విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం జిందాల్‌ స్టీల్‌తో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 డిసెంబర్‌, 2023.

 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం జిందాల్‌ స్టీల్‌తో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. 

3వ ఫర్నేస్‌ నిర్వహణను సెయిల్‌కు అప్పగించాలి. 

-సిపిఐ(యం) డిమాండ్‌

విశాఖ స్టీల్‌ప్లాంటులోని ఆధునికమైన బ్లాస్టర్‌నెస్‌ 3ను కేంద్ర ప్రభుత్వం 23 నెలలక్రితం కావాలని మూసివేసింది. ముడిసరుకు కొనడానికి నిధులు లేవనే పేరుతో స్టీల్‌ప్లాంటు ఉత్పత్తి తగ్గించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు 3వ ఫర్నేస్‌ను నడిపేందుకు సెయిల్‌ను కాదని ఇఓఐ పేరుతో జిందాల్‌కు అప్పగించింది. ఒప్పందాన్ని రహస్యంగా వుంచారు. దొడ్డిదారిన ప్రయివేటుపరం చేయడానికి కేంద్రం వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తోంది. విశాఖ ఉక్కును కక్షపూరితంగా అమ్మినా, మూసినా రాష్ట్ర ప్రజానీకం అంగీకరించదు. ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంఫీుభావం ప్రకటిస్తున్నది.

ఈనాడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జిందాల్‌ కంపెనీతో ఒప్పందం చేయడమంటే ప్రయివేటు కంపెనీలను ఏదోవిధంగా స్టీల్‌ప్లాంట్‌లోకి చొప్పించాలని, గతంలో పోస్కో కంపెనీతో ఒప్పందం చేయాలని ప్రయత్నించి, నూరుశాతం అమ్మాలని నిర్ణయించి పూర్తిగా విఫలమైంది. నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ముక్కలు చేసి అమ్మే విధంగా జిందాల్‌ ప్రయివేటు కంపెనీతో నేడు స్టీల్‌ప్లాంట్‌ ఒప్పందం చేసింది.  స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) కేంద్రప్రభుత్వ రంగ స్టీల్‌ పరిశ్రమ. భిలాయ్‌, బొకారో, దుర్గాపూర్‌ పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. సెయిల్‌తో ఒప్పందం చేయడం ద్వారా సెయిల్‌ కంపెనీకి దక్షిణ భారతదేశంలో స్టీల్‌ అమ్ముకోడానికి మార్కెట్‌ సౌకర్యం పెరుగుతుంది. విశాఖ స్టీల్‌ప్లాంటు నడపడానికి కావాల్సిన ముడిసరుకు స్టీల్‌ అథారిటీ సెయిల్‌ విశాఖ స్టీల్‌ప్లాంటుకు పంపగలిగిన శక్తి ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, సెయిల్‌ కంపెనీలు రెండు ఒప్పందం జరగడం ద్వారా ఇద్దరికీ లాభం ఉంటుంది, రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ప్రయివేటు కంపెనీని చేర్చడం ద్వారా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తారు, రిజర్వేషన్లు ఉండవు. ప్రయివేటు కంపెనీలు తమ లాభాలకోసం ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నాశనం చేసేటటువంటి తప్పుడు చర్య ఇది. అందువల్ల స్టీల్‌ప్లాంట్‌ జిందాల్‌ కంపెనీతో చేసిన ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి