భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 ఆగష్టు, 2024.
ఉపాధిహామీ ఉసురు తీయడానికే జాబు కార్డుల తగ్గింపు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం ద్వారా పని చేయడానికి పొందిన జాబు కార్డులను ఏకంగా 35 లక్షలు తొలగించినట్లు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ తొలగింపును సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. పనిచేసే వారి సంఖ్య తగ్గిందని చెప్పి బడ్జెట్‌లో కోతపెట్టడానికి కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి వుంది. గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు (జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా) జాబు కార్డు తీసుకోవచ్చు. కాబట్టి తక్షణమే రద్దును ఉపసంహరించుకోవాలి.
గ్రామీణ ఉపాధిహామీ చట్టం వచ్చినప్పటి నుండి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 80 లక్షలు జాబు కార్డులు ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఇందులో ఏ సంవత్సరం 60`70% మించి పనులు కల్పించలేదు. పనికోసం అర్జీలు పెట్టుకొన్నా పని చూపడం లేదు. పని చూపకపోతే వేతనంలో 50% నిరుద్యోగభృతి చెల్లించాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కరికీి నిరుద్యోగ భృతి చెల్లించలేదు. గడిచిన 10 ఏళ్ళలో గ్రామీణ పేదల కుటుంబాలలో పిల్లలు పెద్దవారై పెళ్ళి చేసుకొని విడిగా ఉంటున్నా పాత జాబు కార్డులతోనే పని చేస్తున్నారు. గతంలో ఒక జాబ్ కార్డుపై ఇద్దరు పని చేస్తే ప్రస్తుతం నలుగురు పనిచేయడంతో త్వరగా 100 రోజులు పూర్తవుతున్నాయి. 16 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి జాబ్‌కార్డు ఇవ్వాలని చట్టంలోనే ఉంది. ఈ చట్టాన్ని పక్కకు నెట్టి పేదలకిచ్చే నిధులకు కోత పెట్టడానికి జాబ్‌కార్డులు తగ్గించారు. కాబట్టి కార్డులను కుదించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
మంగళగిరి ఎయిమ్స్ లో ఖాళీలు భర్తీ చేయాలి.
మంగళగిరి ఎయిమ్స్ బోధనా సిబ్బంది ఖాళీలు 48%, భోతనేతర సిబ్బంది ఖాళీలు 32.5% వెంటనే భర్తీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. 38 మంది డాక్టర్లు రాజీనామా చేయడంపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఎఐఎంఎస్ ను కేటాయించింది. సామాన్య ప్రజలకు ఎయిమ్స్ వైద్యం అందుబాటులోను, ఉపయోగకరంగా ఉన్నది. బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, డాక్టర్లు ఖాళీలు భర్తీ చేస్తే సామాన్య ప్రజలకు మేలు చేకూరుతుంది. కాబట్టి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి