ఒక ప్రాంతంలో జీవించే ప్రజలు తమని తాము ఏవిధంగా పాలించుకోవాలో నిర్ణయించుకోగలరు. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి కీలకం. భిన్న భాషలు ఉన్న దేశంలో కేంద్రం చేసే నిర్ణయాలను ఆయా ప్రాంతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేసి పంపవచ్చు. ఆ పని మానేసి ఒక్క హిందీని మాత్రమే రుద్దడం కుట్ర కాక ఇంకేమిటి? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద దాడి గాక ఇంకేమిటి? మనం ఎంతగానో ప్రేమించే మన మాతృభాష మీద దాడి చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం కాక మరేమిటి ? భాష అనేది మానవులు సృష్టించుకున్నది. తమ అవసరాలను తీర్చుకోడానికి ప్రకృతితో పోరాడుతూ మానవులు ఉత్పత్తి చేసే ప్రక్రియే శ్రమ. ఈ శ్రమ సమిష్టిగా మాత్రమే జరుగుతుంది. అందుచేత శ్రమ చేసే క్రమంలో మానవులు పరస్పరం తమ భావాలను, ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవలసిన తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితే భాష ఆవిర్భావానికి దారితీసింది. అంటే భాష శ్రమజీవులు సృష్టించిన ఒక ప్రక్రియ. అందుకే ప్రపంచంలో నేడు వేలాది భాషలు ఉన్నాయి. కొన్ని ప్రాచీన భాషలు కాలగమనంలో అంతరించిపోయినా, నేటికీ భారతదేశంలో 600 పైగా భాషలు సజీవంగా ఉన్నాయి. ఈ భాషలలో కొన్నింటికి లిపి కూడా ఉంది. పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోడానికి, భావాలను మార్పిడి చేసుకోడానికి మానవులు తమంతట తాము భాషలను రూపొందించుకుంటే...నేడు కొందరు ఆ భాష మీద సైతం పెత్తనం తమదేనంటూ ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వందలాది భాషలు ఉనికిలో ఉన్న మన దేశంలో, రాజ్యాంగమే గుర్తించిన జాతీయ భాషలు 22 ఉండగా కేవలం హిందీ భాష మాత్రమే అధికార భాషగా ఉండాలని అమిత్‌షా ప్రకటించారు. దేశంలో 52.83 కోట్ల మంది ప్రజలు హిందీ భాషనే ఉపయోగిస్తారని 2011 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది దేశ జనాభాలో 43.63 శాతం. 1971 జనాభా లెక్కల ప్రకారం హిందీ వాడేవారు 20.27 కోట్లు మాత్రమే. ఆ నాటి జనాభాలో ఇది 36.99 శాతం. హిందీ తర్వాత స్థానంలో బెంగాలీ భాష ఉంది. 1991లో 8.30 శాతం బెంగాలీ వారుంటే 2001 నాటికి 8.11 శాతానికి, 2011 నాటికి 8.03 శాతానికి వారి సంఖ్య పడిపోయింది. తెలుగు వారు 1991లో 7.87 శాతం నుంచి 2001లో 7.19 శాతానికి, 2011లో 6.70 శాతానికి తగ్గిపోయారు. ఇక మరాఠీయులు 1991లో 7.45 శాతం నుంచి 2001లో 6.99 శాతానికి, 2011లో 6.86 శాతానికి తగ్గారు. దేశంలోకెల్లా అత్యంత ప్రాచీన భాషల్లో సజీవంగా ఉన్న తమిళ భాష వాడేవారు 1991లో 6.32 శాతం, 2001లో 5.91 శాతం, 2011లో 5.70 శాతం ఉన్నారు. ప్రాంతీయ భాషలు వాడేవారిలో కనిపించిన తగ్గుదల గుజరాతీ భాష వాడేవారిలో, సంస్కృతం వాడే వారిలో మాత్రం ఎందుకో విచిత్రంగా కనిపించలేదు. తొమ్మిదో శతాబ్దంలోనే మృతభాష అయిపోయిన సంస్కృతాన్ని వాడేవారి సంఖ్య పెరిగిందని సూచించే లెక్కల వెనక నడుస్తున్న రాజకీయం ఏమిటి? 