కర్ణాటకలో ఒకదాని తరువాత మరొకటిగా వివిధ సున్నిత అంశాలపై అనవసర రగడను సంఫ్‌ు పరివార శక్తులు తెర మీదికి తెస్తున్నాయి. గత ఫిబ్రవరిలో రగిల్చిన హిజాబ్ చిచ్చు ఇంకా పూర్తిగా చల్లారలేదు. తాజాగా హలాల్, అజాన్, పండ్ల అమ్మకం వంటి అంశాలు వరస కట్టాయి. మతోన్మాదం ఆధారంగా లబ్ధి పొందాలని చూస్తున్న కాషాయ రాజకీయ శక్తులు ఈ ఉన్మత్త, ఉద్వేగపూరిత ఎజెండాను దురుద్దేశపూర్వకంగా ప్రజల్లో జొనుపుతున్నాయి. ప్రజలు ఈ కుట్రను, కుతంత్రాన్ని గ్రహించి, విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. విద్య, వైద్యం, కనీస వసతులు, ధరలు, ఉపాధి వంటి అంశాలు ప్రజల రోజువారీ జీవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రభావితం చేస్తాయి. వాటికి సంబంధించి తలెత్తే సమస్యలు ప్రజలను ఏకం చేస్తాయి. ప్రభుత్వాలను నిలేసి, నిలదీసేలా ప్రేరేపిస్తాయి. ఈ అంశాలన్నిటిలోనూ బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ వైఫల్యాలపై ప్రజల నుంచి ప్రతిఘటన ఏర్పడకుండా, వారి దృష్టిని మళ్లించటానికి బిజెపి మతతత్వ ఎజెండాను తెర మీదికి తెస్తోంది. ప్రజలు నిత్య జీవితంలో అంతగా పట్టించుకోని మతపరమైన ఉద్వేగాలను రంగంలోకి దించుతుంది. వాటిని చర్చనీయాంశం చేసి, ఆ చుట్టూ జనాన్ని చేరేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి చౌకబారు ఉన్మత్త పాచికతోనే మొన్నటి ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో లబ్ధి పొందింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అమలు చేయాలని చూస్తోంది. ఏ కులమతాలకు చెందినవారికైనా, ఏ ప్రాంతం వారికైనా ఆహార, ఆహార్య అలవాట్లు పూర్తిగా వారి వారి ఇష్టం. ఏం తినాలి, ఎక్కడ కొనాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి వంటి విషయాల్లో ఆంక్షలు విధించటం పచ్చి నియంతృత్వమే! కానీ, మతోన్మాద సంఫ్‌ు పరివారం చాలా బలవంతంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. ప్రజల వ్యక్తిగత జీవితాల విషయంలో తనకు తానే ఆపాదించుకున్న అధికారంతో కర్ర పెత్తనం చేస్తోంది. అనేక సామాజిక, సాంస్క ృతిక ఉద్యమాల కొనసాగింపుగా ప్రజల్లో నెలకొని ఉన్న సామరస్య, సౌభ్రాతృత్వ భావనలకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తోంది. మాంసం కోసం దుకాణానికి వెళ్లినప్పుడు కొనుగోలుదారులు ... అది ఏ మాంసం? తాజాదా, కాదా? అన్నది చూస్తారు తప్ప ఆ జీవి ఏవిధంగా వధించబడిందో చూడరు. కానీ, బిజెపి, దాని పరివారమూ దాన్ని మత కోణంలో చూపించి, హలాల్ చేసిన మాంసాన్ని హిందువులు కొనరాదంటూ ముస్లిముల పట్ల ద్వేషభావాన్ని పెంచుతున్నాయి. ముస్లిం వ్యాపారుల వద్ద పండ్లు కొనరాదంటూ మరొక ఉన్మాద బృందం తాజాగా ప్రచారం మొదలెట్టింది. మసీదులో ప్రార్థనల వేళ వినిపించే అజాను శబ్దకాలుష్యం సృష్టిస్తుందని, దానిని ఆపకపోతే పోటీగా భజనలు వినిపిస్తామని హిందూత్వ మూకలు కొన్ని వివాదం రాజేశాయి. కొందరు బిజెపి ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు. మతం పేరిట ప్రజలను మైనారిటీ, మెజారిటీ గ్రూపులుగా విభజించి, రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న కాషాయ పరివారపు పన్నాగం దేశ సమైక్యతకు చాలా ప్రమాదకరం. మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. మైకులు హోరెత్తితే, ప్రశాంతతకు భంగం కలిగిస్తే - చట్టపరంగా ఏఏ నియంత్రణ చర్యలు తీసుకోవాలో ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని అమలు చేసే ప్రభుత్వ శాఖలూ ఉన్నాయి. ఆ పనిని ఆ పరిధికి వదలాలి. కానీ, మతకోణంతో సమస్యను రగిలించటం, ప్రచారం చేయడం ఎంతమాత్రం ఉపేక్షణీయం కాదు. ఇప్పుడు నడుస్తున్నది రంజాను మాసం. ఇప్పుడే కర్ణాటక బిజెపి ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై ఉత్తర్వులివ్వడం, సమాంతరంగా ఉన్మాద శక్తులు పేట్రేగిపోవడం.. ప్రజల్లో మత విద్వేషాలను రగిల్చే దురుద్దేశంతోనే తప్ప మరొకటి కాదు. మనుషుల మంచి చర్యలనే మహోన్నతంగా చూడాలని, శ్రమనే దైవంగా భావించాలని, కులమతాలకు అతీతంగా మనుషులు మసలాలని ప్రబోధించిన సంఘ సంస్కర్త బసవన్న నడయాడిన నేల కర్ణాటక. అలాంటి చోట మనుషులను మతాల పేరిట వేరు చేసే విష జాఢ్యం దాపురించటం విచారకరం. కాంగ్రెస్, జనతాదళ్ వంటి పార్టీలు కాషాయ మూకల విద్వేష చేష్టల పట్ల ఉదాసీనంగా ఉండడం మానుకోవాలి. దేశ సమైక్య సాంస్క ృతిక భిన్నత్వపు వారసత్వాన్ని నిలుపుకోవటానికి దృఢమైన వైఖరిని తీసుకోవాలి. లౌకికత్వమే తమ విధానమని స్పష్టంగా, గట్టిగా చెప్పాలి. ప్రగతిశీల, లౌకికవాద శక్తులన్నీ ఏక కంఠాన నినదించి, ఏకతాటిపై నిలబడి మతోన్మాద శక్తులను ఎదిరించాలి.