మనిషి-తన సృజనాత్మకత, తెలివి, విజ్ఞానంతో తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చుకుంటూ సామాజిక ఉత్పత్తిలో ముందుకొచ్చాడు. ఆ మేధో సంపత్తి ఆధునిక సమాజ అభివృద్ధిలో కీలకమైనది. సాధారణంగా మేధో సంపత్తి అనేది ఇతరులు అనధికారికంగా ఉపయోగించకుండా చట్టం రక్షించే మానవ మేధస్సు నుంచి ఆవిష్కృతమైన ఉత్పత్తి. యాజమాన్యాలు స్వాభావికంగా మేధో సంపత్తిపై గుత్తాధిపత్యాన్ని ఏర్పరచుకుంటాయి. 'మానవ ఉత్పాదనలలో అత్యుత్తమమైనది-జ్ఞానం, ఆలోచన. వాటిని సమాజానికి స్వచ్ఛందంగా అందివ్వాలి. ఇవి గాలి వలె ఉచితం' అంటాడు యుఎస్ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బ్రాండీస్. మేధో సంపత్తి ఏ ఒక్కరిదో కాదు...అందరిదీ. విజ్ఞానం మానవాళి ఉమ్మడి సొత్తు. ఇది జాతి సంపద. ఈ సంపత్తిని తమ ఖాతాలో వేసుకుని సమాజం మీద, ప్రజల మీద కొన్ని శక్తులు పెత్తనం చెలాయిస్తున్నాయి. నూతన ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులు పొందుతున్నాయి. సమాజంలో అవిష్కృతమైన ఏ విజ్ఞానమైనా అది సమాజం సొత్తుగానే భావించాలి. నేడా పరిస్థితి లేదు. ఏ నూతన ఆవిష్కరణకైనా ముడిసరుకు సమాజమే. సమాజంలోని అనేక వనరులను ఉపయోగించుకొని... తమ తెలివితేటలు, విజ్ఞానంతో నూతన ఆవిష్కరణను సృష్టించగలుగుతారు. ఈ ఆవిష్కరణకు సమాజ వనరులు అనేకం తోడ్పడతాయి. ఆ విషయాన్ని మరుగుపరచి... అంతా నేనే సాధించాను గనుక దానిపై పేటెంట్ హక్కులు నావే అనే ధోరణిని ముందుకు తెస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. కరోనాని ఓడించడం కోసం ప్రపంచమంతటా ప్రజలకు వ్యాక్సినేషన్ చేయాల్సివుంది. కానీ అలా చేయలేదు. కేవలం పేటెంట్ పేరుతో లాభం కోసం అమెరికా నాయకత్వంలోని సంపన్న దేశాలు టీకాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని, సాంకేతికతను పంచుకునేందుకు నిరాకరించడం ద్వారా బడా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించాయి. అందరూ సురక్షితంగా వుండేవరకు ఎవరూ సురక్షితంగా వుండరు అని డబ్ల్యుహెచ్‌వో చెప్పింది. అలా వుండకూడదంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ విషయం నిర్థారణ అయిన తర్వాత కూడా పేటెంట్ హక్కుల పేరిట టీకాలు ఇవ్వలేదు. పైపెచ్చు సంపన్న దేశాల కంటే మూడు నాలుగింతలు అత్యంత వెనుకబడిన దేశాల అవసరంలో 3-4 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ అయిన పరిస్థితి. ప్రపంచ జనాభాలో కోవిడ్ మొదటి డోసు తీసుకున్నవారి శాతం కనీసం 8 శాతం మించలేదు. కోవిడ్ టీకాలు తీసుకున్నవారిలో 80 శాతం మంది మొదటి పది సంపన్న దేశాలకు చెందినవారే. విజ్ఞానాన్ని ఉపయోగించుకోడానికి ఎలాంటి బంధనాలూ వుండకూడదు. ఏ రంగానికి చెందిన ఆవిష్కరణలోనైనా కొంతమంది వ్యక్తుల పాత్ర వుండివుండొచ్చు. ఆ పాత్రను శ్లాఘించనూవొచ్చు. అందుకోసం వారికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వొచ్చు. అంతేగాని ఒక ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు కాబట్టి దానిపై పూర్తి హక్కు నాదే అనడానికి లేదు. 1970 పేటెంట్ చట్టం ప్రకారం... ఉత్పత్తి మీద కాకుండా ఉత్పత్తి విధానం మీద భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. తద్వారా మన దేశంతోపాటు ప్రపంచ దేశాలకు కూడా మందులను చౌకగా అందించగలిగాం. అదేవిధంగా వెనకబడిన దేశాల్లోని పేదలకు, సామాన్యులకు ప్రయోజనం కలిగేవిధంగా విజ్ఞానం ఉపయోగపడాలి. అంతేతప్ప ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. అలాగైతే... నిప్పును కనిపెట్టిన ఆదిమానవులకు పేటెంట్ హక్కులు వున్నాయా? విద్యుత్, చక్రం వంటివాటిని కనిపెట్టిన వారు మేధో సంపత్తి హక్కులు పొందివుంటే సమాజం ఈ దశకు చేరేదా? ఏ ఒక్కరి వలనో ప్రత్యేక ఆవిష్కరణ ఏదీ సాధ్యపడదు. ప్రతి ఆవిష్కరణలోనూ మానవాళి సమిష్టి భాగస్వామ్యం, వనరులు ఇమిడి వుంటాయి. శాస్త్ర పరిజ్ఞానంపై గుత్తాధిపత్యం సాధించేందుకు కార్పొరేట్లు ఆవిష్కరించిన దోపిడీ విధానాల్లో ఈ 'పేటెంట్' ఒకటి. పేద, మధ్య తరగతి దేశాలను నిలువు దోపిడీ చేసే ఎత్తుగడలో ఇదొకటి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న యువత తమ శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను ఉపయోగించి మెరుగైన భవిష్యత్ వైపునకు మళ్లడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఆవిష్కరణ, సృజనాత్మకతలను ప్రోత్సహించడంలో భాగంగా మేధో సంపత్తి హక్కుల గురించి తెలియజేయాలనే దృష్టితో ఈ ఏడాది 'ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం' సందర్భంగా 'మెరుగైన భవిష్యత్ కోసం ఆవిష్కరణ' అనే థీమ్‌ను ఎంచుకున్నారు. ఇది యువత లోని సృజన, మేధస్సు స్వేచ్ఛగా ఈ ప్రపంచం ముందు ఆవిష్కృతం కావడానికి ఉపయోగపడతాయని భావిద్దాం.