ఎర్రజెండాతోనే ఏజెన్సీ అభివృద్ధి సాధ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఉద్ఘాటించారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తోన్న ప్రజా, కార్మిక, గిరిజన వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలతో తిప్పికొడతామని పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివాసీ అరణ్యఘోష బహిరంగ సభ ఆదివారం జరిగింది. రంపచోడవరం కేంద్రంగా మరో ఏజెన్సీ జిల్లా ఏర్పాటు చేయాలని, ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ సభకు వేలాది మంది గిరిజనులు ఎర్రజెండాలు చేబూని తరలివచ్చారు. దీంతో, రంపచోడవరం ఎరుపెక్కింది. సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గన్న బివి.రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు గిరిజనులను తీవ్రంగా నష్టపర్చే విధానాలను అవలంబిస్తోందన్నారు. అటవీ హక్కుల చట్టానికి సవరణ చేసి ఆదివాసీలకు తీరని ద్రోహం చేసిందని తెలిపారు. మైనింగ్ చట్టానికీ సవరణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో వామపక్షాలు అనేక పోరాటాలు చేసి యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చేసిన చట్టాలను నేడు బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ గిరిజన హక్కులను కాలరాస్తోందన్నారు. అడవులు, కొండలపై హక్కు లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యలను యావత్తు గిరిజనం ప్రతిఘటించాలని కోరారు. వారికి సిపిఎం అండగా ఉంటుందన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. అధికారంలో ఉన్న వైసిపి ఈ విషయమై ప్రశ్నించకుండా బిజెపికి వంతపాడుతూ గిరిజనులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఆదివాసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఏజెన్సీలో గిరిజన యువత సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువై వలసలు పోతోందని తెలిపారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే కుట్రలు జోరుగా సాగుతున్నాయని, వీటిని గిరిజనులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మణిపూర్‌లో ఆదివాసీల మధ్య బిజెపి ఎలాంటి ఘర్షణలు సృష్టించిందో వివరించారు. ఆ చిచ్చులో వేలాది మంది ఆదివాసీలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో ఇండియా వేదిక బలపడుతుండడంతో బిజెపి భయపడి కుట్రలకు దిగుతోందని విమర్శించారు. బిజెపి డైరక్షన్‌లో వెళ్లి వైసిపి ప్రభుత్వం నేడు చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పటికీ.. బిజెపిని టిడిపి పల్లెత్తు మాట్లాడే ధైర్యం చేయడం లేదన్నారు. గత టిడిపి, నేటి వైసిపి ప్రభుత్వాల వల్ల పోలవరం నిర్వాసితులకు అన్యాయమే జరిగిందన్నారు. నిర్వాసితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాకే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక హోదా సహా ఇతర హక్కుల కోసం తాము పోరాడుతున్నామన్నారు. పెట్టుబడిదారులకు వత్తాసు పలికే బిజెపి, వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఆ పార్టీలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. గిరిజనులు, కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను అసెంబ్లీకి పంపడం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశముందన్నారు. ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలను దోచుకునే పార్టీలను ఈసారి ప్రజలు ఓడించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, ఎవి.నాగేశ్వరరావు, విఆర్.పురం ఎంపిపి కారం లక్ష్మి, విద్యార్థి సంఘం నాయకులు కె.ప్రసన్న కుమార్, సిపిఎం జిల్లా నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రాంబాబు, మట్ల వాణిశ్రీ, కుంజం సీతారామయ్య తదితరులు పాల్గన్నారు. సభ ప్రారంభానికి ముందు స్థానిక ఐటిడిఎ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గిరిజన నృత్యాలు ప్రజలను ఉత్సాహ పరిచాయి.