భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 20 జూలై, 2024.
గత మూడు రోజులుగా బంగాళాఖాతంలోని వాయుగుండం ఫలితంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది ఇళ్లు, వేలాది ఎకరాల పంటలు, పశు వులు తీవ్రంగా నష్టపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలుచేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి వేలేరుపాడు మండలం మొత్తంగా తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణా రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలంలో ఉందని, ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండలంలో ఉన్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలను గత 5సం॥లుగా పాలించిన ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యమే నేటి పెద్దవాగు విపత్తుకు కారణమని విమర్శించారు. ఉభయ రాష్ట్రాల ఉమ్మడి అంశాలు, ఆస్తుల విషయంలో జరిగిన తాత్సారమే ప్రధానకారణమన్నారు. 15 గ్రామాలలో జనావాసాలు నేలమట్టమయ్యాయని, వందలాది పశువులు మృత్యువాత పడ్డాయని తెలిపారు. కరెంటు స్థంబాలు పడిపోయి, గ్రామాల మధ్య రహదారులు గండ్లు పడి ఆ మండలం మొత్తంగా ఇతర ప్రాంతాలతో అన్ని సంబంధాలు తెగిపోయాయి. బాధిత ప్రజలు నిస్సహాయులుగా ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ, ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాలలో వాగులు, ఏరులు పెద్దఎత్తున ప్రవహిస్తున్న ఫలితంగా గండ్లు పడి వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయని అన్నారు.
గోదావరి, శబరి, సీలేరు నదులు వరద తాకిడితో పరిసరాల్లో ఉన్న వందలాది గ్రామాల్లో మునక భయంతో ప్రజలు మెరక ప్రాంతాలకు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు. విలీన మండలాల్లో తక్షణం యుద్ధ ప్రాతిపదికన వరద ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలలో పర్యటించి, పూర్తిస్థాయిలో బాధిత ప్రజలకు రక్షణ, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ జిల్లాలన్నింటా పార్టీ శ్రేణులు వెంటనే పర్యటనలు చేయాలని, బాధిత ప్రజలకు సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం నాయకత్వంలో సిపియం బృందం వరద బాధిత ప్రాంతాల్లో రేపు పర్యటించనుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి