వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన బలోపేతం : సీతారామ్‌ ఏచూరి

బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరు. సొంత బలాన్ని పెంచుకోడానికి ప్రాధాన్యం. రాజకీయ, సామాజిక శక్తులను ఏకం చేసేందుకు కృషి - మీడియా గోష్టిలో సీతారామ్‌ ఏచూరి. కన్నూర్‌ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు తాము శక్తివంచనలేకుండా కృషి చేస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. దీనికి ముందు పార్టీ తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం పట్ల నిబద్ధతను మహాసభ పునరుద్ఘాటించిందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ముందుకు వెళ్తామని, తద్వారా బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ కూటమి సవాల్‌ను తిప్పికొడతామన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల హిందూత్వ ఎజెండాను ఓడించే కార్యాచరణ ప్రణాళికలో భాగంగా త్వరలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల రాజకీయ, సామాజిక శక్తులతో సమావేశాన్ని సిపిఎం ఏర్పాటు చేస్తుందన్నారు. సోమవారం కేరళలోని కన్నూర్‌లోని ఇకె నయనార్‌ అకాడమీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కన్నూర్‌ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌తో కలిసి సీతారాం ఏచూరి మాట్లాడారు. ఈ సందర్భంగా 23వ పార్టీ అఖిల భారత మహాసభ నిర్ణయాలను ఆయన వివరించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పడగ విప్పుతున్న హిందూత్వను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పార్టీ అఖిల భారత మహాసభ నిర్దేశించిందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అనుసరిస్తూ, లౌకిక, ప్రగతిశీల శక్తులను ఐక్యం చేయడం ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నయా ఉదారవాద, మతతత్వ విధానాలను తిప్పికొట్టేందుకు వామపక్షాలు కృతనిశ్చయంతో ఉన్నాయని అన్నారు. లౌకికవాదం, ఫెడరలిజం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు లౌకిక కూటమిని బలోపేతం చేయాల్సి ఉందని ఏచూరి తెలిపారు. కన్నూరు మహాసభ హిందూత్వ ఎజెండాను సమర్థంగా ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో నింపిందన్నారు. వామపక్ష పార్టీల పోరాటాలు అస్సాంతో సహా ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించేందుకు కృషి జరుగుతుందన్నారు. అట్టడుగు స్థాయిలో కార్యకలాపాలను విస్తృతం చేయాల్సి ఉందన్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అట్టడుగు స్థాయి ప్రజల మధ్య పని చేయడం ద్వారా పార్టీని బలమైన శక్తిగా నిలుపుతామన్నారు. తొలి విడతగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యదర్శులతో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. హిందూత్వను ఎదుర్కొనేందుకు సైద్ధాంతిక సాంస్కృతిక రంగాల్లో పార్టీ కృషి పెరగాలన్నారు. మతోన్మాదుల ఆగడాలు ఇప్పుడు ఈశాన్యానికి కూడా పాకాయని అన్నారు. అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ 'వ్యాధి' విజృంభిస్తోందని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనకు ముందు నాసిక్‌ నుండి ముంబాయి వరకు బ్రహ్మాండమైన లాంగ్‌ మార్చ్‌ నిర్వహించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివిధ రైతు సంఘాల నిరసనను సమన్వయం చేయడంలో లాంగ్‌ మార్చ్‌ చాలా కీలక భూమిక వహించిందన్నారు.