మనది లౌకిక రాజ్యం. దాన్ని పునాదులతో సహా ధ్వంసం చేసేందుకు బిజెపి బుల్డోజరు రాజకీయాలను నడుపుతున్నది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ తరహా ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి చేస్తున్నది. రాష్ట్ర ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి. ఈ మధ్య కాలంలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శోభాయాత్ర వంటి పేర్లతో భక్తులను సమీకరించి పరమత ద్వేషాన్ని, మైనార్టీ వ్యతిరేకతను నూరిపోసేందుకు ప్రయత్నించారు. రాజకీయ పొత్తు పేరుతో జనసైనికుల్ని పావులుగా మార్చుకుంటున్నది. ఈ యాత్రలలో వైసిపి, టిడిపి నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు. మతాన్ని రాజకీయాలకు ముడివేసి లబ్ధి పొందాలన్న బిజెపి కుయత్నాలకు వైసిపి, టిడిపిలు కూడా తమ వంతు దోహదపడుతున్నాయి. గత వారం రోజులుగా అమలాపురం ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోనసీమ జిల్లాకు డా|| బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా కొన్ని స్వార్ధ రాజకీయ శక్తులు అగ్రకుల దురహంకారాన్ని రెచ్చగొట్టి అశాంతిని సృష్టించాయి. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళపై దాడికి దిగారు. బస్సులను తగులబెట్టారు. సామాన్య ప్రజల్లో భయోత్పాత వాతావరణాన్ని సృష్టించారు. ఇల్లు తగలబడుతుంటే చుట్ట కాల్చుకున్న చందంగా మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు దేనికది స్వీయ లబ్ధి కోసం తాపత్రయ పడుతున్నాయి. దీనివల్ల ప్రజలకు, రాష్ట్రానికి జరిగే హానిని అవి గుర్తించడం లేదు. పరస్పరం నిందలు వేసుకుంటూ అసలు దోషిని వదిలేస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల్లో చాప కింద నీరు లాగా బిజెపి, సంఘపరివారం విషపు కోరలు చాచుకుంటూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సాగిన హింసాత్మక కార్యకలాపాల్లో కుల దురహంకారులను రెచ్చగొట్టి అసాంఘిక శక్తులను చేరదీసి పథకాన్ని నడిపింది బిజెపినే. కొంతమంది అగ్రకుల నాయకులు, వైసిపి, టిడిపి, జనసేన పార్టీల లోని అసమ్మతివాదులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా దీని వెంట కొట్టుకుపోయింది. గోదావరి అంటేనే మర్యాదలకు మారు పేరు. బిజెపి ఆ మర్యాదను మంటగలుపుతోంది. బిజెపిని దూరం పెడితేనే గోదావరి ప్రజలు ఆ ప్రాంత ప్రతిష్టను నిలబెట్టగలుగుతారు.
అమలాపురం ఘటనల్లో మతోన్మాదం, అగ్ర కుల దురహంకారం పెనవేసుకుని నడుస్తున్నాయి. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని బిజెపి మొదటి నుండి వ్యతిరేకిస్తున్నది. సోషల్ ఇంజనీరింగ్ పథకంలో భాగంగా దళితులకు వ్యతిరేకంగా మిగతా కులాలను కూడగట్టే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా ద్వారా అపోహలు సృష్టించే తప్పుడు ప్రచారాన్ని సాగించింది. వారి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా గ్రామాలు తిరిగి చలో అమలాపురానికి సమీకరించారు. తమ మతోన్మాద రాజకీయాలకు కులాన్ని ఒక సాధనంగా మార్చుకున్నారు. 25వ తేదీ ఘటనలతో వారి నాటకం బట్టబయలైంది. రాష్ట్రంలో గాని, అమలాపురం ప్రాంతంలో గాని బిజెపి ఎక్కడుందీ, ఏం చేయగలుగుతుందీ అని కొంతమంది అడుగుతున్నారు. మంత్రి అనుచరులే ఈ గొడవలకు కారణం అని కూడా వాదిస్తున్నారు. వైసిపి కుట్రగా కొందరు దీన్ని అభివర్ణిస్తుంటే పోలీసు వైఫల్యంగా మరికొందరు భావిస్తున్నారు. వీటన్నింటిలోను ఎంతోకొంత వాస్తవం ఉండవచ్చు. కానీ కీలకమైన అంశం సంఘపరివారం రూపొందించిన వ్యూహం. అగ్రకుల యువతలో పెల్లుబుకుతున్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బయటకొస్తాయి. మతోన్మాద శక్తి ఎంత బలమైందీ అన్నది ముఖ్యం కాదు. ఎంత ప్రభావం చూపుతున్నది అన్నది ముఖ్యం. కనపడని దాని కోరల నుండి వెదజల్లుతున్న విషం అందరి మెదళ్ళకు ఎక్కించింది. భావోద్రేకాలను రెచ్చగొట్టింది. చివరకు అదే ఒక భౌతిక శక్తిగా మారింది. గతంలో అనేక ఘటనల్లో బిజెపి కుట్రపూరిత పథకాలు బట్టబయలయ్యాయి. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని పెద్ద హడావిడి చేశారు. ఆఖరికి వాళ్ళే మెట్ల మీద సిలువను పెట్టించి వివాదాన్ని రేపారని రుజువైంది. ఇటీవల కాలంలో గుంటూరులో జిన్నా టవర్‌ను వివాదాస్పదం చేయడానికి పెద్ద ప్రయత్నం చేశారు. గుంటూరు పట్టణ ప్రజలు జిన్నా టవర్‌ను తమ వారసత్వ చిహ్నంగా భావించడంతో వారి ఆటలు సాగలేదు. శోభాయాత్ర పేరుతో నెల్లూరులో, మసీదు వివాదం పేరుతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో విద్వేషాలను, హింసను రెచ్చగొట్టారు. రాష్ట్రంలో కనకదుర్గ దేవాలయం మొదలుకొని అంతర్వేది వరకూ వివిధ దేవాలయాలకు అపచారం జరిగినట్లుగా, విధ్వంసాలు జరిగినట్లుగా ప్రచారం చేసి హిందువుల్లో భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. రాష్ట్రానికి తాము చేసిన ద్రోహం చర్చకు రాకుండా, ప్రజలపై మోడీ వేస్తున్న భారాలపై ఆందోళన చెలరేగకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మతాన్ని, భక్తిని దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి ప్రతిగా కొంతమంది ముస్లిం యువకులు ఉగ్రవాద భావాలకు లోనై ప్రతీకార చర్యలకు దిగడం పరస్పర మతోన్మాద ప్రోత్సాహానికే తోడ్పడుతుంది. రాష్ట్రంలో క్రిస్టియన్ రాజ్యం ఉన్నట్లు, దానికి వ్యతిరేకంగా హిందువులంతా ఒకటి కావాలన్నట్లు ప్రచారం చేస్తున్నారు. దళితుల్లో ఎక్కువ భాగం క్రిస్టియన్లు కాబట్టి అంబేద్కర్ పేరు పెడితే దళితులకు కొమ్ములొస్తాయని, దానివల్ల క్రైస్తవ మతం పెరుగుతుందని, హిందూ మతానికి అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో హోరెత్తిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఏ మతం, ఏ కులానికి చెందినవాడనేదాన్ని బట్టి ప్రభుత్వ స్వభావం ఆధారపడి ఉండదు. మనది లౌకిక రాజ్యం. దాన్ని పునాదులతో సహా ధ్వంసం చేసేందుకు బిజెపి బుల్డోజరు రాజకీయాలను నడుపుతున్నది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ తరహా ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి చేస్తున్నది. రాష్ట్ర ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి. ఈ మధ్య కాలంలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శోభాయాత్ర వంటి పేర్లతో భక్తులను సమీకరించి పరమత ద్వేషాన్ని, మైనార్టీ వ్యతిరేకతను నూరిపోసేందుకు ప్రయత్నించారు. రాజకీయ పొత్తు పేరుతో జనసైనికుల్ని పావులుగా మార్చుకుంటున్నది. ఈ యాత్రలలో వైసిపి, టిడిపి నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు. మతాన్ని రాజకీయాలకు ముడివేసి లబ్ధి పొందాలన్న బిజెపి కుయత్నాలకు వైసిపి, టిడిపిలు కూడా తమ వంతు దోహదపడుతున్నాయి. బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలని వైసిపి, టిడిపిలు కూడా ప్రయత్నిస్తున్నాయి. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా వైసిపి, టిడిపిల మధ్య ఉండే రాజకీయ వైరుధ్యాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఉపయోగించుకుంటోంది. రాష్ట్రానికి ఏమైనా పర్వాలేదు. అవతలివాడు నాశనం కావాలన్న వైఖరితో ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నేడు ఆ పార్టీల వైఖరే బిజెపి బలం. ఈ రెండు పార్టీల్లో ఉన్న సామాజిక శక్తులను తమ వైపు లాక్కుని లాభపడాలని బిజెపి కుతంత్రం. అనేక రాష్ట్రాల అనుభవాలు పరిశీలించినా ప్రాంతీయ పార్టీలను ఉపయోగించుకుని వాటి ఉనికినే దెబ్బ తీసిన చరిత్ర బిజెపిది. మన రాష్ట్రం లోని ప్రాంతీయ పార్టీలు తమ తక్షణ రాజకీయ ప్రయోజనం కోసం, ప్రత్యర్ధిని దెబ్బ తీయడం కోసం బిజెపిపై ఆధారపడుతున్నాయి. ఈ వాతావరణాన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. రాష్ట్రంలో ఏ చిన్నపాటి కుల, మత ఘర్షణలు జరిగినా గోరంతను కొండంతలు చేసి రాజకీయ ఎజెండాగా తెరమీదకు తెస్తున్నది. వైసిపి, టిడిపిలు దానికి వంత