2001 నుంచి 2011 మధ్య దేశ జనాభా పెరుగుదల 2.6 శాతం మాత్రమే. కాని హిందీ భాషను వాడేవారి సంఖ్య అంతకన్నా ఎక్కువగా ఎలా పెరిగిపోయింది ? హిందీ భాషను వాడేవారిగా 2011 జనాభా లెక్కలు గుర్తించిన వారిలో హిందీ కాక మరో 50కి పైగా భాషలు మాట్లాడేవారిని సైతం కలిపేశాయి. అయిదు కోట్ల మందికిపైగా మాట్లాడే భోజ్‌పురి భాషను హిందీ భాషలో భాగంగా పరిగణించారు. ఆ భాషలో ప్రత్యేకంగా వార్తాపత్రికలు, టి.వి చానెళ్లు, పుస్తకాలు, సినిమాలు, సాహిత్యం పుష్కలంగా ఉన్నా దానిని ఒక భాషగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఒక్క భోజ్‌పురినే కాదు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో మాట్లాడే భాషలన్నీ 'హిందీ' గానే లెక్కిస్తున్నారు. 'పావరి' భాషను మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్‌లో చాలామంది వాడతారు. కాని అది కూడా 'హిందీ' ఖాతాలోకే పోయింది. అంటే దేశ ప్రజలందరి మీద హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రభుత్వం లెక్కల్ని తారుమారు చేస్తున్నదని స్పష్టంగా అర్థం అవుతోంది (2011 జనాభా లెక్కలు మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరమే వెల్లడయ్యాయని గమనించాలి). హిందూ-హిందీ-హిందూస్తాన్ నినాదంతో దేశం మీద తన ఏకపక్ష ఎజెండాను బలవంతంగా రుద్దడానికి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి పన్నుతున్న కుట్రలో భాగమే 'హిందీని అధికార భాష'గా ప్రకటించాలనే వివాదం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో జాతీయ భాషలుగా ప్రకటించిన తక్కిన అన్ని భాషలకన్నా వయస్సురీత్యా అతి చిన్నది. ఆలస్యంగా రంగం మీదకి వచ్చినది హిందీ. ఎప్పటి నుంచో ప్రజలు సృష్టించుకుని వాడుతున్న ఆయా భాషలను విస్మరించి, అణగదొక్కి హిందీని బలవంతంగా రుద్దడం అంటే ఆయా ప్రాంతీయ భాషలను ఉపయోగించే వివిధ జాతుల భారతీయులను అణగదొక్కడమే. బ్రిటిష్ పాలకుల కాలంలో ప్రాంతీయ భాషలకు తగిన ప్రాధాన్యత నివ్వకుండా, పరిపాలన యావత్తూ ఇంగ్లీషు భాషలోనే కొనసాగించారు. దీనిని అన్ని జాతుల భారతీయులూ వ్యతిరేకించారు. అందుకే జాతీయోద్యమంలో అంతర్భాగంగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఒక డిమాండ్‌గా ముందుకొచ్చింది. ఈ డిమాండ్‌ను భారత జాతీయ కాంగ్రెస్ 1938లో అంగీకరిస్తూ తీర్మానించింది. అయితే బడా బూర్జువా వర్గం స్వాతంత్య్రానంతరం ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అంగీకరించలేదు. దాంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఉద్యమాలు తలెత్తాయి. ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్ర, ప్రత్యేక సౌరాష్ట్ర, పంజాబ్ తదితర ఉద్యమాలు ఆవిధంగానే నడిచాయి. చివరికి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాష్ట్రాలకు పాలనలో అత్యధిక స్థాయిలో స్వయం ప్రతిపత్తి ఉండాలన్న సూత్రాన్ని గౌరవిస్తూ 'ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్' (భారతదేశం రాష్ట్రాల సమాఖ్య) అని రాజ్యాంగం పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బడా బూర్జువా-భూస్వామ్య పాలక వర్గాలకి, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని చిన్న బూర్జువా, భూస్వాములతో సహా మొత్తం ప్రజలకు మధ్య జరిగిన పోరాటంలో భాగంగా ప్రజలు విజయం సాధించి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోగలిగారు. తమ పాలనా వ్యవహారాలను, సమాచారాన్ని, విద్యాబోధనను అంతటినీ తమ భాషల్లోనే నిర్వహించుకునే హక్కు సాధించుకుని అమలు చేస్తున్నారు. 1960 దశకంలో మరోసారి దేశంలో భాషాపరమైన విభేదాలు తలెత్తాయి. హిందీ జాతీయ భాషగా ఉండాలనే డిమాండ్ ముందుకొచ్చింది. దేశ సమైక్యతను, బహుళత్వాన్ని, వివిధ జాతుల ప్రజల స్వయంప్రతిపత్తిని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ డిమాండ్‌ను ప్రజాస్వామిక శక్తులు, అభ్యుదయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తన కార్యక్రమంలో ఈ విధంగా పేర్కొంది: సిపిఐ(ఎం) పార్టీ కార్యక్రమం పేరా 6.3 (4) ఈ విధంగా ఉంది: ''పార్లమెంటులోనూ, కేంద్రపాలనలోనూ అన్ని జాతీయ భాషల సమానత్వాన్ని గుర్తించాలి. పార్లమెంటు సభ్యుడు తమ జాతీయ భాషలో మాట్లాడే హక్కు వుండాలి. దాన్ని అప్పటికప్పుడే అన్ని ఇతర భాషలలోకీ అనువదించే ఏర్పాటు ఉండాలి. అన్ని చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, తీర్మానాలు అన్ని జాతీయ భాషల్లో అందుబాటులో ఉండాలి. మిగిలిన అన్ని భాషలను పక్కనబెట్టి హిందీని ఏకైక అధికార భాషగా వినియోగించడం నిర్బంధం కాకూడదు. వివిధ భాషలకు సమానత్వం కల్పించడం ద్వారానే దాన్ని దేశమంతటా సమాచార సంబంధాల భాషగా ఆమోదించడం సాధ్యమవుతుంది. అప్పటి వరకు హిందీ, ఇంగ్లీషులను ఉపయోగించే ప్రస్తుత ఏర్పాటు కొనసాగాలి. ప్రజలు అత్యున్నత స్థాయి వరకు విద్యాసంస్థల్లో తమ మాతృభాషలో విద్యాబోధన పొందే హక్కు తప్పనిసరిగా ఉంటుంది. ఒకానొక భాషాప్రయుక్త రాష్ట్ర భాషను అన్ని స్థాయిల ప్రభుత్వ సంస్థల్లో పాలనాభాషగా వినియోగించే హక్కుకు హామీనివ్వాలి. మైనారిటి లేదా మైనారిటి భాషను లేదా అవసరమైన చోట ఒక ప్రాంతానికి చెందిన భాషను, రాష్ట్రానికి చెందిన భాషకు తోడుగా ఉపయోగించే అవకాశముండాలి. ఉర్దూ భాషకు, లిపికి రక్షణ కల్పించాలి.'' ''ఒకే దేశం-ఒకే భాష-ఒకే పన్ను-ఒకడే నాయకుడు-ఒకటే మతం'' నినాదం ముసుగులో హిందూత్వ-జాతీయ దురహంకారవాదాన్ని ముందుకు తెచ్చింది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి. ఈ నినాదం భారతదేశపు బహుళత్వాన్ని దెబ్బతీస్తుంది. 'భిన్నత్వంలో ఏకత్వం' మన దేశ ఉనికికి మూలాధారం. ఈ దేశంలో బహుళ మతాలు పుట్టాయి. మరెన్నో వచ్చిచేరాయి. వందలాది భాషలు పుట్టాయి. దేశ విదేశాల భిన్న సాంస్కృతిక స్రవంతులన్నీ ఈ అద్భుతమైన దేశంలో సంగమించి నవీన సంస్కృతులకు రూపకల్పన చేశాయి. హిందూస్తానీ సంగీతం, గాంధార శిల్పం ఆవిధంగా రూపొందినవే. ఇంతెందుకు? హిందీ భాష సైతం ఇక్కడి ప్రాకృత భాషలతో పర్షియన్, అరబిక్ భాషల సమాగమంలో నుంచి పుట్టినదే. 'నా భాష గొప్పది' అనుకోని మనిషి ఉండడు (బహుశా మన చంద్రబాబు, జగన్ ఇందుకు మినహాయింపు అయివుండొచ్చు. క్షమించాలి). కాని 'నా భాష మాత్రమే గొప్పది' అనుకోవడం అహంకారం, అవివేకం, మూర్ఖత్వమూ అవుతుంది. ఒక ప్రాంతంలో జీవించే ప్రజలు తమని తాము ఏవిధంగా పాలించుకోవాలో నిర్ణయించుకోగలరు. