పోలీసు శాఖలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి.. సిపిఐ(యం)

పోలీసు శాఖలో 36.53 కోట్ల అవినీతి, అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ అనుబంధాన్ని తెలియజేస్తున్నది. అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

ఈ చలానాల పేరుతో ఆటో డ్రైవర్లు, వాహన వినియోగదార్ల ముక్కుపిండి, వేదింపులకు గురిచేసి వసూలు చేసిన మొత్తం అవినీతిపాలు కావడం గర్హనీయం. ప్రభుత్వం ఇప్పటికైనా చలానా వేదింపులు ఆపాలి.

గత ప్రభుత్వ హయాంలోనే గరిష్టంగా 2 కోట్లు విలువైన టెండరును ఒక్క రూపాయికే ఆ కంపెనీ టెండరు దాఖలు చేయడం, దానిని పోలీసు శాఖ నమ్మడం, వైసిపి ప్రభుత్వం ఆ కాంట్రాక్టుకు కొనసాగించడం ఆశ్చర్యంగా ఉంది. 2018 నుండి ఇప్పటి వరకు చలానాల ద్వారా వసూలైన సొమ్ము వేరే ఖాతాల్లోకి మళ్ళినా గుర్తించలేకపోవడం, ఆడిట్‌ నిర్వహణ లోపం ఉందని పోలీసు శాఖ ప్రకటించడం, అవినీతి దృష్టికి వచ్చినా వెంటనే స్పందించకపోవడం బాధ్యతారాహిత్యం.

రాష్ట్ర ప్రభుత్వం దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆటో డ్రైవర్లు, వాహన వినియోగదారులపై చలానా వేదింపులు ఆపాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.