(ఈరోజు (10 జూలై, 2024) సిపిఐ(యం) ప్రెస్‌మీట్ విజయవాడలో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ప్రజలపై భారాలు ఉంచుతారా ? రద్దు చేస్తారా ?
విద్యుత్ శ్వేతపత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్న
ప్రజలపై వేసిన వేలకోట్ల విద్యుత్ భారాలను ఉంచుతారా ? తగ్గిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండు చేశారు. భారాల ప్రస్తావన లేని శ్వేతపత్రం ఆశాభంగం కలిగించిందని అన్నారు. బుధవారం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణతో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన శ్వేతపత్రంలో గత ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విషయాల మీద ఏమీ మాట్లాడలేదని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు తగ్గిస్తారని ప్రజలు ఎదురు చూశారని, వాటికి ఆశాభంగం కలిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాలను ప్రజలపై వేసిందని, అందులో రూ.5000 కోట్లు రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో వచ్చిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారని వివరించారు. ప్రజలపై పడిన భారాలపై సిపిఎం ఆందోళనలు కూడా చేపట్టిందని తెలిపారు. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా భారాలు తగ్గిస్తామని చెప్పి ఈ శ్వేతపత్రంలో మౌనంగా వుండడం పట్ల ఆక్షేపణ తెలిపారు. పైగా గత ప్రభుత్వం చేసిన తప్పులను కొనసాగిస్తోందని అన్నారు. వ్యవసాయబోర్లకు పెట్టిన స్మార్ట్‌మీటర్లు పీకేయాలని లోకేష్ ఎన్నికల ముందు బహిరంగంగా ప్రకటించారని, ఆయనమాట విని రైతులు మీటర్లను ధ్వంసం చేశారని, వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారని అన్నారు. మరో నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్మార్ట్‌మీటర్లపై కోర్టులో కేసు కూడా వేశారని తెలిపారు. శ్వేతపత్రం విడుదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని కొనసాగిస్తామని, సోలార్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారని, ఇది రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్‌లో స్మార్ట్‌మీటర్లు ఉచిత విద్యుత్ ఎగవేసేందుకు మెడమీద కత్తిలా ఉపయోగపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీటర్లు బిగించిన షిర్డిసాయి కంపెనీ వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిరదని తెలుగుదేశం విమర్శించిందని, వేలకోట్ల కుంభకోణంపై సిపియం విచారణ జరపమని గత ప్రభుత్వాన్ని కోరిందని, దీనిపై శ్వేతపత్రంలో కనీసం ప్రస్తావన చేయలేదని అన్నారు. పైగా స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని చెప్పడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. 1999లో మొదటిదశ, 2014లో రెండోదశ ఇప్పుడు మూడోదశ విద్యుత్ సంస్కరణలు అంటున్నారని, దీనివల్ల ప్రజలపై మరిన్ని భారాలు పడతాయని తెలిపారు. అసలు ట్రూఅప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు ఉంచుతారా ఎత్తేస్తారా స్పష్టం చేయాలని డిమాండు చేశారు. డిస్కమ్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచబ్యాంకు పవర్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని కేంద్రం రాష్ట్రాలపై రుద్దిందని, అంటే విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేటీకరిచడమేనని పేర్కొన్నారు. ఇప్పుడున్న భారాలకు తోడు గత రెండేళ్ళకు సంబంధించి ట్రూఅప్ ఛార్జీలు 17 వేల కోట్లు రెగ్యులేటరీ కమిషన్ ముందున్నాయని, వాటిని ఉపసంహరించుకుంటారా ప్రజలపై వేస్తారా చెప్పాలని ప్రశ్నించారు. అదానీ, షిర్డిసాయి విషయంలో ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, ఏజెన్సీ ప్రాంతంలో అదానీకి ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని కోరారు. రూ.17 వేల కోట్ల భారాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటలు అమలు చేయాలని కోరారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విద్యుత్ భారాలు చాలా ముఖ్యమైన అంశంగా ప్రజల్లో ఎజెండాగా మారిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసమగ్రంగా పాక్షికంగా ఉందని అన్నారు. శ్వేతపత్రంలో గత ప్రభుత్వ తప్పులు, లోపాలు, భారాలను బాగానే చెప్పారని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం శ్వేతపత్రం దిశానిర్దేశం చేసేదిశలో లేదని తెలిపారు. ప్రజల ఆశలు, వాగ్దానాలకు అనుగుణంగా ఇందులో లేదని పేర్కొన్నారు. కేంద్రమూ ప్రజలపై భారాలు, నష్టాలకు కారణమవుతోందని, ఈ విషయాన్ని శ్వేతపత్రంలో విస్మరించారని అన్నారు. ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగించాలని సిఎం చెప్పారని, అదే సమయంలో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు విశ్వాసం గలిగించడం ముఖ్యమని అన్నారు. తక్షణం ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అదానీ కంపెనీతో 25 సంవత్సరాల పాటు సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.3800 కోట్ల నష్టం జరుగుతుందని, 25 ఏళ్లలో 90 వేల కోట్లపైన నష్టం వాటిల్లుతుందని వివరించారు. అదానీ కంపెనీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పంద రద్దు గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాటిని వెంటనే రద్దుచేసుకుని చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ మీటర్లతోపాటు ఇంటింటికీ, వ్యాపార సంస్థకూ ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లు బిగించే ప్రక్రియ ప్రారంభించారని, ఇది అదానీ, షిర్డిసాయి కంపెనీలకు మేలుచేసే ఒప్పందాలని అన్నారు. వాటిపై అందరి అభిప్రాయాలు తీసుకుని రద్దు చేయాలని కోరారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సంఘాలు, సంస్థలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని అన్నారు.
విశాఖస్టీలుపై స్పష్టమైన హామీ తీసుకోవాలి
విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించబోమని కేంద్రం నుండి టిడిపి కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఇటీవల మాట్లాడుతూ విశాఖ స్టీలు నష్టాల్లో ఉందని, ప్రైవేటీకరణ అనివార్యం అవుతుందని చెప్పారని పేర్కొన్నారు. మరోవైపు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీలును ప్రైవేటీకరించబోమని చెబుతున్నారని ఇద్దరూ కలిసి ప్రభుత్వం నడుపుతూ విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి ఎంపిలు కూడా పార్లమెంటులో గణనీయంగా ఉన్నారని, వారంతా రానున్న పార్లమెంటులో లేవనెత్తి ప్రయివేటీకరణ ఆపేందుకు కేంద్రం నుండి స్పష్టమైన హామీ తీసుకోవాలని డిమాండు చేశారు.
ఆల్ట్రాటెక్ యాజమాన్యంపై ప్రభుత్వ ఉదాసీనత
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ఆల్ట్రాటెక్ కంపెనీలో జరిగిన ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయి, మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో ఉంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. ఇది పొరపాటున జరిగింగి కాదని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యగా పరిగణించి యాజమాన్యంపై కొత్తచట్టం 103 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. కార్మిక సంఘాల కోర్కె మేరకు జిల్లా కలెక్టర్ తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఊరుకు ఆనుకుని కంపెనీకి ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పైగా స్థానికులకు ఉద్యోగాలు లేవని, పదేళ్లుగా చేస్తున్నా రూ.12 వేలు వేతనం మాత్రమే ఇస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సగటున ఏడాదికి 70 నుండి 80 పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయని 700 నుండి వెయ్యి మందికి తీవ్రంగా గాయాలపాలవుతున్నారని అన్నారు. ఎల్‌అండ్‌టి, ఫార్మా కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రజల ధనంతో ఊరేగుతూ వారి రక్షణ పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ మాట్లాడుతూ కంపెనీ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని, సిఎస్‌ఆర్ నిధులు పంచాయతీకి ఇవ్వడం లేదని తెలిపారు. ఆస్పత్రి, స్కూలు లేదని అన్నారు. కంపెనీ చుట్టుపక్కల ఉన్న వారంతా గిరిజనులని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పదిరోజుల నుండి ఆందోళన వ్యక్తం చేస్తుంటే వారిని పట్టించుకోకుండా పోలీసులతో కొట్టించారని అన్నారు. గతంలో ప్రమాదం జరిగిన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డుల్లో రాసుకున్నారని తెలిపారు. ఇప్పటికి మూడుసార్లు ప్రమాదాలు జరిగాయని అన్నారు. ప్రమాదం విచారించి బాధ్యులపైనా, ప్రజలపై దాడిచేసి కొట్టిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ లోపలకు వెళ్లడానికి లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారని అన్నారు. కార్మికశాఖ మంత్రి ఆస్పత్రిలో రోగులను చూసినా, కంపెనీ వద్దకు వెళ్లకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
= = = =