పాడుతున్నాయి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసినా, విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేసినా ఈ పార్టీలు పల్లెత్తు మాట అనడం లేదు. పైగా బిజెపి చేసే పాపాలను కూడా ఈ రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి రుద్దుకుంటున్నాయి. ఆ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపికి రెండు పార్టీలు కొమ్ములు తెస్తున్నాయి. బిజెపి శక్తి చిన్నదే కావచ్చు. కానీ అది చిమ్మే విషంతో రాష్ట్రానికి జరిగే హానిని తక్కువ అంచనా వేయరాదు. అభ్యుదయ శక్తులు, పురోగమన వాదులు కూడా మన రాష్ట్రంలో ఈ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. వైసిపిని అధికారంలో నుండి దింపేయాలన్న తాపత్రయంతో తెలుగుదేశం, తెలుగుదేశానికి ఉన్న సీట్లు కూడా లేకుండా చేయాలన్న కక్షతో వైసిపి వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాదకరంగా చొచ్చుకువస్తున్న బిజెపి ప్రమాదాన్ని ఈ రెండు పార్టీలు తక్కువ అంచనా వేస్తున్నాయి. దళితులకు, మైనారిటీలకు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపిని భుజాన మోయడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. బిజెపిని అంటిపెట్టుకుని వీరు ప్రజల్ని ఎలా రక్షించగలుగుతారు? దాన్ని సరిదిద్దుకోకపోతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. వైసిపిలో ఉంటూ బిజెపికి సహకరిస్తున్న శక్తుల పట్ల వైసిపి నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తాయో తేల్చుకోవాలి. ఒకవైపు అల్లర్లకి నాయకత్వం వహించిన బిజెపి నాయకులపై కేసులు పెడుతూనే మరోవైపు బిజెపి సాగిస్తున్న దుష్ట పన్నాగాలను బహిరంగంగా వెల్లడించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. బిజెపి వినాశకర పాత్రను గుర్తించకుండా వైసిపిపై దాడి చేయడానికే టిడిపి పరిమితమవుతోంది. వైసిపికి వ్యతిరేకంగా బిజెపితో సహా అన్ని పార్టీలు కలవాలని టిడిపి అంటోంది. ఈ వైఖరి తెలుగుదేశం కన్నా బిజెపికే ఎక్కువ లాభం. గత అనుభవం కూడా అదే. 2019కి ముందు తెలుగుదేశం బిజెపితో అంటకాగిన ఫలితంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆఖరి దశలో బిజెపితో తెగదెంపులు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు తిరిగి బిజెపితో సన్నిహితం కావాలని తాపత్రయపడుతోంది. అది ఆత్మహత్యాసదృశ్యం. ప్రస్తుతం జరుగుతున్న తెలుగుదేశం మహానాడులోనైనా వారి విధానాలపై పునరాలోచన చేసుకుంటారని ఆశిద్దాం. బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల దురహంకారాన్ని రెచ్చగొట్టే దాని విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా వైసిపి, టిడిపిలు రెండూ ముందుకు రావాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి బలాబలాలను వారు తేల్చుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమైక్యత కోసం మతోన్మాదంపై పోరాటానికి ఈ రెండు పార్టీలు ముందుకు రావాలి. మన రాష్ట్రంలో బిజెపి విద్రోహాన్ని ఎండగట్టడంలో వామపక్షాలు ముందుంటున్నాయి. ఇది గిట్టని బిజెపి వామపక్షాలపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నది. ప్రమాదకరమైన బిజెపి మతోన్మాదంపై పోరాడుతున్నందుకు కొన్ని పార్టీలు వామపక్షాలను, ప్రత్యేకించి సిపిఐ(ఎం)ను విమర్శిస్తున్నాయి. వైసిపికి అనుకూలమని ముద్ర వేస్తున్నాయి. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీలంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే. బిజెపికి వ్యతిరేకంగా పోరాడకుండా వైసిపి విధానాలను నిలువరించలేం. బిజెపి మతోన్మాద రాజకీయాలను నిరోధించడం, ఓడించడంతోపాటు వైసిపి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఏకకాలంలో పోరాడే విధానాన్ని సిపిఐ(ఎం) తీసుకున్నది. అందువల్లనే అమలాపురం ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూనే అసలు దోషి బిజెపిని ప్రజల ముందు నిలబెట్టింది. వ్యాసకర్త : సిపిఎం ఎ.పి కార్యదర్శి వి. శ్రీనివాసరావు