ఉపేక్ష ఉత్పాతం

నందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగలు ఉద్రిక్తతలతో విషాదాంతం కావడం మిక్కిలి ఆందోళనకరం. కేంద్రంలో బిజెపి వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. కర్ణాటక హుబ్బళ్లిలో మైనార్టీలు పవిత్రంగా భావించే ప్రార్ధనాస్థలంపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన మార్ఫింగ్‌ ఫొటో వివాదానికి హేతువైంది. అభ్యంతరం తెలుపుతూ మైనార్టీలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశాక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడికి మద్దతుగా మతోన్మాద మూకలు రెచ్చిపోయి అత్యంత పైశాచికంగా దాడులు చేయగా పోలీసులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి బొమ్మరు హుబ్బళ్లి ఘటనను వ్యవస్థీకృత దాడిగా పేర్కొనగా, హోం మంత్రి జ్ఞానేంద్ర ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా మాట్లాడారు. రెండు విధాలుగా మాట్లాడి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడం బిజెపికి అలవాటైన విద్యనే. ఇక్కడా అదే పునరావృతమైంది. కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపి, పరివారానికి ఇదే కొత్త కాదు. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధం, హలాల్‌ మాంసంపై నిషేధం వంటి వివాదాస్పద ఘటనల పరంపరకు 'హుబ్బళ్లి' ఒక కొనసాగింపు మాత్రమే. దేశ రాజధాని ఢిల్లీ జహంగీర్‌పురిలో హనుమాన్‌ జయంతి ర్యాలీలో పెచ్చరిల్లిన హింసలో పోలీసులు, పౌరులు గాయపడ్డారు. ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయి. సరిగ్గా ఇఫ్తార్‌ సమయంలో బజరంగ్‌దళ్‌ మూకలు కాషాయ జెండాలతో మసీదు వద్దకు చేరుకొని లౌడ్‌ స్పీకర్లు, డిజె సౌండ్స్‌తో రెచ్చగొట్టడంతో ఇరు గ్రూపుల మధ్య రాళ్లదాడి చోటు చేసుకుంది. మత ఘర్షణల ఆనవాళ్లే లేని ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బిజెపి, పరివారం కేంద్రీకరించి పని  చేస్తున్నాయనడానికి కర్నూలు జిల్లా హోళగుంద మత ఘర్షణలే ప్రత్యక్ష సాక్ష్యం. మండల కేంద్రంలో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించిన విహెచ్‌పి కార్యకర్తలు మైనార్టీల ప్రార్ధనా స్థలం వద్దకెళ్లి డిజెలు, మైక్‌లతో కవ్వించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వైపుల నుండి 85 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోళగుంద చిన్న మండల కేంద్రం. గతంలో అక్కడ మత ఘర్షణలు తలెత్తిన దాఖలా మచ్చుకైనా లేదు. ఈ మధ్యనే నంద్యాలలో మైనార్టీల ప్రార్ధనా మందిరం కూల్చివేత ఘటనలో ఘర్షణలు చెలరేగాయి. అప్పుడు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మైనార్టీలపైకి లఖింపూర్‌ ఖేరీ తరహాలో జిల్లా విహెచ్‌పి నాయకుడు కారు పోనిచ్చి పలువురిని గాయపర్చాడు. ఆ దుర్ఘటన మరవక ముందే అదే ప్రాంతంలోని హోళగుందలో చోటు చేసుకున్న మత విద్వేషాలు ప్రశాంతమైన రాష్ట్రానికి మతోన్మాద కుట్రల ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి. ఎప్పుడు సందు దొరుకుతుందా ఎప్పుడు మతోన్మాద ఎజెండాను అమలు చేద్దామా అని కాచుక్కూర్చున్న బిజెపి, సంఫ్‌ు పరివారానికి రంజాన్‌ మాసంలో వచ్చిన శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వాటంగా దొరికాయి. హుబ్బళ్లి, జహంగీర్‌పురి, హోళగుంద సంఘటనల్లో దండలో దారంలో కనిపించేది ఆ ఉన్మాదమే. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో శ్రీరామనవమి నాడు మాంసాహారం వండారంటూ ఎబివిపి గూండాలు మెస్‌వర్కర్ల పైన, విద్యార్థులపై రక్తం వచ్చేలా విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. పోలీస్‌ సెక్యూర్టీ ఉండగానే పాశవిక దాడి జరిగింది. దేశ వ్యాప్తంగా బిజెపి, పరివారం మతోన్మాద దుశ్చర్యలపై లౌకిక శక్తులు, పార్టీల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ మన రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి మతోన్మాదం పట్ల ఉపేక్ష వహిస్తున్నాయి. బిజెపి పంచన చేరిన జనసేన ఆ పార్టీకి అనుయాయిగా మారిపోయినట్టుంది. తమ పార్టీలు లౌకిక పార్టీలు అవునో కాదో వైసిపి, టిడిపి, జనసేన ప్రకటించాలి. బిజెపి, పరివారంతో మిలాఖత్‌ అయ్యామనన్నా ప్రజలకు చెప్పాలి. మెజార్టీ మతోన్మాదం, మైనార్టీ మతోన్మాదం అనే ప్రశ్న లేకుండా ఆ విధానాలు అవలంబించి ప్రజలను చీల్చే వారిని ప్రతిఘటించినప్పుడే ప్రజలకు ప్రశాంతత, శాంతి భద్రతలు.