రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహానికి
తిరుపతి వెంకన్న కాళ్లు పట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
పాచిపోయిన లడ్డూకు జైకొట్టమంటున్న పవన్‌ను కార్యకర్తలు ప్రశ్నించాలి
స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీకీ దోచిపెడుతున్న జగన్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, హామీలు అమలు చేస్తానని, ప్రత్యేక దృష్టితో చూసి గుజరాత్‌కన్నా అభివృద్ధి చేస్తానని వెంకటేశ్వరస్వామి సాక్షిగా తొమ్మిదేండ్ల క్రితం వాగ్దానం చేసిన మోడీ మాట తప్పారని, దీనిపై వెంకన్న సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయవాడలోని ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర కమిటీలో పలు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 30వ తేదీన రాష్ట్ర విభజన తరువాత తిరుపతి, నెల్లూరు సభలో ఇచ్చిన హామీని విస్మరించి ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. తిరుపతి వెంకన్న కాళ్లుమొక్కి, చేసిన తప్పుకు లెంపలేసుకుని ఐదుకోట్లమందికి సంజాయిషీ చెప్పాలని డిమాండు చేశారు. లేదా అక్కడే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో ఆ దేవుడు కూడా క్షమించరని పేర్కొన్నారు. దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఎన్నికలు రాగానే వెంకటేశ్వరస్వామి గుర్తుకొచ్చాడని విమర్శించారు. ఇటీవల బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అంతర్జాతీయ హిందూమహాసభ పెట్టి తమది హిందూయిజం కాదని, హిందూత్వ అని ప్రకటించారని తెలిపారు. హిందూమతం అన్నా హిందువులన్నా వారికి గౌరవం లేదన్నారు. అది ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ప్రాజెక్టనీ పేర్కొన్నారు. హిందువుల్లో అగ్రవర్ణ సంపనున్నలు అదానీ, అంబానీలాంటి వారి ఆధిపత్యం సాధించడమే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రాధాన్యతని తెలిపారు. హిందువుల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో ప్రధానిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విభజన హామీలపై నిలదీయాలని కోరారు.
పవన్‌ను జనసైనికులు ప్రశ్నించాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని, మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని అంటున్నారని, ఇది ఎందుకో చెప్పాలన్నారు. డబుల్ ఇంజన్‌లో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నందుకా పవన్ మోడీని కితాబునిస్తున్నారని ప్రశ్నించారు. హోదా పాచిపోయిన లడ్డు అన్న పవన్ ఇప్పుడు వాటిని తీసుకొచ్చి వెంకన్న కాళ్లదగ్గర పెట్టి క్షమాపణ కోరాలన్నారు. ప్రశ్నించడానికి పుట్టామని చెప్పిన ఆయన మోడీని ప్రశ్నిస్తారా లేదో ప్రజలకు చెప్పాలన్నారు. లేదా జనసేనను ఆర్‌ఎస్‌ఎస్‌లో విలీనంచేయాలనుకుంటున్నారని, గతంలో అతని అన్న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు వంతపాడటంపై జనసైనికులు వపన్‌ను ప్రశ్నించాలని అన్నారు. ఆపద మొక్కులు పెట్టి ప్రజల విశ్వాసాన్ని వ్యాపార వస్తువుగా మార్చొద్దని, భక్తి విశ్వాసాలను రాజకీయకంగా దోపిడీ చేసి అదానీ, అంబానీకి కట్టబెట్టేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. మోడీ జగన్ కలిసి ఎపిని అదానీకి కట్టబెట్టే ప్రయ్నతం చేస్తున్నారని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, సోలార్ ఒప్పందం ఇందులో భాగమేనని అన్నారు. గ్రీన్‌ఎనర్జీలో 58 శాతం అదానీ చేతిలో ఉందని, విద్యుత్‌పై ఆయనకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అదానీ దోపిడీని పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
మోడీ ఆదేశాల మేరకు జగన్ ఒప్పందాలు
మోడీ ఆదేశాల మేరకే జగన్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2.71 పైసలకు ఒప్పందం చేసుకుంటున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా అని ప్రశ్నించారు. గతంలో రూ.2.48 పైసలకు తీసుకుంటేనే విచారణ చేయాలని కోరిన జగన్ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్దఎత్తున ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి రెండేళ్లకోసారి సోలార్ ఉత్పత్తి ఖర్చు తగ్గుతోందని అయినా 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నాని అన్నారు. సోలార్ విద్యుత్ యూనిట్ రూ.0.46 పైసలుకు వస్తుందని, ప్యానల్స్ ధరలు కూడా తగ్గిపోతున్నాయని అన్నారు. ఇప్పటికే రూ.2600 కోట్లు అదానీకి దోచిపెట్టి దాన్ని వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారని తెలిపారు. స్మార్ట్‌మీటర్లు కూడా అదానీ కోసం పెడుతున్నారని అన్నారు. ఒక్కో మీటరు(గృహావసర) రూ.14 వేల నుండి రూ.17 వేలకు, వ్యవసాయ మీటరును రూ.37 వేలకు కొంటున్నారని దేశంలో ఎక్కడా ఇంత రేటు లేదని అన్నారు. స్మార్ట్‌మీటర్ల టెండర్లపై జ్యుడీషియల్ స్క్రూటినీ పెట్టి దోపిడినీ అరికట్టాలని కోరారు. గృహావసర మీటరు రూ.3,500లు, దాని నిర్వహణకు మరో రూ.3500 అవుతోందని అయినా రూ.14 వేలకు కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1.91 కోట్ల విద్యుత్ కనెక్షన్లలో 1.48 కోట్లు గృహావసర కనెక్షన్లని, ఒక్కో కనెక్షన్‌పై రూ.10 వేలు భారం వేస్తున్నారని, వ్యవసాయ కనెక్షన్‌కు రూ.20 వేలు అదనంగా వసూలు చేస్తున్నారని అంటే రూ.20 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని తెలిపారు. స్మార్ట్ మీటర్లు వల్ల విద్యుత్‌లాస్‌ను తగ్గించొచ్చని విద్యుత్ సిఎండి పద్మాజనార్థన్‌రెడ్డి చెబుతున్నారని, అదెలా సాధ్యమో ఆయనే చెప్పాలన్నారు. ఈ పేరుతో 15 శాతం డిస్ట్రిబ్యూషన్ లాస్‌ను కూడా ప్రజల నుండి వసూలు చేయనున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగించిన విద్యుత్ కంటే అదనపు విద్యుత్‌కు బిల్లులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలపై పెనుభారం పడి భవిష్యత్‌లో ఎపి చీకటిమయం అవుతుందని తెలిపారు. ఈ విషయంలో మోడీ, జగన్ ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టాలని, స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండు చేశారు.
సంపన్నుల చేతుల్లోకి అసైన్డ్ భూములు
ప్రభుత్వ నిర్వాకం వల్ల అసైన్డ్ ల్యాండ్ పేదల చేతుల్లో నుండి సంపన్నుల చేతుల్లోకి మారుతోందని, అసలు లబ్దిదారులకే భూములు అప్పగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు పొందిన పేదలకు ఎలా లాభం చేయాలనే అంశంపై ధర్మాన నాయకత్వంలో వేసిన కమిటీ వేర్వేరు రాష్ట్రాల్లో విచారించి అక్టోబరు 11న క్యాబినెట్‌కు నివేదిక సమర్పించిందని తెలిపారు. ఎపిలో 33 లక్షల ఎకరాలు పంచగా 15 లక్షల ఎకరాలు పెద్దల చేతుల్లోకి వెళ్లాయని నిర్థారణ అయిందని తెలిపారు. పేదలకు ఆ భూములను అప్పగించేందుకు అసైన్డ్ చట్టాన్ని సవరించారని తెలిపారు. ఇది పేదలను మోసం చేసేందుకు ఆడుతున్న నాటకమని సిపిఎం గతంలోనే బయటపెట్టిందన్నారు. అయినా వైసిపి ప్రకటనను పేదలు నమ్మారని తెలిపారు. కొంత పరిహారం చెల్లిస్తే భూములు రెగ్యులరైజ్ చేస్తామని ఇటీవల ప్రభుత్వం మెమో విడుదల చేసిన పేదలను నిలువునా ముంచిందని విమర్శించారు. అసైన్డ్ వివరాలు గ్రామ సచివాలయాల్లో పెడతామని తెలిపారని, ఇంతవరకు పెట్టలేదని అన్నారు. ఆక్రమణలో ఉన్న భూములను భేషరతుగా నిజమైన హక్కుదారులు, వారి వారసులకు తిరిగి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఆ పనిచేయకపోతే సిపిఎం ఆధ్వర్యాన పేదలకు భూములను అప్పగించేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మోసంపై జనసేన, టిడిపిలు స్పందించడం లేదని విమర్శించారు.
= = = =