విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 జూలై, 2024.

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి

కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సహాయపడతామని ఒకవైపు చెబుతూనే నిజాయితీగా అటువంటి ప్రయత్నమేమీ చేయకపోవడాన్ని  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమే ప్రధానమైన సమస్య. దీని వలన ప్రతి సంవత్సరం మిగిలిన స్టీల్‌ ప్లాంట్ల కంటే అదనంగా రూ. 3 వేల కోట్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఖర్చు పెడుతున్నది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అక్కడ యూనియన్లు అనేక సంవత్సరాల నుండి పోరాడుతున్నారు. ఈ విషయంపై జూలై 30వ తేదీన జనసేన పార్లమెంట్‌ సభ్యులు వి.బాలశౌరి స్టీల్‌శాఖ మంత్రిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వాన్ని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కొరకు సొంత గనులు కేటాయించమని అడిగిందా? అని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఒడిశా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు, అయినా ఒడిశా ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మరియు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను కోరినా ఇంత వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించలేదని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సమాధానమిచ్చారు.

నేడు ఒడిశా రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం పెద్ద సమస్య కాదు. అందువలన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై బిజెపికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే ఒడిశా ప్రభుత్వం గనులు కేటాయించేటట్లు చూడాలి. ఈ సమస్యపై రాష్ట్రానికి చెందిన బిజెపి పార్లమెంటు సభ్యులు పెదవి విప్పకపోవడం అన్యాయం.

ఇప్పటికైనా బిజెపి కేంద్ర ప్రభుత్వంపై టిడిపి మరియు జనసేన పార్టీల పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తీసుకువచ్చి ఒడిశా ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేట్టు చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి