''రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మన సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరిదీ ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరిస్తున్నామా? ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితం? ఈ అసమానతలను వీలైనంత త్వరగా అంతం చేయాలి.'' - డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, 1950 జనవరి 26. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే అని అత్యున్నత న్యాయస్థానం గత సోమవారం తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గరు అనుకూలంగాను, మరో ఇద్దరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా వున్నారు. ఈ రిజర్వేషన్లు పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక ప్రాతిపదిక సమంజసమేనా? ఇది నిజంగా అగ్రకులాల్లోని అర్హులకా? అనర్హులకా? ప్రభుత్వ రంగం పెద్దఎత్తున ప్రైవేటీకరించబడుతున్న ఈ స్థితిలో రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఎంత? అగ్ర కులాల్లో కాని, మొత్తం సమాజంలో కాని ఆర్థిక, సామాజిక అణచివేతకు కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే చర్చనీయాంశం అయ్యాయి. 2019 నుండి పెండింగ్‌లో వున్న ఈ సమస్యపై కొద్ది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తీర్పు రావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమీలేవు అనుకోగలమా?
బిజెపి నాయకత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 2019 జనవరిలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక వెనుకబాటు తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఈ పది శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. సామాజిక అసమానత ప్రాతిపదికగా వున్న రిజర్వేషన్లను, ఆర్థిక అసమానత ప్రాతిపదికగా కూడా అమలు చేయవచ్చు అని ఈ తీర్పు ప్రకటించింది. అగ్రకులాల్లో వుండే పేదలకు ప్రత్యేక సదుపాయం కల్పించడం సరైందే. నిజంగానే ఆ ఆర్థిక వెనుకబాటును రూపుమాపాలనుకుంటే ప్రస్తుతం పాలకులు అమలు చేస్తున్న అనేక విషయాల్లో మౌలిక మార్పులు రావాలి. అది చేయకుండా కేవలం రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఏదో పరిష్కరిస్తున్నామంటే అది పేదలను చీల్చడానికి, వారి ఐక్యతను దెబ్బ తీసి మరింత కాలం ఆర్థిక, సామాజిక అణచివేతను కొనసాగించడానికి పాలక వర్గాలు చేస్తున్న కుట్రగా భావించాలి. కార్పొరేట్ అనుకూల, మతోన్మాద విధానాలు అమలు చేస్తున్న కేంద్ర పాలకులు నిత్యం ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించే ఎత్తులు వేస్తూనే వున్నారు.
హిందూత్వ శక్తులు - రిజర్వేషన్లు. మనుధర్మం ఆధారంగా చాతుర్వర్ణ వ్యవస్థ భావజాలంతో దేశాన్ని పాలిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలకు సామాజిక ప్రాతిపదికన రిజర్వేషన్లు వుండడం మొదటి నుండి ఇష్టం లేదు. సామాజిక అసమానతలు గుర్తిస్తే అసమానతలకు కారణాలను విశ్లేషించాలి. అప్పుడు హిందూత్వ నగరూపాన్ని ప్రజలు గుర్తిస్తారు. అందుకే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదనేది హిందూత్వ శక్తుల వాదన. అనాగరిక భావజాలంతో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి, అనేక ద్వంద్వ ప్రమాణాలతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న ఆర్‌ఎస్‌ఎస్... కుల వ్యవస్థను కొనసాగిస్తూనే మత రాజ్యాన్ని స్థాపించాలనుకుంటుంది. ఒకే మతం, ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలతో ప్రజల మద్దతును పొందాలనుకుంటుంది. మరోవైపు భారత రాజ్యాంగం వారి భావజాల విస్తరణకు ఆటంకంగా వుంది. అందుకే వారు రాజ్యాంగంపై, అందులోని కీలక అంశాలైన లౌకికతత్వం, ఫెడరల్ వ్యవస్థ, సామాజిక న్యాయం, శాస్త్ర విజ్ఞాన పరిశోధన లాంటి వాటిపై అనేక రూపాల్లో దాడులు చేస్తున్నారు. అనేక తరాలుగా హిందూత్వ భావజాలంతో తీవ్రమైన సామాజిక అణచివేతకు గురైన దళితులు, ఉపశమనం కోసం మతం మారితే వారికి దళిత రిజర్వేషన్లు అమలు చేయరాదని మత కోణం నుండే బిజెపి వాదిస్తున్నది. 'మానవులంతా సమానంగా గుర్తించబడలేదు' అని మనుధర్మశాస్త్రం 1వ స్మృతి- 31వ శ్లోకం చెబుతుంది. అలాగే 'అగ్రవర్ణాలకు సేవ చేయడం శూద్రుల బాధ్యత, శూద్ర కులాలు చదవకూడదు, శూద్రులు వేదం వింటే చెవుల్లో సీసం కాసి పోయాలి, వేదం పలికితే నాలుక కత్తిరించాలి' ఇలాంటి అనేక భాష్యాలతో శూద్ర, అతి శూద్ర కులాలను బానిసలుగా చేసుకొని ఆర్థికంగా దోచుకుంటూ, సామాజికంగా అణచివేసి, చదువుకు, విజ్ఞానానికి శ్రమజీవులను దూరం చేసింది అగ్రవర్ణ బ్రాహ్మణాధిపత్యం.
