భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఆగష్టు, 2024.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా
సిపిఐ(యం) నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంగా పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో సిపిఐ(యం) నాయకులను, ప్రజాసంఘాల ముఖ్య కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
మడకశిరలో ఫించన్‌ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అకారణంగా సిపిఐ(యం), ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. ఎటువంటి ఆందోళనా, కార్యక్రమాలకు సిపిఐ(యం) పిలుపునివ్వకపోయినా గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సిపిఐ(యం) నాయకులు పెద్దన్న, రమేష్, గంగాధర్, వెంకట్రాముడు లను అరెస్టు చేసి పెనుకొండ పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. మడకశిరలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌లను గృహ నిర్బందం చేశారు.
గత వైసిపి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వస్తే, అక్కడి వామపక్షపార్టీల నాయకులను ముఖ్యంగా సిపిఎం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, ఉద్యమాల పట్ల నిరంకుశంగా వ్యవహరించింది. ఈ నిరంకుశ అప్రజాస్వామిక చర్యలను ఎన్నికల్లో ప్రజలు నిరసించారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఈ పద్ధతులను విమర్శించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదే నిర్బంధ చర్యలను కొనసాగించడం సరైంది కాదు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సిపిఐ(యం) కోరుతున్నది. అరెస్టు చేసిన సిపిఐ(యం) నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి