ఆదివాసీల హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలకు ఉరే సరైన శిక్ష ఆదివాసీ జనరక్షణ దీక్ష ప్రారంభంలో వి.శ్రీనివాసరావు

ఈరోజు (9 మార్చి) సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష విజయవాడ (ధర్నాచౌక్‌)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఆదివాసీల హక్కులు హరిస్తున్న 

ప్రభుత్వాలకు ఉరే సరైన శిక్ష

ఆదివాసీ జనరక్షణ దీక్ష ప్రారంభంలో వి.శ్రీనివాసరావు

షెడ్యూలు ప్రాంతాల నుండి వారిని తరమేసే కుట్ర

దీర్ఘాలు తీసే సిఎం దీర్ఘకాల సమస్యలు పరిష్కరించడం లేదు

పోలవరం అతిపెద్ద కుంభకోణం 

దీక్షకు పలు ప్రజా సంఘాల మద్దతు 

 

ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, పైగా అడవులు, భూమి ఆదానీకి కట్టబెడుతూ ఆదివాసీలను షెడ్యూలు ప్రాంతాల నుండి తరిమేసేందుకు కుట్ర చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదివాసీల హక్కులు కాపాడాలని, వారికి ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలని, జిఓ నెంబరు 3పై ఆర్డినెన్స్‌ ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో ఆదివాసీ జనరక్షణ దీక్షను చేపట్టారు. దీక్షలో పాల్గన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పూలమాల వేసి ప్రారంభించారు. అలాగే డిఎస్‌పికి ప్రిపేర్‌ అవుతున్న ఆదివాసీ గ్రాడ్యుయేట్‌ పులి అశోక్‌కు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెల్లి విల్సన్‌, విఆర్‌పురం ఎంపిపి కారం లక్ష్మికి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు పూలమాలలు వేశారు. కూనవరం మండలం పెద ఆర్కూరు సర్పంచ్‌ మడకం నాగమణికి సిఐటియు నాయకులు దయా రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లుకు వృత్తి సంఘాల నాయకులు ఎం.భాస్కరయ్య, సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు అశోక్‌కు దడాల సుబ్బారావు పూలమాలలు వేశారు. తొలుత దీక్షా శిబిరంలోకి వక్తలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తాము చేపట్టిన దీక్ష ఇదివాసీ ప్రజలు చేస్తున్న పోరాటానికి సంఫీుభావం అన్నారు. ఇప్పటికే సిపిఎం ఆధ్వర్యాన రెండు రోజులపాటు మన్యం, ఏజెన్సీలో దీక్షలు జరిగాయని అన్నారు. అరకు పార్లమెంటు అంతా ఐదో షెడ్యూలులో ఉందని అయినా అక్కడ ఆదివాసీల హక్కులను కేంద్రం హరిస్తోందని పేర్కొన్నారు. వారిని బలవంతంగా అడవి నుండి తరిమేసి సహజ వనరులు, మైనింగ్‌, అటవీ సంపదను అదానీకి అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టు పేరుతో గ్రామసభలు కూడా నిర్వహించకుండా భూములు లాగేసుకున్నారని తెలిపారు. మైనింగ్‌, అటవీ సంపదను దోపిడీ చేసేందుకు అదానీలకు అనుకూలంగా విజయనగరం నుండి రాజమండ్రి వరకూ హైవే వేస్తున్నారని, దీనికి రూ.1500 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఏజెన్సీలో రోడ్లులేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, చిన్న చిన్న వంతెనలు కట్టాలని దశాబ్దాలుగా డిమాండు ఉన్నా పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు ఆగమేఘాలమీద హైవే వేయిస్తున్నాయని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతంలో డిగ్రీలు, డిప్లమో హోల్డర్లు, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారని వారికి ఉద్యోగాలు లేవని పేర్కొన్నారు. చట్టపరంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రకటించిన పోస్టుల్లోనూ అన్యాయం చేసిందని అన్నారు. అప్పట్లో ఏజెన్సీలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా గతంలో తిరుగుబాటు జరిగిందని, మరోసారి ఏజెన్సీ ప్రాంతాన్ని అశాంతి నిలయంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అన్యాయంపై ప్రశ్నించిన వారిపై ఉపా లాంటి చట్టాలు తెచ్చి కన్సలైట్ల పేరు చెప్పి కాల్చిపారేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగాలు నూటికి నూరుశాతం వారికే ఇవ్వాలని, ఐదో షెడ్యూలు ప్రకారం చట్టం చేయాల్సి ఉన్నా చేయడం లేదని తెలిపారు. స్పెషల్‌ డిఎస్‌సి పెట్టాలని కోరుతున్నా చేయడం లేదని పేర్కొన్నారు. మాతృభాషా వలంటీర్లకు రూ.5000 ఇస్తున్నారని, వారి ఉద్యోగాలూ రెగ్యులరైజ్‌ చేయడం లేదని తెలిపారు. నా ఎస్‌సి, ఎస్‌టిలు అంటూ దీర్ఘాలు తీసే జగన్‌మోహన్‌రెడ్డి దీర్ఘకాలం వారు బాగుపడే పనిచేయాలని సూచించారు. 2006 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఐదేళ్లలో జగన్‌ ఎన్ని పట్టాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఇప్పుడు భూములను ఖాళీ చేయించి పంపిచేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంటే డ్యాం అనుకుంటున్నారని, సిపిఎం ఆందోళన తరువాత ముంపునకు గురైన పునరాసుల బాధలు ప్రపంచానికి తెలిశాయని తెలిపారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని బిజెపి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, వాస్తవంగా రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా ఉందని, అప్పటికి బిజెపి అధికారంలోకి రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.  