భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 డిసెంబర్, 2023.
పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన ఎంపిలు కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. ఇటీవల కృష్ణా జల వివాదాన్ని పెంచడంతో సహా అన్ని విధాలా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులన్నింటకీ మద్దతునివ్వాలని తమ పార్టీ ఎంపిలను ముఖ్యమంత్రి ఆదేశించడం మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టకరం. వైసిపి, టిడిపి పార్టీల తరపున రాష్ట్రం నుండి ఎన్నికైన ఎంపిలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకు ప్రయత్నించాలని, కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలని సిపిఐ(యం) కోరుతున్నది. రాష్ట్రాభివృద్ధికి, కరువు సహాయానికి నిధులు రాబట్టాలని డిమాండ్ చేసింది. ప్రజలకు నష్టం చేసే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు షరతుతో సహా విద్యుత్ సంస్కరణల బిల్లును తిరస్కరించాలని కోరుతున్నాము.
తుపాను సహాయ చర్యలు చేపట్టాలి
వరి కోతల సమయంలో తుఫాను ముంచుకురావడం కోస్తా జిల్లాల ప్రజానీకం, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని, బాధిత ప్రజలను ఆదుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. పార్టీ కార్యకర్తలు, వలంటీర్లు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి