ప్రజా సమస్యలే అజెండాగా నేటి నుండి ప్రజా రక్షణ భేరి జాతాలు

కరువును వదిలేసి రాజకీయ ప్రచారంలో మునిగిపోయిన ప్రభుత్వం 
తక్షణం కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి
ప్రజా రక్షణ భేరి పాటల సిడి, పోస్టర్‌, బుక్‌లెట్స్‌ ఆవిష్కరణలో వి శ్రీనివాసరావు
రాష్ట్రంలో కరువు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, భూ సమస్యలతో  ప్రజలు సతమతమవుతుంటే అధికారపార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రజాసమస్యలను గాలికి వదిలి రాజకీయ ప్రచారం కోసం బస్సు యాత్రలను చేపట్టడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. కరువును అధిగమించేందుకు, భూసమస్యలు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సమస్యలే అజెండాగా  తమ పార్టీ సోమవారం నుండి ప్రజా రక్షణ భేరీ పేరుతో ప్రచార జాతాలను చేపట్టిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ప్రజారక్షణ భేరీ ప్రచారజాతాలకు  సంబంధించి పాటల సిడి, పోస్టర్‌లతో పాటు  రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, మంతెన సీతారాం, సిహెచ్‌.బాబురావు, వి.ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడారు. కరువు, వెనుకబడిన ప్రాంతాల్లో పర్యటించేలా చేపట్టిన ప్రజారక్షణ భేరీ ప్రచార జాతాను  సిపిఎం కేంద్రకమిటి సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగుతుందని తెలిపారు.  కర్నూలు జిల్లా ఆదోని నుండి ప్రారంభమయ్యే ఈ ప్రజారక్షణ భేరీ జాతాను  సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ థావలే సోమవారం ప్రారంభిస్తారని తెలిపారు. 
రాష్ట్రంలో జూలైలోనే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కరువును అధిగమించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. పొరుగున వున్న కర్న్ణాటక ప్రభుత్వం కరువును ప్రకటించడంతోపాటు కేంద్రబృందాలను రప్పించి నివేదికలను కూడా తయారు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కరువు మండలాలను కూడా ప్రకటించకపోవడం బాధ్యతా రాహిత్యమన్నారు. వర్షాధారిత పంటలే కాదు ప్రాజెక్టుల కింద వున్న పంటలు ఎండిపోయాయని తెలిపారు బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయకట్టు సాగు అంతా ఎండిపోయిందన్నారు. కృష్ణా నది కిందే కాదు  గోదావరి నదీ కింద కూడా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తీవ్రమైన కరువు నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు పెరగకుండా ప్రజలకు  ఆహారభద్రత కల్పించేందుకు రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంట రుణాలను పూర్తిగా రద్దుచేసి కరువు రైతులకు ఉపశమనం కల్పించాలన్నారు.  
అలాగే సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ప్రారంభించే ప్రచారజాతాలో తనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర వుంటారని పేర్కొన్నారు. వి.వెంకటేశ్వర్లు ఈ యాత్రను సమన్వయం చేస్తారు. ఈ యాత్ర ప్రధానంగా పోలవరం నిర్వాసితులు, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యలపై సాగుతుందన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే 1/17, 5వ షెడ్యూల్‌లను తుంగలోతొగ్గి పోడు భూములను గిరిజనుల నుండి బలవంతంగా లాక్కుంటోందని విమర్శించారు. అలా లాక్కున్న భూములను ఇష్టానుసారంగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో  రెండు లక్షల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పోలవరం పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవాలనుకోవడం సరైంది కాదన్నారు. కేంద్రంపై ఒత్తిడిని తెచ్చి తక్షణం పోలవరం నిర్వాసితులకు పునరావాస చర్యలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
మరో ప్రచారజాతా శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ప్రారంభమై  కోస్తా పారిశ్రామిక కారిడార్‌ గుండా సాగుతుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం ఆధ్వర్యంలో కొనసాగే ఈ జాతాను  ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ ప్రధానకార్యదర్శి విజు కృష్ణన్‌ ప్రారంభిస్తారని మంతెన సీతారం సమన్వయం చేస్తారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, అసంఘటిత రంగకార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కనీసవేతన చట్టాన్ని అమలు చేయాలని తదితర సమస్యలతో ఈ ప్రచారజాతా సాగుతుందన్నారు.  ఒపిఎస్‌ అమలు చేసే అంశంలోగాని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే అంశంలోగాని, అసంఘటిత రంగకార్మికులకు, ఉద్యోగులకు కనీసవేతనాన్ని అమలు చేసే అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఈ జాతా వ్యవసాయదారులు,  కౌలు రైతులను కలుసుకొని సమస్యల గురించి చర్చిస్తుందని తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు.
రాష్ట్రంలో  మూడు భిన్నమైన ప్రాంతాలనుండి బయలుదేరే ఈ ప్రచారజాతాలన్నీ విజయవాడకు చేరుకుంటాయని నవంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రచార జాతాలన్నీ అసమానతల్లేని అభివృద్ధికోసం నినాదంగా సాగుతున్నాయన్నారు. ప్రజాసమస్యలు, కరువు, రాష్ట్రాభివృధ్దే అజెండాగాముందుకు తెస్తాయని ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.