ప్రాజెక్టు తాజా అంచనా రూ.55 వేల కోట్లని, అందులో 33 వేల కోట్లు పునరావాసులకు ఇవ్వాలని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. అవేమీ చేయకుండా సిగ్గులేని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి అబద్ధాల కోరు ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. టిడిపి నాయకులయితే ఒకడుగు ముందుకేసి తమ హయాంలో 75 శాతం పూర్తయిందని చెబుతున్నారని, ఆచరణలో 22 శాతానికి మించి పూర్తికాలేదని అన్నారు, ప్రాజెక్టు అంటే పునరావాసం కూడా పూర్తి చేయాలనే ఇంగిత జ్ఞానాన్ని వారు మర్చిపోయారని పేర్కొన్నారు. జగన్‌ నిర్వాసితులను నిలువునా ముంచేశాడని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెంచుతానని చెప్పి 50 కుటుంబాలకు మాత్రమే ఇచ్చి చేతులు ఎత్తేశాడని అన్నారు. నిర్వాసితులపై సిపిఎం ఆందోళన తరువాత సర్వే చేసి అందరికీ 2023 సెప్టెంబరు అక్టోబరులోపు న్యాయం చేస్తామని హామీనిచ్చారని, ఇంతవరకు చేయలేదని అన్నారు. ఇన్ని అన్యాయాలు చేసిన టిడిపి, వైసిపికి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కులేదని పేర్కొన్నారు. అలాగే పోలవరం గైడ్‌వాల్‌ కూలిపోయిందని, కాపర్‌డ్యాం రంద్రాలు పడ్డాయని, డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని అన్నారు. ఇది కాళేశ్వరంకంటే పెద్ద కుంభకోణంగా మారుతోందని, ఆ ప్రాజెక్టు కంటే అధ్వానంగా తయారైందని తెలిపారు. వరదలు వచ్చి జరగరానిది జరిగితే పాత ఉభయగోదావరి జిల్లాలు తుడిచిపెట్టుకుపోతాయని, దీనికి బాధ్యులైన కాంట్రాక్టరు, అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదని అన్నారు. బాధ్యతలేని పాలకులు ప్రజల శవాల గుట్టలపై పేలాలు ఏరుకునేలా తయారయ్యారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పునరావాసానికి నిధులిచ్చి అనంతరం డ్యామ్‌ను పూర్తి చేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెల్లి విల్సన్‌ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలపై సిపిఎం చేపడుతున్న భవిష్యత్‌ పోరాటాలకు సిపిఐ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. వారి పోరాటాల్లో తాము భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. నిరంతరం సామాజిక న్యాయం అని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి గిరిజనుల సమస్యలు పరిష్కరించకుండా ఆ మాట చెప్పడం పచ్చి అబద్ధం అవుతుందని తెలిపారు. జిఓ నెంబరు3పై ఆర్డినెన్స్‌ ఇచ్చి షెడ్యూలు ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల హక్కులు కాపాడాలని డిమాండు చేశారు. కేంద్ర, రాష్ట్రాల తీరుతో ఏజెన్సీలో న్యాయబద్ధ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఇప్పటికీ డోలీల్లో మహిళలను తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏజెన్సీలో ఉందని అన్నారు. అంతకుముందు కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన ప్రదర్శనగా వచ్చి దీక్షకు సంఫీుభావం ప్రకటించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ ఆధ్వర్యాన విప్లవ, గిరిజన పోరాట గీతాలు ఆలపించారు. 

వృత్తిదారుల సంఘ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎం. భాస్కరయ్య మాట్లాడుతూ అమృత ఫలాలు అదానీ, అంబానీలకు అప్పగిస్తూ, గిరిజనుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు.

సిఐటియు రాష్ట్ర నాయకురాలు దయా రమాదేవి మాట్లాడుతూ ఆదివాసీలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపన్నారు. వారి ఓట్లు కావాలి గానీ వారి అభివృద్ధి పట్టడంలేదని మండిపడ్డారు. 

యువజన సంఘ నాయకులు జి.రామన్న మాట్లాడుతూ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, స్పెషల్‌ డిఎస్‌సి ఇచ్చి గిరిజన యువతకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. భాషా వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమండ్‌ చేశారు.

విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్న మాట్లాడుతూ గిరిజనులను అడవుల నుండి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

ఈ దీక్షలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.అశోక్‌, నిరుద్యోగి పులి అశోక్‌ తదితరులు మాట్లాడారు. సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ వందన సమర్పణ చేసి దీక్షను విరమింపచేశారు.