ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు ఉపాధ్యాయ దినోత్సవ శుభకాంక్షలు

 ప్రభుత్వ విద్యాలయాలలో పేద విద్యార్థులను నాణ్యంగా తీర్చి దిద్దేందుకు ఉపాధ్యాయ లోకం చేస్తున్న కృషిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం వల్ల నేడు విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని పేర్కొన్నారు. దీనిస్థానంలో శాస్త్రీయ విద్యా విధానం రావాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య నందించాలని కోరారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలుండాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య అన్యోన్య బంధం బలపడాలని కోరుకుంటున్నానని వివరించారు. ఉపాధ్యాయులు సిపిఎస్‌కు వ్యతిరేకంగా ఒపిఎస్‌ పునరుద్ధరణ కోసం పోరాడుతున్నందున వారికి సిపిఎం తరుపున సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగానైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కోర్కెల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు.