గారిని రప్పించి రైల్వే జోన్ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికి మూడేళ్ళయింది. ఆ రైల్వే జోన్ అతీ, గతీ లేదు. పైగా 'కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్నట్టు' ఇక్కడి విశాఖ డివిజన్ కాస్తా రాయగడ కి తరలించడానికి సిద్ధమైపోయారు. ఇంతకన్నా దగా ఉంటుందా? ఇప్పుడు ఆ దగాకోరులంతా కలిసి జనం కోసం యాత్ర చేస్తారట! ఇది ఇంకో దగా కాదా ? ఇప్పుడు హఠాత్తుగా బిజెపి నేతలకి ఉత్తరాంధ్రలో జలం లేదన్న సంగతి గుర్తుకొచ్చింది. చాలా ఆశ్చర్యం! ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం వెంటనే జరగాలని జలయాత్ర చేస్తారట. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితేనే ఎడమ కాలవ ద్వారా విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు వస్తాయి. ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల మెట్ట ప్రాంతాల సాగునీటి అవసరాలకు మళ్ళించేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం పూర్తి కావడం ఇక్కడ కీలకం. దాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఇది విభజన చట్టం నిర్దేశించిన విషయమే. ఆ పోలవరానికి నిధులు ఇవ్వకుండా బిగబట్టినది ఎవరు? బిజెపి ప్రభుత్వం కాదా? లక్షలాది నిర్వాసితులను నీట ముంచుతూ వారి పునరావాసం తన బాధ్యత కానే కాదంటున్నది ఎవరు? బిజెపి కాదా? పోలవరం పూర్తి కాకుండా మోకాలడ్డుతూ, అక్కడ గిరిజనులను నీట ముంచుతూ ఇక్కడ ఉత్తరాంధ్రలో జలం కోసం యాత్ర అని ఘోష పెట్టడం ఎంత పెద్ద డ్రామా! విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు రావడం ఆలస్యం అయినదీ వీరి నిర్వాకం పుణ్యమే. ఇక్కడ నీళ్ళు కావాలంటూ యాత్ర చేసేదీ వీళ్ళే. వెనుకబడిన ఉత్తరాంధ్ర కి, రాయలసీమ కి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలన్నది విభజన చట్టం నిర్దేశించింది. ఆ ప్యాకేజీలను అమలు చేయవలసిది కేంద్ర ప్రభుత్వమే. అందుకోసం మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర కోసం మంజూరు చేసిన నిధి ఎంత? కేవలం రూ.100 కోట్లు! అక్కడితో తమ పని అయిపోయిందని ప్రకటించేసి చేతులు దులిపేసుకున్నారు. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినదీ లేదు, అవసరమైన నిధులను కేటాయించినదీ లేదు. తమ వంతు వచ్చేసరికి మొండిచెయ్యి చూపించారు. ఇప్పుడు మాత్రం ప్రత్యేక నిధులకోసం పోరాడతాం అంటున్నారు! జనం చెవుల్లో పువ్వులు పెట్టడం అంటే ఇదే మరి ! ఎనిమిదేళ్ళు గడిచినా కేంద్రం ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయవలసిన ఐఐఎం సంస్థ నిర్మాణం ఇంతవరకూ పూర్తి కాలేదు. గిరిజన యూనివర్సిటీ స్థలసేకరణ కూడా ఇంతవరకూ జరగలేదు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఫలితమే. ఇన్నేళ్ళ నిర్లక్ష్యం తర్వాత హఠాత్తుగా ఇప్పుడీ కపట ప్రేమ ప్రదర్శన యాత్ర ఎందుకు? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశంలోనే ఉన్నత ప్రమాణాలు కల విశ్వవిద్యాలయంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉండేది. ఈ ఎనిమిదేళ్ళలోనూ ఆ విశ్వ విద్యాలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెంత? బిజెపి నేతలు చెప్పగలరా? ఇప్పుడు దేశానికి ఉపాధ్యక్షులుగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఆ యూనివర్సిటీ లోనే చదివారు కదా? ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధికి ఈ బిజెపి పెద్దలంతా ఒరగబెట్టిందేమిటో సెలవీయగలరా ? ఉత్తరాంధ్ర లో ఉన్న విస్తారమైన అటవీ ప్రాంతంలో ఉంటున్న గిరిజనుల ఉనికికే ఎసరు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలను తీసుకువస్తోంది. ఆ సవరణలే గనుక అమలులోకి వస్తే 70వ దశకంలో వీరోచితంగా ఇక్కడి గిరిజనులు పోరాడి సాధించుకున్న 1/70 చట్టం పూర్తిగా నీరుగారిపోతుంది. అటవీ హక్కుల చట్టం ద్వారా సంక్రమించిన హక్కులు, పీసా చట్టం లోని హక్కులు అన్నీ హుష్ కాకి అయిపోతాయి. ఇదీ బిజెపి ఇక్కడి గిరిజనానికి చేస్తున్న ఉపకారం! ఇది కాక, గిరిజన ప్రాంతంలోని ఉపాధి అవకాశాలు గిరిజనులకే దక్కే విధంగా చూసే జీవో నెం.3 ను సుప్రీం కోర్టులో ఎవరో సవాలు చేసినప్పుడు గిరిజనుల తరఫున వాదించవలసిన కేంద్ర ప్రభుత్వం మొఖం చాటేసింది. ఫలితంగా గిరిజన ప్రాంతంలోని ఉద్యోగాలపై స్థానిక గిరిజనులు హక్కు కోల్పోయారు. ఉన్న హక్కులను రక్షించడం చేతకాని బిజెపి ఇప్పుడేమో సాధించేస్తామంటూ యాత్రకు తయారౌతోంది. ఈ కాలంలోనే గంగవరం పోర్టు కాస్తా అదానీ పరం అయిపోయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమూ అదానీకే కట్టబెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక భావనపాడులో నిర్మించబోయే హార్బర్ కూడా అదానీకే అంటున్నారు. ఉత్తరాంధ్ర ను ఈ విధంగా గుజరాతీ అదానీ కి వలసగా మార్చడానికేనా ఇప్పుడు యాత్ర సాగిస్తున్నారు ? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే తిరస్కరించిన అణువిద్యుత్ ప్లాంట్‌ను తెచ్చి ఇక్కడ కొవ్వాడలో బలవంతంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద రుద్దుతున్నారు. ఇక్కడి ప్రజల ప్రాణాలతో, ఇక్కడి పర్యావరణంతో చెలగాటం ఆడుతున్నారు. ఇదేనా బిజెపి-మార్కు అభివృద్ధి? ఉత్తరాంధ్రకే కాదు, మొత్తం రాష్ట్రానికే బిజెపి తీరని ద్రోహం చేసింది, ఇంకా చేస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పి మోసం చేసింది. రాజధాని నిర్మాణం తన పని కాదన్నట్టు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రానికి రావలసిన రెవెన్యూ లోటు గ్రాంటుకు ఎగనామం పెట్టింది. కేంద్రం మామూలుగా ఇవ్వవలసిన గ్రాంట్లకు వినాశకర షరతులను ముడిపెట్టి ప్రజల ఇబ్బందులకు కారణమౌతోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయమై పార్లమెంటు లోపల, వెలుపల నిలదీసి, ప్రతిఘటించే విషయంలో అధికారంలో ఉన్న వైసిపి గాని, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి గాని నోరు మెదపకపోవడం, కొన్ని కొన్ని సందర్భాలలో బిజెపి కి వంత పాడడం మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. అటు వైసిపి గాని, ఇటు టిడిపి గాని ఒకరినొకరు దెబ్బ తీయాలనుకునే తాపత్రయంలో పడిపోతున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న బిజెపి దుర్మార్గాన్ని ప్రధాన సవాలుగా పరిగణించడం లేదు. ఈ రెండు పార్టీలూ ఇదే విధంగా తమ రాజకీయ హ్రస్వ దృష్టిని రాబోయే కాలంలో కూడా కొనసాగించితే రాష్ట్రానికి, ప్రజలకు అది పెనుశాపంగా మారుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసిపి మరింత స్పష్టంగా, మరింత బలంగా బిజెపి చేస్తున్న అన్యాయాలను ప్రతిఘటించాలి. అది అధికార పార్టీ బాధ్యత. ఈ విషయంలో ఊగిసలాట గాని, లొంగుబాటు గాని, మెతకవైఖరి గాని కొనసాగితే అది నష్టం. ఈ నష్టం ఆ పార్టీకే కాదు, మొత్తం రాష్ట్రానికే నష్టం. రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలూ సామరస్యంతో జీవిస్తున్నారు. ఇది తెలుగు ప్రజల వారసత్వం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ మతాలవారే గాక, ఆ యా ప్రాంతాలలో గిరిజనులు తమ తమ దైవారాధనా సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో పీర్ల పండుగలు, రొట్టెల పండుగ, గుణదల మేరీ మాత ఉత్సవం, కోటప్పకొండ శివరాత్రి ఉత్సవం వంటివి భిన్న మతాల ప్రజలంతా అన్యోన్యంగా జరుపుకునే సంబరాలు. ఈ ఉత్తమ సాంప్రదాయాలు మన తెలుగు ప్రజలవి. ఈ ఆరోగ్యకర వాతావరణంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే కుయత్నాలెన్నో బిజెపి చేసింది, ఇంకా కొనసాగిస్తోంది. వాటిని రాష్ట్ర ప్రజలు చైతన్యవంతంగా తిరస్కరించారు. ఇప్పుడు ఈ యాత్ర కూడా మరో కోణం నుండి సాగించే కుట్ర మాత్రమే. ప్రజానీకం చైతన్యవంతంగా స్పందించి దీనిని తిరస్కరించడం ఖాయం. ఎం.వి.ఎస్. శర్మ