బైజూస్‌ ట్యాబ్‌లలో కుంభకోణం.. రూ.1250కోట్లు పక్కదారి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 డిసెంబర్‌, 2023.

 

ఈ రోజు ఉదయం బాలోత్సవ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌ వివరాలు ప్రచురణార్ధం పంపిస్తున్నాము. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

బైజూస్‌ ట్యాబ్‌లలో కుంభకోణం
రూ.1250కోట్లు పక్కదారి 

సమగ్ర విచారణ జరిపించాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి : వై.వెంకటేశ్వరరావు

 

రాష్ట్రప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్ధులకు అందించిన బైజూస్‌ ట్యాబుల్లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ట్యాబ్‌ల కొనుగోలు, అందులోని కంటైంట్‌ కొనుగోళ్లలో రూ.1250కోట్లు దుర్వినియోగం జరిగిందని తెలిపారు. ఈ నిధులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో, రాష్ట్రప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మైటాస్‌ కుంభకోణం తరహాలో బైజూస్‌ కుంభకోణం ఉందన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లల్లో 9,52,925 ట్యాబ్‌లను రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయగా, గతేడాది 5,18,745, ఈ ఏడాది 4,34,185 చొప్పున ట్యాబులు కొనుగోలు చేసిందని వివరించారు. గతేడాది శ్యాంసంగ్‌ ఎ7 అనే మోడల్‌ గల ట్యాబు అమేజాన్‌ వెబ్‌సైట్‌లో కంపెనీనే రూ.11,999లకు అమ్ముతుంటే, రాష్ట్రప్రభుత్వం రూ.13,262లకు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కానీ హోల్‌సెల్‌ ధర రూ.9వేలు మాత్రమే ఉంటుందని చెప్పారు.   ఒక్కొ ట్యాబ్‌ను అదనంగా రూ.4వేలకు కొనుగోలు చేశారని విమర్శించారు. ఈ ఏడాది ఈసర్‌ 1 మోడల్‌ ట్యాబును రూ.17,500లకు కొనుగోలు చేశారని, మార్కెట్‌లో ఇది రూ.14వేలకు మించి లేదన్నారు. హోల్‌సేల్‌లో రూ.12వేలే ఉంటుందని తెలిపారు. ట్యాబుల కొనుగోళ్లల్లో రూ.250కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని విమర్శించారు. ఎన్నికల రాబోతున్న నేపధ్యంలో ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

కంటెంట్‌ కొనుగోలులో 1000కోట్ల కుంభకోణం

ట్యాబుల కొనుగోళ్ల కంటే అదిపెద్ద కుంభకోణం కంటెంట్‌ కొనుగోలులో ఉందని తెలిపారు. ప్రతి ట్యాబ్‌కు బైజూస్‌ కంటెంట్‌కు లైసెన్స్‌ కింద రూ.15,500లు వసూలు చేస్తున్నారని, ఇది రూ.5వేల కంటే మించదని తెలిపారు.  8వ తరగతి విద్యార్ధికి ఇచ్చిన కంటెంట్‌ వచ్చే ఏడాదికి ఉపయోగపడదని, మరలా కొనుగోలు చేయాలని వివరించారు. బైజూస్‌ మూతపడితే కంటెంట్‌ మొత్తాన్ని మార్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ కంపెనీ దివాళా తీసే స్థితికి వచ్చిందని విమర్శించారు. మోసాలకు పాల్పడి అప్పులపాలైందని, ఫారెన్‌ ఎక్స్చెంజ్‌ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటుందని తెలిపారు. 20వేల మంది సిబ్బంది ఉంటే 12వేల మందిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందని,ముగ్గురు డైరెక్టర్లు రాజీనామ చేశారని వివరించారు. బైజూస్‌ వంటి వాళ్లను ఉద్ధరించడానికి కేంద్రప్రభుత్వం ఎన్‌సిఈఆర్‌టికి సంబంధించిన దీక్ష యాప్‌ను  మూలనపడేసిందన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా జాయింట్‌ ప్రాజెక్టుగా ఉన్న ఎన్‌పిటిఎల్‌ను కూడా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఒక వైపు ప్రపంచ మేధావులను తయారు చేస్తామని చెబుతూ మరోవైపు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మన మేధావితనాన్ని తొక్కిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.   

