కా॥ ఎన్‌. శంకరయ్య మృతికి నివాళులు

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 16 నవంబర్‌, 2023.

 

కా॥ ఎన్‌. శంకరయ్య మృతికి నివాళులు

 

స్వాతంత్య్రయోధులు, సిపిఐ(యం) వ్యవస్థాపక సభ్యులు ఎన్‌.శంకరయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో నివాళి కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జె.జయరాం అధ్యక్షతన జరిగింది. ముందుగా శంకరయ్య చిత్రపటానికి వి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా అందరూ ఒక నిమిషం మౌనం పాటించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ శంకరయ్య అఖిల భారత కిసాన్‌సభ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేశారన్నారు. తమిళనాడులో ఆయనకు ప్రముఖ రైతు నాయకుడిగా పేరుందని, మధురైలో వ్యవసాయ కార్మిక సంఘం నిర్మించారని అన్నారు. 1940లోనే పార్టీసభ్యత్వం తీసుకుని స్వాతంత్రోద్యమంలో విద్యార్థి దశలోనే పాల్గొన్నారన్నారు. అయన డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేయకుండా జైలుకు వెళ్తే, ఇప్పుడు ఆ యూనివర్సిటి ఆయనకు డిగ్రీ ప్రధానం చేసిందన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉండడమే కాకుండా, కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణంలో జాతీయ కౌన్సిల్‌ బహిష్కరించి బయటకు  వచ్చిన 32మందిలో శంకరయ్య ఒకరన్నారు. 

అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ శంకరయ్య పార్టీపట్ల అంకిత స్వభావంతో పార్టీ నిర్మాణంలో క్షేత్ర స్థాయి నుంచి నిర్మించారన్నారు. ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజల పట్ల ఎంతో అంకిత స్వభావంతో పని చేశారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శంకరయ్య శత జయంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆయన ఇంటికి వెళ్లి సత్కరించి, 10లక్షల  రూపాయలు అందిస్తే దానిని కరోనాతో బాధపడుతున్న వారికీ ఈ మొత్తాన్ని అందించాలని కోరారని అన్నారు.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరావు మాట్లాడుతూ ఇప్పటికీ తమిళనాడులో బలమైన కమ్యూనిస్టు ఉద్యమం ఉందని అంటే శంకరయ్య, రామ్మూర్తి వంటి వారి కృషి, కార్మికోద్యమాన్ని నిర్మించడంలో వారు చేసిన త్యాగాలే కారణమన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. రమాదేవి, మంతెన సీతారాం, సిహెచ్‌. బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

(జె.జయరాం)

   ఆఫీసు కార్యదర్శి