ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు ప్రజానీకాన్ని కలవ రపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. జులై నెలతో పోలిస్తే ఇది 0.21 శాతం ఎక్కువ. ఆ నెలలో 6.71 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. దేశ వ్యాప్తంగా తిండిగింజలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆగస్టులో చుక్కలను దాటాయి. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ) ప్రకారం ఆగస్టులో నిత్యావసర వస్తువుల ధరలు 7.62 శాతం పెరిగాయి. బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెల సంగతి అలా ఉంచితే (ఇవి కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి) ఆగస్టు నెలలో ఆలుగడ్డలు, టమోటా, నిమ్మకాయలు, అరటి, వంకాయల వంటి కూరగాయాలతో పాటు పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఆలుగడ్డలు 40.32 శాతం మేర, టమోటాలు 16.51 శాతం మేర, వంకాయలు 14.67 శాతం మేర పెరుగుదలను నమోదుచేశాయి. వస్తున్న ఆదాయానికి, అవుతున్న ఖర్చులకు పొంతన లేని పరిస్థితి ఏర్పడటంతో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజానీకం కూడా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, అది అంత ప్రాధాన్యతగల అంశం కాదని, అందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల కిందటే వ్యాఖ్యానించారు. పెరగుతున్న ధరలు జీవితాలను అతలాకుతలం చేస్తుంటే మంత్రి ఆందోళన పడాల్సిన అవసరం లేదనడం సాధారణ ప్రజల జీవితాలను అపహాస్యం చేయడమే !
నిజానికి నాలుగు శాతం వద్ద ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వాలకు ఆర్‌బిఐ సూచించింది. అదేసమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరు శాతం మించకుండా చూడాలని నిర్దేశించింది. అయితే, గడిచిన ఎనిమిది నెలలుగా ఆ మేరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మార్చి నెల తరువాత మొట్టమొదటిసారి ఏడు శాతం కన్నా తక్కువగా (6.71) ద్రవ్యోల్బణం జులైలో నమోదు కావడంతో పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర మంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ద్రవ్యోల్బణం ఒక్కటే ప్రభుత్వానికి రెడ్ లెటర్డ్ ప్రయారిటీ కాదని చెప్పిన ఆమె ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక ఉత్పత్తి పెంచడం వంటి అంశాలను ప్రస్తా వించారు. అయితే, ఆ రంగాల్లో పురోగతి ఏమాత్రం సాధించిఉన్నా ధరాఘాతానికి ప్రజలు విలవిలలాడే పరిస్థితి ఉండదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామీణ ప్రాంతాలలో జులై నెలలో 6.8 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టుకు 7.15 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో 6.49 శాతం నుండి 6.72 శాతానికి పెరగడమే మంత్రి మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం.
ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే పేరిట ఇప్పటికే అనేకసార్లు వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బిఐ తాజాగా అదే విన్యాసాన్ని మరోమారు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన జరిగే ద్రవ్య విధాన సమీక్షలో 35 నుండి 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్టే! ఈ చర్యతో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే సంగతి ఎలా ఉన్నప్పటికీ బ్యాంకుల్లో తీసుకున్న వివిధ రకాల రుణాలపై వడ్డీలు, నెలవారి కిస్తీ (ఇఎంఐ)లు భారీగా పెరుగుతున్నాయి. ధరాభారానికి ఈ అదనపు భారం కూడా తోడవుతుండటంతో సామాన్యులు సతమతమవు తున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, ధరలను నియంత్రించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచాలి. ఆహారధాన్యాల ధరలను అదుపులో ఉంచాలి. పేదలను కొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలకు తక్షణం స్వస్తి పలకాలి.