వందేళ్ళకు పైబడ్డ రిజర్వేషన్ల చరిత్ర. దేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలించే క్రమంలో వారి వ్యాపార ప్రయోజనాల కోసమైనా ప్రజలకు చదువు చెప్పాల్సి వచ్చింది. పరిమిత విజ్ఞానాన్నయినా శ్రామిక జనం పొందే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సమాజం నుండి సాంఘిక సమానత్వ అంశం ముందుకు వచ్చింది. 1882లో హంటర్ కమిషన్ ముందు జ్యోతిరావ్ పూలే హాజరై శూద్ర, పంచమ కులాలకు విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు ఉండాలని వాదించారు. 1902లో మహారాష్ట్ర లోని కొల్హాపూర్ సాహు మహారాజ ఆస్థానంలో బ్రాహ్మణేతరులకు విద్యా, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ఆధారాలు వున్నాయి. దక్షిణ భారతదేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న క్రమంలోనే విద్యా, ఉపాధి కోసం పోరాటాలు జరిగాయి. గురజాడ, కందుకూరి, ముఖ్యంగా పెరియార్ ఇ.వి. రామస్వామి నాయర్ నడిపిన అనేక పోరాటాల వల్ల నాటి మద్రాసు రాష్ట్రంలో ఎస్.సి, ఎస్.టి, క్రిస్టియన్లతో సహా వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. బి.సి ల సమస్యలపై దేశంలో మొదటి సారిగా 1921లో నియమించిన మిల్లర్ కమిటీ మైసూర్ సంస్థానంలో, 1935లో కేరళ ప్రాంతంలోని ట్రావెన్‌కోర్ సంస్థానంలో ఈ రకమైన రిజర్వేషన్ సదుపాయాలు కల్పించాల్సి వచ్చింది.
స్వాతంత్య్రానంతరం... జాతీయోద్యమంలో భాగంగా ప్రజలు ఒకవైపు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే, మరోవైపు దేశంలోని కులవివక్ష, వెట్టిచాకిరి, ఆర్థిక దోపిడి లాంటి రుగ్మతలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు సాగించారు. సహజంగానే వీటిలో కమ్యూనిస్టులు, మానవతావాదుల చొరవ కీలకంగా వుంది. తరతరాలుగా అణచివేతకు, సాంఘిక వివక్షకు గురైన అత్యధికమంది ప్రజలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ద్వారానే దేశం అభివృద్ధి సాధించగలదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఈ నేపథ్యం నుండే స్వాతంత్య్రానంతరం సామాజిక రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పించారు. ఇలా పది సంవత్సరాలు ప్రత్యేక అవకాశాలు కల్పించడం ద్వారా సాంఘిక సమానత్వం సాధించడానికి తోడ్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భూస్వామ్య భావజాలం, మనువాద సిద్ధాంతం బలంగా తలలో నింపుకున్న శక్తులు ప్రారంభం నుండే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చారు. రిజర్వేషన్లు రాజ్యాంగం లోని ఆర్టికల్ 15(1)కి వ్యతిరేకమని 70 ఏళ్ళ క్రితమే కోర్టుకు వెళ్లారు. రాజ్యాంగం లోని సమాన సూత్రాలకు రిజర్వేషన్లు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేయాల్సి వచ్చింది. భూ సమస్యను పరిష్కరించి, ప్రభుత్వ రంగాన్ని విస్తరింపచేయాల్సిన పాలకులు గ్రామీణ భూస్వామ్య వర్గంతో పెట్టుబడిదారులు రాజీపడి సామాజిక, ఆర్థిక అణచివేతను కొనసాగించారు.
రిజర్వేషన్లు అవసరం లేదా? సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించేవరకు రిజర్వేషన్లు అవసరం. 75 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా కులం పేరుతో దాడులు, అసమానతలు ఎదుర్కొంటున్న దళిత, గిరిజనులు అనేక రంగాల్లో వెనుకబడ్డారు. విద్య, ఉపాధిలో తీవ్ర అసమానతలకు గురౌతున్నారు. ఏదో ధర్మం చేసినట్లు జన సంఖ్యతో సంబంధం లేకుండా ఈ వర్గాలకు శాతాల లెక్కన రిజర్వేషన్లు ఇస్తున్నారు. చేతివృత్తులు, బలహీన కులాలకు చెందిన అత్యధిక మంది సామాజిక సేవారంగాల్లో పనిచేసేవారు. సాంకేతిక మార్పులు, ప్రభుత్వాల విధానాలు వీరి పరిస్థితిని తీవ్రంగా దిగజార్చాయి. బి.సి రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించాలని అనేక పోరాటాలు జరిగాయి. 1976లో జనతా ప్రభుత్వం బి.పి.మండల్ అధ్యక్షతన వేసిన కమిషన్ సిఫార్సుల ఆధారంగా జనతాదళ్ ప్రభుత్వం 1990 ఆగస్టు 17న బి.సి కులాలకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. దీన్ని సహించలేని ఆర్‌ఎస్‌ఎస్, సంఘపరివార్ సంస్థలు మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్ ను లేవదీశారు. రథయాత్రలు, ఏక్‌తా యాత్ర, అయోధ్య రామమందిరం పేర్లతో మతోన్మాద చర్యలు చేపట్టారు. దేశమంతటా ముఖ్యంగా విద్యాలయాల్లో హింసను రెచ్చగొట్టారు.
ఓబిసి రిజర్వేషన్లు - వైద్య కళాశాలల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నీట్) అమలు చేయాలని 2016లో సుప్రీంకోర్టు చెప్పింది. ఈ అడ్మిషన్లల్లో 15 శాతం అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు, 50 శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు అఖిల భారత కోటాకు ఇవ్వాలని ఈ తీర్పు ప్రకటించింది. ఇది నేరుగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. ఈ విధానం రాజ్యాంగంలోని ఫెడరల్ విధానానికే వ్యతిరేకం.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు - విద్యా, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ రంగానిది కీలక పాత్ర వున్న కాలంలో రిజర్వేషన్ల ప్రయోజనం కొద్దిమేరకైనా వుండేది. ప్రైవేటీకరణ ఒక ప్రళయంలాగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఎంత మేరుకు ఒడ్డుకు ఎక్కించగలవు? ప్రభుత్వ పెట్టుబడి, ప్రభుత్వ రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ రక్షణ లాంటి అనేక సదుపాయాలు పొందుతున్న కార్పొరేట్ సంస్థలు రిజర్వేషన్లు కలిపిస్తే ప్రతిభ దెబ్బ తింటుందనే చిలుక పలుకులు పలుకుతున్నాయి. బయటకు కనిపించే నాగరికత అంతా సామాజిక, ఆర్థిక అసమానతల ముందు దిష్టిబొమ్మ లాగా మారుతుంది. దీని నుండి బయట పడడానికి ఒక ఉపశమనంగా రిజర్వేషన్లను వివిధ తరగతులు కోరుకుంటున్నాయి. పాలకుల విధానాల వల్ల ఏర్పడి, కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక అణచివేతకు ఈ రిజర్వేషన్లు మాత్రమే పరిష్కారం కాదు. అసమానతలకు, దోపిడికి గురౌతున్న శక్తుల మధ్య ఐక్యత పెంచడం, సర్వ సమస్యలకు మూలమైన వ్యవస్థ సమూల మార్పుకోసం పోరాడడం ద్వారానే విముక్తి సాధించగలం. అందుకు ప్రగతిశీల శక్తులు కృషి చేయడమే పరిష్కారం.