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి కీలకం. భిన్న భాషలు ఉన్న దేశంలో కేంద్రం చేసే నిర్ణయాలను ఆయా ప్రాంతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేసి పంపవచ్చు. ఆపని మానేసి ఒక్క హిందీని మాత్రమే రుద్దడం కుట్ర కాక ఇంకేమిటి? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద దాడి గాక ఇంకేమిటి? మనం ఎంతగానో ప్రేమించే మన మాతృభాష మీద దాడి చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం కాక మరేమిటి ? అమిత్‌షా ప్రకటనను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. సాటి తెలుగు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యుడు కెటిఆర్ సైతం వ్యతిరేకించారు. కాని మన ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకి, మరో నాయకుడు పవన్‌కల్యాణ్‌కి మాత్రం నోరు పెగలలేదు. ఎంత సిగ్గుచేటైన విషయం ఇది? ఈ చేతకాని తనం వెనక కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటే పూర్తి దృశ్యం అర్థం కాదు. గత మూడు దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్‌ను నయా ఉదారవాద విధానాల ప్రయోగశాలగా మార్చేశారు. దీనికి మొదట పుణ్యం కట్టుకున్నది చంద్రబాబు. దేశంలోకెల్లా అతి వేగంగా అతి లోతుగా, అతి దారుణంగా విద్య, వైద్య రంగాలను కార్పొరేటీకరించేందుకు పూనుకున్నారు. సామాజిక శాస్త్రాల అధ్యయనం పనికిమాలినదని తేల్చేశారు. తెలుగు భాషను మూలకు నెట్టేశారు. ఇంగ్లీషు వ్యామోహాన్ని విపరీతంగా ప్రోత్సహించారు. రాష్ట్రంలో కొత్త తరం యావత్తూ చిలక పలుకుల చదువు మాత్రం నేర్చుకుని ప్రశ్నించడం, పరిశోధించడం, సృజనాత్మకంగా ఆలోచించడం మరిచిపోయింది. గత మూడు దశాబ్దాలలో రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలోనైనా మనం చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క పరిశోధనా పత్రమైనా రూపొందిందా? మనం ఎంత నష్టపోయామో బోధపడుతోందా ? ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా తెలుగే లేకుండా చేసేస్తున్నారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. 2024 ఎన్నికల్లో కేవలం ఇంగ్లీషులో మాత్రమే ప్రసంగాలు చేసి ఇంగ్లీషులోనే ఓట్లు అడుగుదామని అనుకుంటున్నారేమో మరి! జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించే చంద్రబాబు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించరు. కారణం ఒకటే. ఇద్దరూ ఈ రాష్ట్రాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థల మార్కెట్‌గా దిగజార్చడానికే కంకణం కట్టుకున్నారు. వారికి ఇక్కడ తెలుగువాళ్లు, తెలుగు సంస్కృతి, తెలుగుదనం ఏదీ కనిపించదు. కేవలం కొనుగోలుదార్లు, అమ్మకందారులు మాత్రమే కనిపిస్తారు. అందుకే తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద కేంద్రంలోని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దాడి చేసినా నోరెత్తరు. పైగా తమ వంతు అదనంగా ఇంగ్లీషును కూడా రుద్ది జబ్బలు చరుచుకుంటారు !
ఎంత సిగ్గు చేటు ! తెలుగుజాతి ఆత్మగౌరవానికే కాక దేశంలో పలు జాతుల ఆత్మగౌరవాన్ని, అస్థిత్వాన్ని సవాలు చేస్తున్న ఈ కార్పొరేట్ హిందూత్వ శక్తులను ప్రతిఘటించడమే కీలక కర్తవ్యం.
ఎం.వి.ఎస్. శర్మ