40వేల టీచర్‌ పోస్టులకు ఎసరు

బైజూస్‌ తీసుకొచ్చి ప్రపంచ బ్యాంక్‌ సలహాతో 40వేల టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని,  ఇది పెద్ద నష్టమన్నారు. రాష్ట్రంలో టీచర్‌ పోస్టులు 40వేల ఖాళీలు ఉన్నాయని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఖాళీలు 800, 4వేలు,5వేలు మాత్రమే అంటూ రోజుకొక మాట మారుస్తుందని తెలిపారు. బైజూస్‌ను ఉద్ధరించడం కోసం 40వేల పోస్టులను తగ్గించి నిరుద్యోగులను ప్రభుత్వం బలిచేస్తోందని  పేర్కొన్నారు. ఉన్న టీచర్లపై రకరకాల భారాలు వేస్తూ వేధింపులకు గురిచేసోందని, కనీసం బోధన చేయనివ్వడం లేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై  ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మహత్యాలకు పాల్పడే విధంగా చేస్తున్నారని తెలిపారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ తనలాంటి వాళ్లను మండలానికి ఒక్కరిని తయారు చేశారని చెప్పారు. అధికారులపై ప్రవీణ్‌ ప్రకాష్‌ ఒత్తిడి చేయడంతో వారు ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను ఒక పథకం ప్రకారం  వాటిని మూసేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నాడు`నేడు వంటి పథకాలు నాణ్యత పెంచలేదన్నారు. 

ల్యాబులు పెట్టండి 

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ ల్యాబులు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్యాబుల వల్ల పిల్లలు ఇంటివద్ద పబ్జీ వంటి ఆటలు ఆడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మాత్రం అబద్ధపు ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులతో చర్చించకుండా సిఎం ఇలా అనడం సరికాదని చెప్పారు. పాఠశాలల్లో  స్క్రీన్ల ద్వారా పూర్తిస్థాయి డిజిటల్‌  విద్య నేర్పించవచ్చునని సూచించారు. ట్యాబులు కాకుండా పాఠశాలల్లో డిజిటల్‌ ల్యాబులు పెడితే పిల్లలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. అశాస్త్రీయమైన విధానాలతో విద్య విధానాన్ని ప్రైవేట్‌కు అప్పజెప్పేందుకు బైజూస్‌ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. బైజూస్‌ ఒప్పందాన్ని రద్దు చేసి ఎస్‌సిఈఆర్‌టి వంటి పరిశోధన విభాగాలను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.  బైజూస్‌ కంటే  బెటర్‌గా ప్రభుత్వ ఉపాధ్యాయులు కంటెంట్‌ తయారు చేస్తారని వివరించారు. 100 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు లక్ష చొప్పున వేతనం ఇస్తూ ఈ కంటెంట్‌, సాఫ్ట్‌వేర్‌, మానిటరింగ్‌ ప్రభుత్వం నిర్వహించవచ్చునని సూచించారు. మొత్తం రూ.25కోట్లతో  ఉపాధ్యాయుల చేత వీడియోలు, బోధన చేయించవచ్చునని చెప్పారు. దీనివల్ల ఉపాధ్యాయులు ఆనందపడటంతో పాటు కంటెంట్‌పై ప్రభుత్వానికి హక్కు ఉంటుందని సూచించారు.

అంగన్‌వాడీల జీతాలు పెంచేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం  కుంభకోణాలకు మాత్రం నిధులు మళ్లిస్తోందని విమర్శించారు. అంగన్‌వాడీలను వీధుల్లోకి నెట్టి కన్నీంటిపర్యంతం చేయడం ముఖ్యమంత్రికి తగునా అని నిలదీశారు. ఇప్పటికైనా సిఎం మౌనం వీడి ఇచ్చిన హామీ ప్రకారం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1.05లక్షల మంది అంగన్‌వాడీలు 14 రోజులుగా నిరవధిక సమ్మె  ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చేస్తున్నారని తెలిపారు. వారు గొంతెమ్మ కొర్కెలు కోరడం లేదని, సొంతంగా పెట్టుకున్న డిమాండ్‌ కూడా కాదన్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో తెలంగాణ కంటే రూ.1000లు అధికంగా వేతనం చెల్లిస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ఐదేళ్లు గడిచినా పెంచకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారని చెప్పారు. మాట తిప్పం, మడమ తిప్పమని చెప్పే ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేదోనని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తూ ప్రభుత్వ కార్యక్రమాలను అంగన్‌వాడీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వీరి పట్ల ప్రభుత్వం మానవత దృక్పధం లేకుండా మొండిగా  వ్యవహరిస్తోందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవకుండా సాచివేత ధోరిణి చూపుతూ అంగన్‌వాడీలపై పెద్దఎత్తున తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.   డిమాండ్లపై భినాభిప్రాయాలు ఉంటే చెప్పాలని, కానీ తోటి మహిళలు అనే గౌరవం లేకుండా నోటికొచ్చిన్నట్లు మాట్లాడితే కార్మికవర్గం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టతకు పోకుండా తక్షణమే చర్చలకు పిలిచి న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పది వామపక్ష పార్టీలు కూడా అంగన్‌వాడీ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశాయని గుర్తుచేశారు.